ఒట్టి చేతులతో వచ్చారేంటి..! సీఎస్‌పై గవర్నర్‌ ఆగ్రహం

9 May, 2021 12:04 IST|Sakshi

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌ జగదీప్‌ ధన్‌ఖర్‌ మరోసారి ప్రభుత్వ ఉన్నతాధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గతేడాది ఇదే శాంతి భద్రతల విషయంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి, గవర్నర్‌ జగదీప్‌ ధన్‌ఖర్‌ మధ్య వివాదం తలెత్తగా.. ఈసారి గవర్నర్‌పై ప్రభుత్వం ప‍్రదర్శిస్తున్న తీరు సర్వత్రా చర్చాంశానీయంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో శాంతి భద్రతలను సమీక్షించేందుకు శనివారం గవర్నర్‌ జగ్‌దీప్‌ ధన్‌ఖర్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అల్పన్‌ బందోపాధ్యాయ, డీజీపీ వీరేంద్ర రాజ్‌ భవన్‌కు పిలిపించుకున్నారు. అయితే గవర్నర్‌తో భేటీ అయ్యేందుకు రాజ్‌భవన్‌కు వచ్చిన ఉన్నతాధికారులు ఎలాంటి రిపోర్ట్‌ లేకుండా రావడంపై జగదీప్‌ ధన్‌ఖర్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. 

‘తాజా పరిస్థితులపై ఓ రిపోర్ట్‌ తీసుకొని వచ్చి ఉంటే బాగుండేంది. కానీ ఒట్టి చేతులతో వచ్చారు. ఆలస్యం చేయకుండా నివేదిక తయారు చేసుకొని తీసుకుని రావాలని ఆదేశాలు జారీ చేశాం’ అని సీఎస్‌, డీజీపీ భేటీ తర్వాత గవర్నర్‌ ట్వీట్‌ చేశారు. అంతేకాదు ఎన్నికల అనంతరం జరిగిన పరిణామాలతో రాష్ట్రంలో శాంతిభద్రతలు ఎలా ఉన్నాయని వివరించడంలో ఉన్నతాధికారులు విఫలమయ్యారని గవర్నర్‌ ఆరోపించారు. రాష్ట్రంలో పాలన రాజ‍్యాంగానికి విరుద్దంగా ఉండడం దురదృష్టకరమని, హింసాత‍్మక ఘటనలపై వివరణ ఇవ్వకపోవడం దారుణమని ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు.

కాగా గతేడాది సైతం  రాష్ట్రంలో శాంతి భద్రతలపై నివేదిక అందించాలని గవర్నర్‌ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేశారు. ఆ ఆదేశాల్ని సీఎం పేషీ అధికారులు భేఖాతర్‌ చేశారు. దీంతో అసహనం వ్యక్తం చేసిన ఆయన.. 'గవర్నర్‌ను పోస్టాఫీస్‌లో రబ్బర్‌ స్టాంప్‌గా చూడాలని సీఎం కోరుకుంటున్నారు. అందుకే నన్ను రాజ్‌ భవన్‌కు పరిమితం చేయాలని అనుకుంటున్నారని వ్యాఖ్యానించడం అప్పట్లో సంచలంగా మారింది. 

చదవండి: టీఎంసీలోకి ముకుల్‌ రాయ్‌.. క్లారిటీ ఇచ్చిన బీజేపీ నేత

మరిన్ని వార్తలు