వెబ్‌ సిరీస్‌: ఫ్యామిలీమ్యాన్​ 2 రివ్యూ

4 Jun, 2021 21:04 IST|Sakshi

లాంగ్వేజ్​ : హిందీ(ఇంగ్లీష్ సబ్​ టైటిల్స్​)

ఎపిసోడ్స్​ : మొత్తం 9 ఎపిసోడ్స్ (ఒక్కొక్కటి 40 నిమిషాలపైనే)

ఓటీటీ: అమెజాన్​ ప్రైమ్​ వీడియో

కాస్టింగ్​ : మనోజ్​ వాజ్​పాయి, సమంత అక్కినేని, షరీబ్ హష్మీ, షహబ్​ అలీ​, దర్శన్​ కుమార్​, అశ్లేష థాకూర్​,  మైమ్​ గోపీ, దేవదర్శిని, అలగమ్​ పెరుమాల్​ తదితరులు

క్రియేటర్స్​ : డీకే & రాజ్​​ 


సొసైటీలో అసాంఘిక శక్తులు అలజడుల కోసం ప్రయత్నించడం.. సీక్రెట్​ ఏజెంట్​ అయిన హీరో సాధారణ వ్యక్తి ముసుగులో ఆ కుట్రలను అడ్డుకుని, ఆ అసాంఘిక శక్తుల్ని మట్టుపెట్టడం ఇప్పటివరకు మన సినిమాల్లో చూస్తున్నదే. అయితే దానికి వెబ్​ సిరీస్​గా మలిచి.. డీకే అండ్​ రాజ్​లు చేసిన ప్రయత్నమే ఫ్యామిలీమ్యాన్​.  లోకల్ జేమ్స్​ బాండ్ ట్యాగ్​ లైన్​తో ఫ్యామిలీమ్యాన్​ ఫస్ట్ సీజన్​ హిట్ కావడంతో.. రెండో సిరీస్​పై అంచనాలు పెరిగాయి. దీనికి తోడు సౌతిండియన్​ స్టార్​ హీరోయిన్ సమంత అక్కినేని కీ రోల్ పోషిస్తుండడంతో సౌత్​లోనూ ఈ అమెజాన్​ ప్రైమ్​ సిరీస్ పట్ల ఆసక్తి, అంచనాలు నెలకొన్నాయి.ఈ తరుణంలో తొలుత కేవలం హిందీ భాషలోనే ఫ్యామిలీమ్యాన్​ 2 ను రిలీజ్ చేసి వ్యూయర్స్​ని నిరుత్సాహపరిచింది అమెజాన్ ప్రైమ్​. అయినప్పటికీ రెండో సీజన్​ ఏమేర ఆకట్టుకుందో చూద్దాం. 

కథ.. ఉత్తర శ్రీలంకలో కొన్నేళ్ల క్రితం.. తమిళ రెబల్స్‌ శిబిరంపై అక్కడి ఆర్మీ దాడి చేయడం, కీలక నేతల పారిపోయే సన్నివేశంతో కథ ప్రారంభం అవుతుంది. కట్​ చేస్తే.. ఆలస్యంగా ఆఫీస్​కు వెళ్లి బాస్​తో క్లాస్​లు పీకించుకునే ఐటీ జాబ్​లో చేరతాడు శ్రీకాంత్ తివారి​. అయితే, గతంలో టాస్క్‌ (థ్రెట్‌ అనాలసిస్‌ అండ్‌ సర్వైవలెన్స్‌ సెల్‌)లో సీనియర్‌ ఏజెంట్‌ అయిన శ్రీకాంత్‌ ఆ జాబ్​ను ఆస్వాదించలేకపోతాడు. ఇక టాస్క్​లో తన కొలీగ్, ఆప్తుడు అయిన జేకే తల్పాడే ఒక సీక్రెట్ ఆపరేషన్​ మీద చెన్నై వెళ్తాడు.  అప్పటిదాకా  ఇన్​యాక్టివ్​గా ఉన్న  శ్రీలంక తమిళ రెబల్స్‌ ఓ భారీ కుట్రకు పాల్పడుతున్నారని తల్పాడేకు తెలుస్తుంది.


ఇదే విషయాన్ని శ్రీకాంత్‌తో చెప్పడం, అదే టైంలో ఇంట్లో గొడవ కారణంగా శ్రీకాంత్‌ టాస్క్‌లో చేరడం చకచకా జరుగుతాయి. మరోవైపు తమిళ రెబల్​ కమాండర్ రాజ్యలక్ష్మి శేఖరన్ అలియాస్​ రాజీ తాను అనుకున్న పనిని సీక్రెట్​గా చేసుకుంటూ పోతుంటుంది. ఈ క్రమంలో ఆమె ఉనికిని పసిగట్టిన పోలీసులు, టాస్క్​ టీం ఆమెను బంధిస్తారు. అయితే మెరుపుదాడితో ఆమెను రెబల్స్ విడిపించుకునే ప్రయత్నంలో రాజీ గాయపడుతుంది. మరోవైపు శ్రీకాంత్​ కూతురిని ఓ కుర్రాడి సాయంతో ట్రాప్​ చేసి.. కిడ్నాప్​ చేసి రెబల్స్​ తాము అనుకుంటున్న పని చేసుకుపోవాలనుకుంటారు. చివరికి శ్రీకాంత్​ తన కూతురిని కాపాడుకోగలుగుతాడా? తమిళ రెబల్స్‌-రాజీ కుట్రను శ్రీకాంత్‌ టీం ఎలా అడ్డుకుంటుంది? అనేది కథ. 

