మోదీని తిట్టకుంటే ఆ కుటుంబానికి పూటగడవట్లేదు 

7 Feb, 2023 04:57 IST|Sakshi

దుబ్బాక, హుజూరాబాద్‌లో ఓడినందుకే కేటీఆర్‌ సీఎం కాలేదు 

తెలంగాణ బడ్జెట్‌లో సాహిత్యం ఎక్కువైంది... సమాచారం తక్కువైంది  

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి 

సాక్షి, న్యూఢిల్లీ: ప్రతిరోజూ, ప్రతి గంట.. కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధాని నరేంద్ర మోదీని విమర్శించకుంటే కల్వకుంట్ల కుటుంబానికి పూట గడవట్లేదని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి కిషన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. కేంద్రంపై బురద జల్లుతూ, వైఫల్యాల నుంచి తప్పించుకొనేందుకు బీఆర్‌ఎస్‌ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. సీఎం కేసీఆర్‌ చదివిన వేల పుస్తకాల్లోని భాషా జ్ఞానాన్ని తాజా బడ్జెట్‌ లో కూర్చారన్న కిషన్‌ రెడ్డి.. ఈ బడ్జెట్‌లో ‘సాహిత్యం ఎక్కువైంది. సమాచారం తక్కువైంది.

కుటుంబ సందేశమే ఆవిష్కృతమైంది’అని వ్యాఖ్యానించారు. సోమవారం ఢిల్లీలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌ ఒక జిమ్మిక్కు అని ఎద్దేవా చేశారు. ఫాంహౌజ్‌ ప్రభుత్వం బడ్జెట్‌లో ఉన్నవన్నీ అబద్ధాలు, అమలుకాని వాగ్దానాలు, అవాస్తవ గణాంకాలని కిషన్‌రెడ్డి ఆరోపించారు. ప్రకటనలు, ప్రచారానికి బడ్జెట్‌లో రూ.1000 కోట్లను కేటాయించడం విడ్డూరంగా ఉందన్నారు.

కల్వకుంట్ల కుటుంబం బడ్జెట్‌ లెక్కలు వేరుగా ఉంటాయనీ. తమ కుటుంబం కోసమే తెలంగాణ వచ్చిందన్న విధంగా ఆ కుటుంబం వ్యవహరిస్తోందని విమర్శించారు. సీఎంగా కేసీఆర్‌ను తొలగించి కేటీఆర్‌ ముఖ్యమంత్రి కావాలనుకున్నప్పటికీ.. దుబ్బాక, హుజూరాబాద్, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఓడిపోవడంతో సీఎం కాలేదని అన్నారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కల్వకుంట్ల జాతి రత్నాలు ఎలా అయ్యారో ముందు తెలంగాణ సమాజానికి బీఆర్‌ఎస్‌ నేతలు చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు.

>
మరిన్ని వార్తలు