రాజస్థాన్‌లో గెలిస్తే సీఎం ఎవరు? దియా కుమారి స్పందన

2 Dec, 2023 16:25 IST|Sakshi

రాజస్థాన్‌ పీఠం ఎవరికి దక్కనుంది అనేది మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. 199 స్థానాలకు నవంబర్ 25నాటి పోలింగ్‌లో ప్రజలు  తమ తీర్పును నిక్షిప్తం చేశారు. డిసెంబర్ 3న ఫలితాలు వెల్లడి కానున్నాయి. ప్రస్తుతం ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని దక్కించు కుంటుందా లేక బీజేపీ విజయం సాధిస్తుందా  అనేది పెద్ద ప్రశ్న. అయితే ఎగ్జిట్ పోల్స్ బీజేపీ వైపు మొగ్గు  చూపాయి. ఈ నేపథ్యంలో ఎవరు బీజేపీ సీఎం ఎవరు అవుతారనే చర్చ ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఇప్పటివరకు సీఎం అభ్యర్థిని బీజేపీ ప్రతిపాదించ లేదు. 

ప్రధానంగా సీఎం పదవిరేసులో బీజేపీ ఎంపీ, విద్యాధర్ నగర్ అభ్యర్థి దియా కుమారి పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఈ ఊహగానాలపై తాజాగా స్పందించారు.   ఫలితాల తర్వాత పార్లమెంటరీ బోర్డు, పార్టీ అగ్ర నాయకత్వం నిర్ణయిస్తుందన్నారు. పార్టీ తనకు  ఏ పని ఇచ్చినా, దానికి పూర్తిగా కట్టుబడి ఉన్నానని  ప్రకటించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్ షా మద్దతున్న  దియాకుమారి పోటీ రాజస్థాన్ బీజేపీలో కలకలం రేపింది.  అయిదు సార్లు గెలిచిన సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి , సింధియా విధేయుడు ,మాజీ ఉపాధ్యక్షుడు భైరాన్ సింగ్ షెకావత్ అల్లుడు  నర్పత్ సింగ్ రాజ్వీని కాదని దియాను ఎంపిక చేయడం పార్టీలో  వివాదం రేపింది.  దీంతో  రాజ్వీకి పాత  నియోజకవర్గం  చిత్తోర్‌గడ్‌ను కేటాయించడంతో ఇది సద్దుమణిగింది.  అయితే 15 ఏళ్ల తర్వాత చిత్తోర్‌గఢ్‌ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థి సురేంద్ర సింగ్‌ జాదావత్‌పై మళ్లీ పోటీ చేస్తున్నారు.

ఇది ఇలా ఉంటే బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, సీనియర్ నేత రెండు సార్లు రాజస్థాన్ సీఎంగా పనిచేసిన వసుంధర రాజే కూడా  సీఎం పీఠంపై భారీ ఆశలే పెట్టుకున్నారు. అయితే సంఘ్ నేతలు,  బీజేపీ హైకమాండ్‌తో విభేదాలు, అసంతృప్తితో  ఈ అవకాశాలు తక్కువే  అనేది రాజకీయ విశ్లేషకుల మాట. ఒకవేళ మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టుకుంటే  అపుడు వసుందర రాజే పేరేను పరిగణనలోకి తీసుకునే అవకాశం లేకపోలేదని రాజకీయ విశ్లేషకుల అంచనా.  అటు అర్జున్ రాఘ్ మేఘ్వాల్ సీఎం పదవికి ప్రముఖంగా వినిపిస్తున్న మరో కీలక పేరు.ఈ నేపథ్యంలో బీజేపీ  ఎలాంటి  వ్యూహం అనుసరిస్తుంది అనే చర్చ జోరందుకుంది. 

మరిన్ని వార్తలు