విశ్లేషణ
శ్రీకాంత్ పున పరిచయం, ఫ్యామిలీ డ్రామాతో తొలి రెండు ఎపిసోడ్స్​ నిదానంగా నడుస్తాయి. రెండో ఎపిసోడ్ తర్వాతి నుంచి​ అసలు కథ మొదలవుతుంది. నాలుగో ఎపిసోడ్​ చివరి నుంచి కథ పరుగులు పెడుతుంది. అక్కడి నుంచి క్లైమాక్స్‌ వరకూ బిగి సడలని కథనంతో ఆకట్టుకుంది. తమిళ రెబల్స్ కుట్రలకు ప్లాన్​, ట్రేస్​ చేయడం, మధ్యలో లీడర్​ క్యారెక్టర్​ ఫ్యామిలీకి ఇబ్బందులు,  ఆ కుట్రలు శ్రీకాంత్​ టీం భగ్నం చేయడం, చివరికి రిస్క్​ చేసి శత్రువుల్ని మట్టుపెట్టడం.. ఇలా కథలో అంశాలున్నాయి. అయితే ఇవేవీ స్పై తరహా కథల్లోలాగా థ్రిల్ చేయకపోయినప్పటికీ.. వ్యూయర్స్​ను ఎంగేజ్​ మాత్రం చేస్తాయి. 

నటనపరంగా..
ఏజెంట్‌ శ్రీకాంత్‌ తివారి పాత్రలో మనోజ్‌ బాజ్‌పాయ్‌ మరోసారి ఆకట్టుకుంటాడు. కుటుంబం కోసం, దేశం కోసం.. నలిగిపోయే పాత్రలో ఆయన నటన మెప్పిస్తుంది. ముఖ్యంగా మిలింద్​ చనిపోయాక భార్యతో ఫొన్​లో మాట్లాడుతూ ఏడ్చేసే సీన్​ హైలైట్​.  ఇక సమంతది ప్రతినాయిక పాత్రే. అయినప్పటికీ సామూహిక అత్యాచారానికి గురై, తమ్ముడ్ని కోల్పోయిన బాధితురాలిగా, జాతి గౌరవం కోసం పోరాడే రెబల్​ కమాండర్​గా రాజీ క్యారెక్టర్  అలరిస్తుంది. డేరింగ్ అండ్​ బోల్డ్‌ పాత్రలో రాజ్యలక్ష్మి అలియాస్‌ రాజీగా సమంత నటన కొత్తగా అనిపించినా.. గుర్తుండిపోతుంది. ఇక  శ్రీకాంత్​ కుడిభుజంగా జేకే రోల్​లో షరీబ్ నటన మెప్పిస్తుంది. కిందటి సీజన్​ మాదిరే ఇద్దరి మధ్య పంచ్​లు పేలాయి. శ్రీకాంత్​ కూతురి రోల్​లో అశ్లేష థాకూర్ మెప్పించింది. నటి దేవదర్శికి, షరీబ్​కి మధ్య వచ్చే​ కామెడీ సీన్స్​ ఫర్వాలేదు. ప్రియమణి, శరద్‌ ఖేల్కర్‌ ఫర్వాలేదనిపించారు. కోలీవుడ్​ తారాగణం రవీంద్ర విజయ్‌, మైమ్​ గోపి, అజగమ్‌ పెరుమాళ్‌ తమదైన నటనతో మెప్పించారు.
 
టెక్నీషియన్స్​ పనితనం.. 
ఫ్యామిలీమ్యాన్​ సీజన్ 2 హంగులు లేకున్నా ఆకట్టుకోవడానికి కారణం బ్రిసన్‌ అందించిన సినిమాటోగ్రఫ్రీ. ఈ కథలో చాలా సీన్లను(క్లైమాక్స్​తో సహా) సింగిల్‌ టేక్‌లో షూట్ చేశారంటే అతిశయోక్తి కాదు. ఇక సచిన్‌ జిగార్‌, కేతన్‌ అందించిన బ్యాక్​గ్రౌండ్ మ్యూజిక్​తో ఆడియెన్స్​ను ఎంగేజ్ చేస్తుంది. యాక్షన్​ పార్ట్​లో శ్రీకాంత్‌ టీం, రాజీ టీం మధ్య సహజమైన యాక్షన్​ సన్నివేశాలు.. రియలిస్టిక్​గా అనిపిస్తాయి. కథలో భాగమైన ‘ఫ్యామిలీ’ డ్రామా కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. అయినప్పటికీ తొలి సీజన్​తో పోలిస్తే ఇందులో తక్కువే ఉందని చెప్పొచ్చు.  ఇక దేశ భక్తి, పంచ్​ డైలాగులతో పాటు కథ, కథనాలు, తమిళ సీక్వెన్స్​ను మేళవించి తొలిసీజన్‌ మాదిరిగానే ఫ్యామిలీమ్యాన్​ 2ను ఆసక్తిిగా తీర్చిదిద్దారు రాజ్‌ అండ్‌ డీకే.

మరిన్ని వార్తలు