కొత్త టీమ్‌ సిద్ధం: పార్టీపై పట్టు పెంచుకుంటున్న రేవంత్‌రెడ్డి

17 Jul, 2021 03:35 IST|Sakshi

త్వరలోనే ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు నియామకం

నేడో, రేపో అధికార ప్రతినిధుల జాబితా

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీకి కొత్త రూపునిచ్చేందుకు ఆ పార్టీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కసరత్తు ప్రారంభించారు. టీపీసీసీ కార్యవర్గానికి నేతల ఎంపికలో సామాజిక సమీకరణలను ప్రాధాన్యతగా ఎంచుకోవాలని, అదే సమయంలో తనదైన మార్కు వేయాలనే ఆలోచనతో ఆయన ముందుకెళ్తున్నట్టు సమాచారం. పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్లు, సీనియర్‌ ఉపాధ్యక్షుల జాబితాను ఇప్పటికే ఏఐసీసీ ప్రకటించగా, టీపీసీసీ ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, అధికార ప్రతినిధుల నియామకంపై రేవంత్‌ దృష్టిపెట్టారు. నేడో, రేపో పార్టీ అధికార ప్రతినిధుల జాబితా రానుండగా, మిగిలిన పదవులను నెలలో భర్తీ చేస్తారని గాంధీభవన్‌ వర్గాలంటున్నాయి.

అధికార ప్రతినిధుల కుదింపు 
గత కమిటీల్లో టీపీసీసీ ప్రధాన కార్యదర్శులుగా 25 మంది వరకు ఉండేవారు. తాజాగా ఈ సంఖ్యను 20కి కుదించాలని రేవంత్‌రెడ్డి భావిస్తున్నట్టు తెలుస్తోంది. గతంలో 70-80 మంది వరకు అధికార ప్రతినిధులుండేవారు. వీరిని 15–20 మందికి పరిమితం చేయాలని యోచిస్తున్నట్టు సమాచారం. వాక్పటిమ, విషయ పరిజ్ఞానం, సమయానుకూలంగా స్పందించగలిగే వారినే ఈ జాబితాలో ఉంచాలని ఆయన కసరత్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు