వచ్చేది డబుల్‌ ఇంజిన్‌ సర్కారే కేంద్రమంత్రి బీఎల్‌ వర్మ 

30 Aug, 2022 01:28 IST|Sakshi
తమ్మినేని కృష్ణయ్య కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్న కేంద్రమంత్రి బీఎల్‌.వర్మ    

సాక్షి ప్రతినిధి, ఖమ్మం: టీఆర్‌ఎస్‌ పాలనలో రాష్ట్ర ప్రజలు విసిగిపోయారని, ఇక ఇక్కడ బీజేపీ ఆధ్వర్యంలో డబుల్‌ ఇంజిన్‌ సర్కారే వస్తుందని ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి, కేంద్ర సహకార శాఖల మంత్రి బీఎల్‌ వర్మ అన్నారు. సోమవారం ఖమ్మం జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన నేలకొండపల్లిలో కొనసాగుతున్న ఖమ్మం– కోదాడ జాతీయ రహదారి పనులను పరిశీలించారు.

అనంతరం ఖమ్మంలో మీడియాతో మాట్లాడుతూ దళితులకు మూడెకరాలు ఇస్తామని సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీని ఆయన మరిచిపోయారని ఎద్దేవా చేశారు. ఖమ్మంలో బీజేపీని బలోపేతం చేసే దిశగా పార్టీ ముఖ్యనేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. తర్వాత తెల్దార్‌పల్లికి వెళ్లి, ఇటీవల హత్యకు గురైన టీఆర్‌ఎస్‌ నేత తమ్మినేని కృష్ణయ్య కుటుంబసభ్యులను పరామర్శించారు.

ఏ1గా ఉన్న నిందితుడి పేరును ఏ9గా మార్చారని, తమ ప్రాణాలకు కూడా రక్షణ లేదని మృతుడి కుటుంబీకులు కేంద్రమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, పరారీలో ఉన్న నిందితులను అరెస్టు చేయాలని పోలీసులకు సూచించారు. ఎఫ్‌ఐఆర్‌ కాపీని కృష్ణయ్య కుమారుడు నవీన్‌ ద్వారా తీసుకున్నారు. బీజేపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకుడిని హత్య చేసినా ఆ ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకోలేదన్నారు.

మునుగోడులో రాజకీయం కోసం తహతహలాడుతున్న కేసీఆర్‌ ఈ హత్యను గాలికి వదిలేశారని విమర్శించారు. సమావేశంలో బీజేపీ తమిళనాడు రాష్ట్ర సహ ఇన్‌చార్జి పొంగులేటి సుధాకర్‌రెడ్డి, కిసాన్‌ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్‌రెడ్డి, ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల బీజేపీ అధ్యక్షులు గల్లా సత్యనారాయణ, కోనేరు చిన్ని పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు