ఆ 12 ఎమ్మెల్యే సీట్లలో కారు జోరు.. గిట్లుంటది కాంగ్రెసోళ్లతోని.. అంతా ఉల్టా పల్టా!

24 May, 2023 19:40 IST|Sakshi

ఆ జిల్లా హస్తం పార్టీకి పెట్టని కోట. కాంగ్రెస్ అభ్యర్థికి వ్యతిరేకంగా పోటీ చేయాలంటే ప్రత్యర్థులు హడలిపోయేవారు. తప్పని పరిస్థితిలో పోటీ చేసినా గెలుపు మాత్రం హస్తం ఖాతాలోనే చేరిపోయేది. కానీ ఇప్పుడు అక్కడ పరిస్థితి తలకిందులైంది.. ఉన్న పన్నెండు స్థానాల్లోనూ ఇప్పుడు బీఆర్ఎస్ పాగా వేసింది.. కానీ వచ్చే ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసేది మేమే అని కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతున్నారు.. మరి నేతలు అంటున్నట్లు అది సాధ్యమయ్యే పరిస్థితి ఉందా?. నియోజకవర్గాల్లో చేతి పార్టీ రేఖలు ఎలా ఉన్నాయి ?

కాంగ్రెస్ పార్టీ అంటేనే కొట్లాటలకు, గొడవలకు, కుమ్ములాటలకు పెట్టింది పేరు.  దానికి వారు పెట్టుకున్న ముద్దు పేరు అంతర్గత ప్రజాస్వామ్యం. ఇలాంటి తీరును మార్చుకోని హస్తం పార్టీ నాయకులు.. పార్టీ ప్రయోజనాలను గాలికి వదిలేసి వ్యక్తిగత ప్రయోజనాలకే పెద్ద పీట వేస్తూ వస్తున్నారు. దీంతో పార్టీకి కంచుకోట లాంటి జిల్లాల్లో కూడా ఇప్పుడు ఉనికి కోసం పోరాడాల్సి వస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

కాంగ్రెస్‌కి కంచుకోటలాంటి జిల్లాలో నల్లగొండ జిల్లా ఒకటి. కాంగ్రెస్ పార్టీకి ఉద్ధండులు లాంటి నేతల్ని అందించిన జిల్లా. జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ లాంటి సీనియర్ నేతలు నల్లగొండ జిల్లాలో ఉన్నా ప్రస్తుతం అక్కడి నుంచి ఒక్కరంటే ఒక్కరు కూడా కాంగ్రెస్ తరపున అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తలేరు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాజయానికి కారణం కేడర్ లేక కాదని లీడర్ల తీరుతోనే ఈ పరిస్థితి దాపురించిందని శ్రేణుల నుంచే విమర్శలు వినిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగితే ఇక జిల్లాలో కాంగ్రెస్ ఉనికి కోల్పోవడం ఖాయం అని నేతలు గ్రహించారో లేక ఉన్న కేడర్ కూడా పక్క పార్టీలోకి జారిపోతారని ఆందోళనలో తెలియదు కానీ అక్కడి నేతలు ఇప్పుడు మిషన్ 12 ఎట్ నల్లగొండ అంటున్నారట. 

కొద్ది రోజుల క్రితం నల్లగొండ జిల్లా కేంద్రంలో జరిగిన నిరుద్యోగ నిరసన కార్యక్రమానికి పీసీసీ చీఫ్ రేవంత్ తో పాటు జిల్లాకు చెందిన సీనియర్ నేతలందరూ హాజరయ్యారు. ఈ కార్యక్రమం వేదికగా వచ్చే ఎన్నికల్లో 12కు 12 మేమే గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ మాట కేడర్‌కి భరోసాని ఇచ్చే విధంగా ఉంది కానీ క్షేత్రస్థాయిలో మాత్రం నియోజకవర్గాల్లో పరిస్థితి భిన్నంగా వుంది. ఒక్కో నియోజకవర్గంలో సీనియర్ నేతలకు సంబంధించిన ఒక్కొకరు ఒక్కో అనుచరుడిని ప్రోత్సహిస్తూ వర్గపోరును పెంచి పోషిస్తున్నారని కేడరే ఆగ్రహంగా ఉంది.

నకిరేకల్లో కోమటిరెడ్డికి మంచి పట్టు ఉంది. ఇక్కడ ఆయన చెప్పిన నేతకే టికెట్ ఇప్పించుకునే పనిలో ఉన్నారు. జానారెడ్డి కూడా తన అనుచరుడు కొండేటి మల్లయ్యకు టికెట్ ఇప్పించుకోవాలని చూస్తున్నారు. గత కొంతకాలంగా ఇరు వర్గాలకు చెందిన నేతలు వేర్వేరుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు మిర్యాలగూడలో కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉమ్మడి అనుచరుడిగా ముద్రపడిన బత్తుల లక్ష్మారెడ్డి రేసులో ముందున్నారు. అయితే ఇక్కడ ఏకంగా జానారెడ్డే పోటీ చేయాలని చూస్తున్నారు. కుదరని పక్షంలో తన అనుచరుడు అలుగుబెల్లి అమరేందర్ రెడ్డిని తెరపైకి తీసుకొస్తున్నారు. 

