దళితబంధు లాగా మైనార్టీల బంధు ఇవ్వాలి: రేవంత్‌రెడ్డి

14 Aug, 2021 17:30 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ హయాంలోనే మైనార్టీలకు మేలు జరిగిందని, దళితబంధు లాగా మైనార్టీ బంధు ఇవ్వాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. శనివారం కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన మైనార్టీ గర్జనలో ఎంపీ రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మైనార్టీలకు 4శాతం రిజర్వేషన్ కల్పించారని గుర్తుచేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ తీసుకొచ్చి పేద విద్యార్థులు ఉన్నత విద్య అభ్యసించే అవకాశం కల్పించారని తెలిపారు.

కేసీఆర్ 12శాతం రిజర్వేషన్ కల్పిస్తామని హామి ఇచ్చి మరిచిపోయాడని మండిపడ్డారు. మైనార్టీలు ఒకసారి ఆలోచించాలని, రాష్ట్రపతి, ముఖ్యమంత్రి వంటి కీలకమైన పదవులు ముస్లింలకు ఇచ్చింది కాంగ్రెస్ మాత్రమేనని గుర్తుచేశారు. యువత ఆత్మహత్యలు చూడలేక సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మీదే, దాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత కూడా మీదేనని, కారునో, పతంగినో నమ్ముకొని మోసపోవద్దని రేవంత్‌ రెడ్డి పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు