వెన్నుపోటు తప్ప ఎన్టీఆర్‌కు చంద్రబాబు చేసిందేం లేదు.. 

18 Oct, 2022 06:20 IST|Sakshi

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ 

వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తా  

ఉంగుటూరు: మామకు వెన్నుపోటు పొడిచి పార్టీని, పదవిని లాక్కోవడం మినహా ఎన్టీఆర్‌కు చంద్రబాబు చేసిందేమీ లేదని గన్నవరం ఎమ్మెల్యే డాక్టర్‌ వల్లభనేని వంశీమోహన్‌ అన్నారు. కృష్ణా జిల్లా ఉంగుటూరులో తన తండ్రి రమేష్‌చంద్‌ వర్ధంతి సందర్భంగా స్మారకఘాట్‌ వద్ద కుటుంబ సభ్యులతో కలిసి వంశీ నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు హయాంలో గన్నవరం అంతర్జాతీయ ఎయిర్‌పోర్టుగా ఏర్పడినా ఎన్టీఆర్‌ పేరు పెట్టడం గానీ, ఆయనకు భారతరత్న ఇవ్వాలని ప్రతిపాదనలు చేయలేదని మండిపడ్డారు.

అలాంటిది నేడు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్‌ పేరు పెట్టారని చెప్పారు. వైద్య రంగంలో అనేక మార్పులు తీసుకురావడంతో పాటు ఆరోగ్యశ్రీని తీసుకొచ్చిన వైఎస్సార్‌ పేరును హెల్త్‌ యూనివర్సిటీకి పెట్టారని చెప్పారు. యూనివర్సిటీకీ ఎన్టీఆర్‌ పేరు తొలగించి వైఎస్సార్‌ పేరు పెట్టడం వలన ఎవరి స్థాయి తగ్గదని, ఇద్దరూ మహానుభావులని చెప్పారు. వైజాగ్‌లో మంత్రుల వాహనాలపై జనసేన నాయకులు దాడికి పాల్పడటం దారుణమన్నారు. నియోజకవర్గంలోని పార్టీ నాయకులను సమన్వయం చేసుకుని 2024లో తాను గన్నవరం నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తానని స్పష్టం చేశారు.   

మరిన్ని వార్తలు