Rajasthan Election 2023: గహ్లోత్‌కు సొంతింట సమస్యలు

8 Nov, 2023 09:02 IST|Sakshi
సర్దార్‌పురా నియోజకవర్గంలో ఎన్నికల అధికారికి నామినేషన్‌ పత్రాలను అందజేస్తున్న సీఎం అశోక్‌ గెహ్లోత్‌  

సర్దార్‌పురా. కాంగ్రెస్‌ పాలిత రాజస్థాన్‌లో ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న స్థానం. ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న సర్దార్‌పురాలో ఎన్నెన్నో సమస్యలు సీఎంను చీకాకు పెడుతున్నట్టు వస్తున్న వార్తలు కాంగ్రెస్‌ పార్టీని కలవరపరిచేవే. వాటిని హైలైట్‌ చేస్తూ, సీఎం సెగ్మెంట్లోనే సమస్యల పరిష్కారానికి దిక్కు లేదంటూ బీజేపీ రాష్ట్రమంతటా ప్రచారాన్ని హోరెత్తిస్తోంది..

సర్దార్‌పురా అసెంబ్లీ స్థానం రాజస్తాన్‌లో గత పాతికేళ్ల నుంచీ అందరి నోళ్లలోనూ నానుతూ వస్తోంది. సీఎం అశోక్‌ గెహ్లోత్‌ ఇక్కణ్నుంచి తొలిసారి 1998లో ఉప ఎన్నికలో నెగ్గారు. ఆ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పీసీసీ చీఫ్‌గా ఆయన సారథ్యంలో కాంగ్రెస్‌ ఘనవిజయం సాధించింది. 200 అసెంబ్లీ స్థానాలకు గాను ఏకంగా 153 సీట్లు గెలుచుకుంది. దాంతో గెహ్లోత్‌ తొలిసారి సీఎం పీఠమెక్కారు. అప్పటినుంచీ ఇక్కడ వరుసగా ఆయనే గెలుపొందుతూ వస్తున్నారు. సర్దార్‌పురాలో కాంగ్రెస్‌ మొత్తమ్మీద 8సార్లు నెగ్గగా రెండుసార్లు బీజేపీ గెలిచింది.

గెహ్లోత్‌ తొలిసారి నెగ్గేందుకు ముందు 1990, 1993ల్లో బీజేపీ తరఫున రాజేంద్ర గెహ్లోత్‌ ఇక్కడ రెండుసార్లు గెలిచారు. 1998 నుంచి అశోక్‌ గెహ్లోత్‌ హవాయే సాగుతూ వస్తోంది. 2008లో బీజేపీ నుంచి మరోసారి బరిలో దిగిన రాజేంద్ర గెహ్లోత్‌ 15 శాతానికి పైగా ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఇక 2013, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ శంభుసింగ్‌ ఖేత్సర్‌ను బరిలో దించినా లాభం లేకపోయింది. గెహ్లోత్‌ చేతిలో ఆయన వరుసగా 13 శాతం, 30 శాతానికి పైగా ఓట్ల తేడాతో ఓడారు. 

అయినా... 
స్వయంగా సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్నా తమ సమస్యలకు మాత్రం ఎండ్‌ కార్డు పడటం లేదన్నది సర్దార్‌పురా వాసుల ఆవేదన. వానాకాలం వస్తే చాలు, ఎక్కడ చూసినా నీరు నిలిచిపోయి తమ బతుకు దుర్భరమవుతుందని శివ్‌సింగ్‌ రాథోడ్‌ అనే స్థానికుడు వాపోయాడు. ‘‘రోడ్లు దారుణంగా ఉన్నాయి. డ్రైనేజీ అవ్యవస్థ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ప్రతి వానాకాలంలోనూ డ్రైనేజీలు పొంగిపొర్లడం, రోడ్లన్నీ నీటితో నిండిపోవడం నియోజకవర్గంలో చాలాచోట్ల సాధారణ దృశ్యం. సీఎం సెగ్మెంట్‌లోనే ఇలాంటి సమస్యలకు దశాబ్దాలుగా మోక్షం దక్కకపోవడం నిజంగా దారుణం’’అన్నాడాయన. 

