ఓట్ల కొనుగోలుకు రూ. 5.22 కోట్లు 

30 Oct, 2022 02:43 IST|Sakshi

రాజగోపాల్‌రెడ్డి కంపెనీ ఖాతాల నుంచి మునుగోడులో 23 ఖాతాల్లో జమ 

ఉప ఎన్నికలో ఓటర్ల కొనుగోలుకే ఈ డబ్బు బదిలీ 

ఎన్నికల సంఘం, పరిశీలకులకు టీఆర్‌ఎస్‌ ఫిర్యాదు 

ఆ సొమ్మును తక్షణమే స్తంభింపజేయాలని డిమాండ్‌

సాక్షి, హైదరాబాద్‌: మునుగోడు ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి చెందిన కంపెనీ ఖాతాల నుంచి నియోజకవర్గ పరిధిలోని వివిధ వ్యక్తుల ఖాతాల్లోకి బదిలీ చేసిన రూ. 5.22 కోట్లను ఫ్రీజ్‌ చేయాలని టీఆర్‌ఎస్‌ డిమాండ్‌ చేసింది. ఎలాంటి వ్యాపారాలు లేకున్నా డబ్బు పొందిన బీజేపీ నేతలతోపాటు పలు సంస్థలు, కంపెనీల ఖాతాలను వెంటనే స్తంభింపజేయాలని చేయాలని కోరింది.

ఈ మేరకు టీఆర్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శి భరత్‌కుమార్‌ గుప్తా కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలతోపాటు మునుగోడు ఎన్నికల పరిశీలకులకు ఫిర్యాదు చేశారు. మునుగోడు ఉపఎన్నికలో ఓటర్లను కొనుగోలు చేసేందుకే బీజేపీ అభ్యర్థి ఈ డబ్బు బదిలీ చేశారని ఫిర్యాదులో ఆరోపించారు. నియోజకవర్గ పరిధిలోని 23 బ్యాంకు ఖాతాలకు ఈ డబ్బు బదిలీ అవగా ఖాతాదారులంతా మునుగోడు నియోజకవర్గానికి చెందిన వారేనంటూ వారి వివరాలను ఎన్నికల కమిషన్‌కు సమర్పించారు. 

లబ్ధి పొందిన డబ్బుతో ఓట్ల కొనుగోలుకే.. 
రాజగోపాల్‌రెడ్డి డబ్బు జమ చేసిన ఖాతాదారులెవరికీ ఆయన కంపెనీతో ఎలాంటి లావాదేవీలు లేవని టీఆర్‌ఎస్‌ తన ఫిర్యాదులో పేర్కొంది. డబ్బు బదిలీ పూర్తిగా అక్రమమని, ఇది ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనతోపాటు శిక్షార్హమైన నేరంగా పరిగణించాలని కోరింది. ఈ ఖాతాల నుంచి మరిన్ని లావాదేవీలు జరగకుండా వెంటనే ఖాతాలను స్తంభింపజేయడంతోపాటు ఇప్పటికే జరిగిన లావాదేవీలపై చర్యలు తీసుకోవాలని కోరింది.

ఖాతాల్లోని సొమ్మును స్థానిక వ్యాపారులు నగదుగా మార్చి ఓట్ల కొనుగోలుకు ఉపయోగించకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. పోలింగ్‌కు ఉన్న కొద్ది సమయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈసీ నిష్పాక్షికంగా వ్యవహరించి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరింది. రూ. 18 వేల కోట్ల బొగ్గు కాంట్రాక్టు కోసం సుశీ ఇన్‌ఫ్రా మైనింగ్‌ కంపెనీతో సంబంధమున్న రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరిన విషయాన్ని ఫిర్యాదులో ప్రస్తావించింది. ఈ కాంట్రాక్టు ద్వారా లబ్ధి పొందిన డబ్బుతో ఓటర్ల కొనుగోలు సరికాదని... తక్షణమే ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని టీఆర్‌ఎస్‌ ఎన్నికల సంఘాన్ని కోరింది. 

టీఆర్‌ఎస్‌ పేర్కొన్న లావాదేవీలివే... 
►ఈ నెల 29న సుశీ ఇన్‌ఫ్రా నుంచి మేకల పారిజాతకు రూ. 28 లక్షలు, నీల మహేశ్వర్, అక్షయ సీడ్స్‌కు రూ. 25 లక్షల చొప్పున 
►ఈ నెల 18న పబ్బు అరుణ, పబ్బు రాజుగౌడ్‌ (రెండు అకౌంట్లు) ఖాతాలకు రూ. 50 లక్షల చొప్పున.. 
►ఈ నెల 14న చింతల మేఘనాథ్‌రెడ్డికి రూ. 40 లక్షలు, కె.వినయ్‌వర్దన్‌రెడ్డి, కేఎస్‌ఆర్‌ ట్రేడింగ్, ఎ.నవ్యశ్రీ, కె.వెంకట రమణ, దిండు మహేశ్, దిండు భాస్కర్, పాలోజు రాజ్‌కమల్, దిండు యాదయ్య, శ్రీనివాస్‌ టెంట్‌హౌస్‌ ఖాతాలకు రూ. 16 లక్షల చొప్పున 
►ఈ నెల 14న డి.దయాకర్‌రెడ్డి, తిరుమల మిల్క్‌ ప్రోడక్ట్స్, శివకుమార్‌ బుర్ర, ఉబ్బు సాయికిరణ్, మణికంఠ బిల్డింగ్‌ మెటీరియల్, టంగుటూరి లిఖిత ఖాతాలకు రూ. 16 లక్షల చొప్పున.   

మరిన్ని వార్తలు