త్వరలో చేనేత, మత్స్య, గౌడబీమా

14 Sep, 2021 01:01 IST|Sakshi
కమలాపూర్‌ సభలో స్టెప్పులేస్తున్న హరీశ్, సుమన్‌

టీఆర్‌ఎస్‌కు అండగా ఉండాలని

మంత్రి హరీశ్‌ విజ్ఞప్తి 

హుజూరాబాద్‌/కమలాపూర్‌: టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తోందని, త్వరలోనే రైతుబీమా తరహాలో చేనేత, మత్స్య, గౌడబీమాను ప్రభుత్వం అమలు చేయబోతోందని రాష్ట్ర ఆర్థికమంత్రి టి.హరీశ్‌రావు తెలిపారు. సోమవారం హుజూరాబాద్‌లో చేనేత సంఘాలు, పారిశ్రామికుల అభివృద్ధి, సంక్షేమ పథకాల చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.

మంత్రి మాట్లాడుతూ చేనేత కార్మికులు త్రిఫ్ట్‌ ఎంత కడితే అంతకు డబుల్‌ ప్రభుత్వం చెల్లిస్తోందని, అధికారులు వారిని ఇబ్బంది పెట్టొద్దని అన్నారు. చేనేత కార్మికుల సంక్షేమానికి మంత్రి కేటీఆర్‌ రూ.70 కోట్లు విడుదల చేశారని తెలిపారు.  త్వరలో చేనేత కార్మికుల సమస్యలపై సీఎం కేసీఆర్‌తో సమావేశం ఉంటుందని చెప్పారు. హుజూరాబాద్‌ ప్రజలు అన్నం పెట్టే వాళ్ల దిక్కా? పన్నులు వేసే వాళ్ల దిక్కా? అనేది ఆలోచించాలని కోరారు.

చేనేతకు భరోసాగా ఉన్న టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి అండగా ఉండాలన్నారు. కార్యక్రమంలో మంత్రి కమలాకర్, మాజీమంత్రులు ఎల్‌.రమణ, పెద్దిరెడ్డి, నేతలు సమ్మారావు, స్వర్గం రవి తదితరులు పాల్గొన్నారు.  

నమ్మకానికి పెట్టింది పేరు టీఆర్‌ఎస్‌ 
నమ్మకానికి టీఆర్‌ఎస్, అమ్మకానికి బీజేపీ కేరాఫ్‌ అడ్రస్‌ అని మంత్రి హరీశ్‌ అన్నారు. హనుమకొండ జిల్లా కమలాపూర్‌లో జరిగిన టీఆర్‌ఎస్‌ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో  మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం సబ్సిడీలకు కోత లు పెడుతోందని, గ్యాస్, డీజిల్, పెట్రోల్‌ ధరలు పెం చేసి వాతలు పెడుతోందని విమర్శించారు.

సమావేశంలో సాయిచంద్‌ పాడిన పాటకు హరీశ్‌తోసహా ప్రభుత్వ విప్‌  సుమన్, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్, మాజీమంత్రి పెద్దిరెడ్డి, కౌశిక్‌రెడ్డిలు స్టెప్పులేసి కార్యకర్తలను ఉత్తేజపరిచారు.

మరిన్ని వార్తలు