ఇక దేవరకొండలో జానారెడ్డి తన అనచరుడు బాలు నాయక్కు టికెట్ ఇప్పించుకోవాలని చూస్తుండగా ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి మాత్రం రవీనాయక్ అనే యువ నేతను ప్రోత్సహిస్తున్నట్లు తెలుస్తోంది. రవినాయక్‌కి పీసీసీ రేవంత్ మద్దతు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. సూర్యాపేటలో అయితే ఏకంగా సీనియర్ నేత దామోదర్ రెడ్డి ఈసారి కూడా తనకే టికెట్ కావాలని కోరుతుండగా ఆయనకు పోటీగా రేవంత్ ప్రధాన అనుచరుడిగా ఉన్న పటేల్ రమేష్‌రెడ్డి అవకాశం కోసం పట్టుబడుతున్నారు. పటేల్ రమేష్ రెడ్డికి కోమటిరెడ్డి మద్దతు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

ఆలేరులో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రధాన అనుచరుడు బీర్ల ఐలయ్య టికెట్ కోరుతున్నారు. ఈయనకు పోటీగా మరో నలుగురు నేతలు మాకు కూడా ఒక అవకాశం ఇవ్వాలని కోరుతూ  ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. భువనగిరిలో ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి  అనుచరుడు కుంభం అనిల్ పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నా ఆయనకు పోటీగా కోమటిరెడ్డి మరో వలస నేతను తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారని ప్రచారం సాగుతోంది.

మునుగోడునుంచి ఉత్తమ్ వర్గానికి చెందిన పాల్వాయి స్రవంతి మరోసారి అవకాశం కోరుతుండగా ఇక్కడ రేవంత్ తన వర్గానికి చెందిన చలమల్ల కృష్ణారెడ్డిని తెరపైకి తీసుకొచ్చారు. ఈయనకు జానారెడ్డి మద్దతునిస్తున్నారు. మరో వైపు నల్లగొండలో ఈసారి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పోటీ చేస్తానని ప్రకటించారు. ఒకవేళ ఆయన పోటీ చేయకపోతే సీనియర్ నేత దుబ్బాక నర్సింహ్మారెడ్డి పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. గతంలో ఆయన కోమటిరెడ్డి వర్గంలోనే ఉన్నారు. కానీ ఈ మధ్య కోమటిరెడ్డికి దూరం జరిగినట్లు తెలుస్తోంది. ఈనేపథ్యంలో ఆయన అడుగులు ఎలా ఉంటాయి అనేది ఆసక్తిని కలిగిస్తోంది.
చదవండి: కర్ణాటకలో సినిమా అట్టర్ ఫ్లాప్, తెలంగాణలో కాషాయ పార్టీ పరిస్థితేంటి?

ఇక నాగార్జున సాగర్‌లో జానారెడ్డి లేదంటే ఆయన చిన్న కుమారుడు జైవీర్ పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కోదాడలో ఉత్తమ్ కుమార్‌రెడ్డి సతీమణి పద్మావతి పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇక్కడ రేవంత్ తన వర్గానికి చెందిన ఓ చోటా నేతను తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇక మరోసారి హుజూర్‌నగర్ నుంచి ఉత్తమ్ కుమార్‌రెడ్డి బరిలో ఉండనున్నారు. 

ఇలా ఒక్కో నియోజకవర్గంలో ఒక్కో సీనియర్ నేత తన వర్గానికి చెందిన నేతల్ని తెరపైకి తీసుకొచ్చి స్థానికంగా వర్గపోరును ప్రోత్సహిస్తున్నారు. ఈ నేతలంతా వచ్చే ఎన్నికల్లో తమకు టికెట్ కావాలని సీనియర్ల మద్దతుతో పోటీ చేస్తామని అంటున్నారు. ఎలాగూ సీనియర్ల మధ్య సఖ్యత లేకపోవడంతో ఒక నేత అనుచరుడికి టికెట్ వస్తే మరో నేత అనుచరుడు సహకరిస్తారా అనేది అనుమానమే. మరి ఇలాంటి పరిస్థితుల్లో 12కు 12 స్థానాలు ఎలా గెలుస్తారనేది సమాధానం లేని ప్రశ్నగా మిగిలుస్తోంది.
-పొలిటికల్‌ ఎడిటర్‌, సాక్షి వెబ్‌డెస్క్‌

చదవండి: బీజేపీ కార్యకర్తల్లో కొత్త కన్‌ఫ్యూజన్‌.. రంగంలోకి హైకమాండ్‌

మరిన్ని వార్తలు