నిమ్మగడ్డది అప్పుడో మాట.. ఇప్పుడో మాట

25 Mar, 2021 03:50 IST|Sakshi

పరిషత్‌ ఎన్నికలకు వ్యాక్సిన్‌ సాకు 

హోదాను తాకట్టు పెట్టి.. ప్యాకేజీకి ఒప్పుకున్నది చంద్రబాబే 

వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి 

సాక్షి, అమరావతి: మండల, జిల్లా పరిషత్‌ ఎన్నికలు నిర్వహించకపోవడానికి ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ కోవిడ్‌ వ్యాక్సిన్‌ను సాకుగా చూపుతున్నారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. నిమ్మగడ్డ అప్పుడో మాట.. ఇప్పుడో మాట మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం మీడియాతో సజ్జల మాట్లాడుతూ.. కేవలం ఆరు రోజుల్లో పూర్తయ్యే పరిషత్‌ ఎన్నికలకు నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ కోవిడ్‌ వ్యాక్సిన్‌ను సాకు చెప్పి వాయిదా వేయడంపై ఆయన మండిపడ్డారు. కోవిడ్‌ వ్యాక్సిన్‌ కోసం నాడు ఎన్నికలు వాయిదా వేయమని ప్రజల సాక్షిగా కోరినా అప్పుడు నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ వినలేదని తెలిపారు.

ప్రభుత్వం ఈ ఆరు రోజుల్లో ఎన్నికలు పూర్తి చేసి కోవిడ్‌పై దృష్టి పెట్టాలనుకుంటోందని స్పష్టం చేశారు. రానున్న ఎస్‌ఈసీని కూడా ప్రభుత్వం అదే కోరుతుందని చెప్పారు. వ్యాక్సినేషన్‌ ప్రక్రియను ఉధృతం చేయాలని సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారని చెప్పారు. ప్రత్యేక హోదా విషయంలో ప్రతిపక్షంలో ఉండగా చాలా పోరాడామని సజ్జల గుర్తు చేశారు. హోదా కోసం చంద్రబాబులా దొంగాట ఆడబోమని, పోరాటం చేస్తూనే ఉంటామని తెలిపారు. విభజన చట్టంలో ఇచ్చిన మాట ప్రకారం ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు.

పంచాయతీ, మునిసిపల్‌ ఎన్నికల్లో ప్రజలిచ్చిన తీర్పును టీడీపీ నేత చంద్రబాబు జీర్ణించుకోలేక మతిభ్రమించి వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. తెలుగు తమ్ముళ్లను భ్రమలో పెట్టేందుకే చంద్రబాబు రోజుకో రకంగా చిందులేస్తున్నాడని ఎద్దేవా చేశారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను సీఎం జగన్‌ ముందు నుంచీ వ్యతిరేకిస్తున్నారని, దీనిని రక్షించుకునేందుకు అవసరమైన అన్ని ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. ఈ నెల 26న ఉక్కు కార్మీకులు తలపెట్టిన బంద్‌కు వైఎస్సార్‌సీపీతో పాటు, ప్రభుత్వం సంపూర్ణ మద్దతు ప్రకటించిందని చెప్పారు.   

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు