సీఎం షిండే ప్రాణాలకు ముప్పు.. భద్రతను మరింత పెంచిన అధికారులు

2 Oct, 2022 19:20 IST|Sakshi

ముంబై: మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే ప్రాణాలకు ముప్పు ఉందని ఆ రాష్ట్ర ఇంటెలిజెన్స్ అధికారులు వెల్లడించారు.. శనివారం సాయంత్రం ఓ ఆగంతుకుడి నుంచి బెదిరింపు వచ్చిందని పేర్కొన్నారు. ఈనేపథ్యంలోనే ఆయన భద్రతను మరింత కట్టుదిట్టం చేసినట్లు వెల్లడించారు.

సీఎం షిండేకు ఇప్పటికే జడ్ ప్లస్ భద్రత ఉంది. అయినా బెదిరింపుల దృష్ట్యా దాన్ని మరింత పటిష్ఠం చేస్తున్నారు అధికారులు. ఠాణెలోని సీఎం వక్తిగత నివాసంతో పాటు ముంబైలోని అధికారిక నివాసం వర్షకు భద్రతను మరింత పెంచారు. షిండే అక్టోబర్ 5న దసరా సందర్భంగా ఎంఎంఆర్‌డీఏ గ్రౌండ్స్‌లో తన తొలి ర్యాలీలో పాల్గొననున్నారు. దీనికి మూడు రోజుల ముందు బెదిరింపులు రావడంతో నిఘా వర్గాలు అప్రమత్తమై భద్రతను కట్టుదిట్టం చేశాయి.

మరోవైపు ఇలాంటి బెదిరింపులకు తాను భయపడనని సీఎం షిండే అన్నారు. హోంశాఖ, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌పై తనకు పూర్తి నమ్మకం ఉందని చెప్పారు. మహారాష్ట్ర ప్రజల కోసం తన పని తాను చేసుకుంటూపోతానని, భద్రత విషయాన్ని అధికారులు చూసుకుంటారని పేర్కొన్నారు.

మరోవైపు ఉద్ధవ్‌ థాక్రేకు షాక్ ఇస్తూ వొర్లీలో దాదాపు 3,000మంది శివసేన కార్యకర్తలు షిండే వర్గంలో చేరారు. థాక్రే కుమారుడు ఆధిత్య ఠాక్రే ఈ నియోజకవర్గం నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. శివసేన ప్రభుత్వంపై తిరుగుబావుటా ఎగురవేసి బీజేపీతో కలిసి షిండే జూన్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
చదవండి: సొంత ప్రభుత్వంపై విమర్శలు చేసి రాజీనామా చేసిన మంత్రి

మరిన్ని వార్తలు