కాలనీలే మునిగాయి...! 
2021 వర్షాకాలంలోనైతే డ్రైనేజీలు పొంగి పొర్లి సర్దార్‌పురా పట్టణంలో కాలనీలకు కాలనీలే నీట మునిగాయి! దాంతో సహాయక చర్యల కోసం ఏకంగా సైన్యాన్ని రంగంలోకి దించాల్సిన పరిస్థితి తలెత్తింది!! రెండేళ్లు గడిచిపోయినా సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా ఒక్క చర్య కూడా తీసుకోలేదని గోపాల్‌సింగ్‌ అనే స్థానికుడు ఆవేదన వెలిబుచ్చాడు. నియోజకవర్గంలో చాలాచోట్ల డ్రైనేజీ నీళ్లతోనే కూరగాయలు పండిస్తున్నారంటూ రాథోడ్‌ ఆందోళన వెలిబుచ్చాడు.

ఇది చాలా ఏళ్లుగా జరుగుతున్నా యంత్రాంగం పట్టించుకోవడం లేదన్నది స్థానికుల ఫిర్యాదు. గెహ్లోత్‌ కేవలం తన సామాజికవర్గం ఓట్లు ఎక్కువగా ఉన్న కొన్ని ప్రాంతాలకు మాత్రమే అభివృద్ధిని పరిమితం చేయడమే ఈ సమస్యకు మూల కారణమని బీజేపీ ఆరోపిస్తోంది. 

మాలీలే ఎక్కువ... 
సర్దార్‌పురాలో మాలీ సామాజికవర్గం వారి సంఖ్య చాలా ఎక్కువ. తర్వాతి స్థానంలో ఓబీసీలుంటారు. ఇక జాట్లు, మహాజన్‌లు, ఎస్సీ, మైనారిటీలూ ఎక్కువగానే ఉన్నారు.
చదవండి: జడ్జీలను ‘ఎంచు’కుంటోంది: కేంద్రంపై సుప్రీం మండిపాటు 

సర్దార్‌పురా అసెంబ్లీ స్థానం విశేషాలు.. 
జోధ్‌పూర్‌ జిల్లా నట్టనడుమ ఉన్న అసెంబ్లీ స్థానమిది. మహరాజు సర్దార్‌సింగ్‌ పేరిట దీనికి ఈ పేరొచ్చింది. ఇక్కడ ఆరు శతాబ్దాల నాటి మెహ్రాన్‌గఢ్‌ కోట ఉంది. దాని పక్కనే 300 ఏళ్ల కింద సర్దార్‌సింగ్‌ నిర్మించిన ఘంటా ఘర్‌ ఇప్పటికీ ఉంది. ఆ పక్కనే ఉన్న సర్దార్‌ మార్కెట్‌ కూడా ఆయన హయాంలో వచి్చనదే. 

సర్దార్‌పురా.. సమస్యల చిట్టా... 
రాజస్తాన్‌లోని అతి పెద్ద అసెంబ్లీ స్థానాల్లో సర్దార్‌పురా ఒకటి. స్వయానా సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానం. అయినా ఇక్కడ సమస్యలకు మాత్రం కొదవ లేదు...! 
► అధ్వానమైన రోడ్లు 
► దారుణమైన డ్రైనేజీ వ్యవస్థ 
► తీవ్రమైన తాగునీటి సమస్య 
► వాననీరు పోయే ఏర్పాట్ల లేమి 
► ప్రతి సీజన్లోనూ నీట మునిగే కాలనీలు 
►ఆరోగ్య సేవలు, వసతులకు తీవ్ర కొరత 
►కలుషిత నీటితో పంటల సాగు 

♦ మొత్తం ఓటర్లు 2,54,572 మంది
♦పురుషులు1,29,869 మంది
♦ స్త్రీలు1,24,703 మంది 
♦మొత్తం పోలింగ్‌ కేంద్రాలు - 212 
♦పోలింగ్‌ తేదీ నవంబర్‌ 25

చదవండి: ధుంధాడ్‌లో దూకుడెవరిదో! 

మరిన్ని వార్తలు