అన్నాడీఎంకేకు ఘోర అవమానం! ఫుల్‌ జోష్‌లో బీజేపీ

22 Feb, 2022 20:14 IST|Sakshi
కీలక నేతలతో పన్నీర్ సెల్వం, పళనిస్వామి(పాత చిత్రం)

తమిళనాడు అర్బన్‌ ఎన్నికల్లో అధికార డీఎంకే అఖండ విజయం దిశగా దూసుకెళ్తోంది. ఇప్పటికే మేజర్‌ స్థానాల్ని కైవసం చేసుకుని.. ఎన్నికల ట్రెండ్స్‌లో స్పష్టమైన ఆధిప్యతంతో ముందంజలో కొనసాగుతోంది. అదే సమయంలో మునుపెన్నడూ లేని చెన్నై వేదికగా సరికొత్త రాజకీయం అగుపించింది.

చాలా చోట్ల అన్నాడీఎంకేను వెనక్కి రాజేసి.. బీజేపీ రెండో స్థానంలో కొనసాగుతోంది. ముఖ్యంగా చెన్నైలోని కొన్ని వార్డుల్లో.. ఆల్‌ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కగజమ్‌ పార్టీ మూడో స్థానానికి పరిమితమైంది. అదీ బీజేపీ కంటే చాలా ఓట్ల తేడాతో వెనుకబడడం విశేషం. తాజా ట్రెండ్‌ ప్రకారం.. చెన్నైలో కనీసం ఐదు వార్డులనైనా బీజేపీ సొంతం చేసుకోవచ్చని తెలుస్తోంది(ఇప్పటికే ఒక స్థానం గెల్చుకుంది). 

ఇక ఈ ఫలితాలు బీజేపీలో జోష్‌ నింపుతున్నాయి. స్థానిక సంస్థ ఎన్నికల ఫలితాలే అయినా.. తమిళనాట పాగా వేయాలన్న ప్రయత్నాలకు కాస్తైనా మార్గం సుగమం అయ్యిందని బీజేపీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఫలితాలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కే అన్నామలై స్పందిస్తూ.. 2026 అసెంబ్లీ ఎన్నికలకు శుభసంకేతంగా ఫలితాల్ని వర్ణించాడు. ప్రతిపక్ష హోదాలో అన్నాడీఎంకే కంటే తామే బాధ్యతగా వ్యవహరించడమే బహుశా ఈ ఫలితాలకు కారణమై ఉండొచ్చని విశ్లేషిస్తున్నాడు అన్నామలై. తమిళనాడులో బీజేపీ-అన్నాడీఎంకే పార్టీల మధ్య పొత్తు ఉంది. అయితే ఎక్కువ సీట్ల కోసం అర్బన్‌ ఎన్నికలకు మాత్రం విడివిడిగా పోటీ చేశాయి. 

ఈ ఎన్నికల సంగతి ఎలా ఉన్నా.. బీజేపీ అన్నాడీఎంకేల మధ్య పొత్తు రాబోయే పార్లమెంట్‌ సార్వత్రిక ఎన్నికలు, వీలైతే ఆపై అసెంబ్లీ ఎన్నికల్లోనూ కొనసాగుతుందని స్పష్టం చేశాడు అన్నామలై.

మరిన్ని వార్తలు