కాంగ్రెస్‌ బీసీ నేతల చలో ఢిల్లీ

27 Sep, 2023 04:59 IST|Sakshi

నేడు ఖర్గేను కలవనున్న టీం బీసీ బృందం

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ కాంగ్రెస్‌లోని బీసీ నాయకులు ఢిల్లీ బయలుదేరారు. ఇటీవల గాంధీభవన్‌లో జరిగిన టీం బీసీ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు అధిష్టానం పెద్దలను కలిసేందుకు మంగళవారం హస్తిన పయనమయ్యారు. మాజీ ఎంపీ వి. హనుమంతరావు, టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, ఓబీసీ జాతీయ సమన్వయకర్త కత్తి వెంకటస్వామి మంగళవారమే ఢిల్లీ వెళ్లగా, మధుయాష్కీగౌడ్, పొన్నం ప్రభాకర్, అంజన్‌కుమార్‌ యాదవ్, గాలి అనిల్‌కుమార్, సురేశ్‌ షెట్కార్‌ తదితరులు బుధవారం బయలుదేరనున్నారు.

వీరంతా బుధ లేదా గురువారాల్లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలవనున్నారని గాంధీభవన్‌ వర్గాలు తెలిపాయి. త్వరలోనే ఖరారు చేయనున్న అసెంబ్లీ అభ్యర్థుల జాబితాలో బీసీలకు కనీసం 34 స్థానాలు కేటాయించడమే ఎజెండాగా తెలంగాణ బీసీ నేతలు ఢిల్లీ బయలుదేరారు.ఇచ్చిన మాట నిలబెట్టుకోండి: ప్రదేశ్‌ ఎన్నికల కమిటీ, రాజకీయ వ్యవహారాల కమిటీలో ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలోని ప్రతి లోక్‌సభ స్థానంలో రెండు అసెంబ్లీ సీట్ల చొప్పున మొత్తం 34 సీట్లను బీసీలకు కేటాయించాలని కోరుతూ టీం బీసీ నేతలు మంగళవారం హైదరాబాద్‌లో ఉన్న ముఖ్య నేతలను కలిశారు.

మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్లు అంజన్‌కుమార్‌ యాదవ్, మహేశ్‌ కుమార్‌ గౌడ్, సురేశ్‌షెట్కార్, గాలి అనిల్‌కుమార్, ఎర్రశేఖర్, సంగిశెట్టి జగదీశ్వరరావు తదితరులు రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంచార్జి మాణిక్‌రావ్‌ ఠాక్రే, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో పాటు స్క్రీనింగ్‌ కమిటీ సభ్యుడు మధుయాష్కీగౌడ్‌ను కలిసి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. బుధవారం అందుబాటులో ఉన్న నేతలు నల్లగొండ ఎంపీ, స్క్రీనింగ్‌ కమిటీ సభ్యుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని కూడా కలవనున్నారు.

మరిన్ని వార్తలు