టీపీసీసీ చీఫ్‌ ఎంపిక మరింత ఆలస్యం!

14 Dec, 2020 15:11 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ పీసీసీ చీఫ్ ఎంపిక ప్రక్రియ ప్రారంభించామని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్యం ఠాగూర్‌ తెలిపారు. ఇప్పటివరకు 162 మంది నేతల అభిప్రాయాలను సేకరించామని అన్నారు. తెలంగాణకు చెందిన ఏఐసీసీ నేతల నుంచి జిల్లా స్థాయి నేతల వరకు అభిప్రాయాలు తెలుసుకున్నామని ఢిల్లీలో సోమవారం ఆయన మీడియాతో పేర్కొన్నారు.  గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి పార్టీ నేతల అభిప్రాయాలను సేకరించామన్నారు. సేకరించిన అభిప్రాయాలను సోనియా, రాహుల్ గాంధీలకు అందజేస్తానని వెల్లడించారు. ఈ కసరత్తు పూర్తి కావడానికి మరికొంత సమయం పడుతుందని ఠాగూర్‌ చెప్పుకొచ్చారు. తుది నిర్ణయం పార్టీ అధిష్టానమే తీసుకుంటుందని స్పష్టం చేశారు.

తమ సంప్రదింపుల్లో ‘పీసీసీ చీఫ్ ఎవరైతే బాగుంటుందో చెప్పాలని’ నేతల్ని కోరామని తెలిపారు. అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని అధిష్టానం తుది నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. ఎవరికైనా పీసీసీ ఎంపిక కసరత్తుపై ఇబ్బందిగా ఉంటే నేరుగా పార్టీ అధిష్ఠానాన్ని కలవొచ్చని సూచించారు. టీఆర్‌ఎస్‌-బీజేపీ వైఖరి ఢిల్లీలో దోస్తీ-గల్లీ మే కుస్తీ అన్నట్టుగా ఉందని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌-మోదీ భేటీ ద్వారా ఈ విషయం తెలుస్తోందని అన్నారు. ఇక టీఆర్‌ఎస్‌ నేతలపై మరో 6 నెలల పాటు ఎలాంటి ఐటీ, ఈడీ దాడులు ఉండవని అర్ధమైందని ఠాగూర్‌ తెలిపారు. 
(చదవండి: నేడు ఢిల్లీకి కోమటిరెడ్డి, శ్రీధర్‌బాబు!)

మోదీ-కేసీఆర్‌ భేటీపై బండి సంజయ్, కిషన్ రెడ్డి ఏం చెబుతారో చూడాలని అన్నారు. ప్రజాదరణ లేని నాయకులు కాంగ్రెస్‌ను వీడుతున్నారని, అలాంటి వారితో తమ పార్టీకి నష్టమేమీ లేదని పేర్కొన్నారు. ప్రజాదరణ కలిగిన బలమైన నేతలు వీడితేనే ప్రమాదమని చెప్పారు. అసలైన కాంగ్రెస్ నేతలెవరూ తమ పార్టీని ఎట్టి పరిస్థితిలో వీడరని ఠాగూర్‌ ధీమా వ్యక్తం చేశారు. సంస్థాగతమైన లోపాల కారణంగానే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యామని, అందుకు బాధ్యత వహిస్తూ జీహెచ్ఎంసీ విభాగం అధ్యక్షుడు రాజీనామా చేశారని ఆయన గుర్తు చేశారు.
(చదవండి: హైదరాబాద్‌లో కాంగ్రెస్‌కు ఏమైంది? )

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు