రాహుల్‌తో భేటీ.. సొంతగూటికి పైలట్‌?!

10 Aug, 2020 17:39 IST|Sakshi

రాహుల్‌ గాంధీ నివాసంలో దాదాపు 2 గంటల పాటు చర్చలు

జైపూర్‌: అసెంబ్లీ సమావేశాలు సమీపిస్తోన్న తరుణంలో రాజస్తాన్‌ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తిరుగుబాటు నేత సచిన్‌ పైలట్‌ నేడు రాహుల్‌ గాంధీ నివాసంలో ఆయనతో భేటీ అయ్యారు. దాదాపు రెండు గంటల పాటు ఈ సమావేశం కొనసాగింది. పార్టీలో చీలిక, తాజా రాజకీయ పరిణామాలపై పైలట్‌, రాహుల్‌, ప్రియాంక గాంధీలతో చర్చించారు. ఈ నేపథ్యంలో తాజా భేటీతో రాజస్తాన్‌ రాజకీయ సంక్షోభానికి తెర పడనున్నట్లు సమాచారం. పైలట్‌ను బుజ్జగించడంలో అధిష్ఠానం సఫలీకృతమయినట్టు తెలుస్తోంది. ఈ చర్చల్లో సచిన్ పైలట్ మనోవేదనను అధిష్టానం అర్థ చేసుకుందని.. అశోక్ గహ్లోత్‌ పనితీరుతో సహా రాజస్తాన్‌కు సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి రాహుల్‌ గాంధీ అంగీకరించారని సమాచారం. (గహ్లోత్‌కు మద్దతుగా పైలట్‌ వర్గం!)

‘ఘర్-వాప్సి’ సూత్రంలో భాగంగా సచిన్‌ పైలట్‌ కోల్పోయిన ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ పదవులను పొందే అవకాశం ఉన్నట్లు సమాచారం. సోమవారం రాత్రి వరకు పైలట్‌ నుంచి సానుకూల ప్రకటన వెలువడనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అశోక్ గహ్లోత్‌ ప్రభుత్వంపై తిరుగుబాటును ప్రకటించినందుకు సచిన్ పైలట్‌తో పాటు అతని వర్గం నేతలను కాంగ్రెస్ పదవి నుంచి తొలగించిన సంగతి తెలిసిందే. అనంతరం ప్రియాంక గాంధీ పైలట్‌తో చర్చలు జరిపారు. ఆ తర్వాత కూడా ఈ చర్చలు కొనసాగుతున్నాయి. రాజస్తాన్ అసెంబ్లీ సమావేశాలు ఆగస్టు 14 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇరువర్గాలు చర్చలు ముమ్మరం చేశాయి. ఈ క్రమంలో తిరుగుబాటు ఎమ్మెల్యేలు తిరిగి వస్తే  స్వాగతిస్తామని గహ్లోత్‌ పేర్కొన్నారు. (సత్యం పక్షాన నిలబడండి)

అశోక్‌ గహ్లోత్‌ను వ్యతిరేకిస్తూ.. సచిన్ పైలట్‌తో పాటు 19 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీని వీడిన విషయం తెలిసిందే. దీంతో డిప్యూటీ సీఎం పదవి నుంచి సచిన్ పైలట్ నుంచి తప్పించారు.  సచిన్ పైలట్ తాను బీజేపీలో చేరడం లేదని ప్రకటించిన నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం ఆయనతో మంతనాలు జరుపుతూనే ఉంది. 
 

మరిన్ని వార్తలు