చిట్టి చిల్లీ.. చాలా ఘాటు గురూ! ఒక్కసారి కొరికితే చెంబుడు నీళ్లు తాగినా మంట తగ్గదు

18 Mar, 2023 08:31 IST|Sakshi

సాక్షి, కాకినాడ(పిఠాపురం): చిట్టి చిల్లీ... చూడటానికి చెర్రీ పండులా ఎర్రగా గుండ్రంగా ఉంటుంది. నోరూరిస్తుంది. కానీ ఒక్కసారి కొరికితే చెంబుడు నీళ్లు తాగినా మంట తగ్గదు. అంతటి ఘాటు ఉన్న ఈ చిట్టి మిరపకాయల ధర కూడా సాధారణ మిర్చి కన్నా మూడు రెట్లు అధికంగా ఉంటుంది. ఈ చిట్టి మిర్చికి పుట్టినిల్లు కాకినాడ జిల్లా గొల్లప్రోలు ప్రాంతమైనా... మరాఠా వాసులతోపాటు దుబాయ్, మలేషియా దేశాల ప్రజలకు దీనిపై మక్కువ ఎక్కువ.

సొంతగా విత్తనం తయారీ...
గొల్లప్రోలు మండలంలోని రేగడి భూములు పొట్టి మిరప సాగుకు అనుకూలం. గొల్లప్రోలు, చేబ్రోలు, దుర్గాడ, చెందుర్తి, తాటిపర్తి, ఎ.విజయనగరం గ్రామాలలో సుమారు 600 ఎకరాలలో పొట్టి మిరపను సాగు చేస్తున్నారు. రైతులే సొంతగా విత్తనాన్ని అభివృద్ధి చేసుకుంటున్నారు. తమకు పండిన పంటలో నాణ్యమైన కాయలను ఎంపిక చేసుకుని ఎండబెట్టి విత్తనాన్ని సిద్ధం చేసుకుంటారు. ఎకరాకు 70 నుంచి 80 బస్తాలు దిగుబడి వస్తుంది.

వాతావరణం అనుకూలిస్తే పెట్టుబడి పోను ఎకరాకు రూ.70 వేల నుంచి రూ.90 వేల వరకు ఆదాయం వస్తుందని రైతులు చెబుతున్నారు. ఈ చిట్టి మిరపకు డిమాండ్‌ ఎక్కువగా ఉండటంతో వ్యాపారులు పొలం వద్దకే వచ్చి కొనుగోలు చేస్తున్నారు. ముంబై, పుణె ప్రాంతాలకు తరలించి అక్కడి నుంచి దుబాయ్, మలేషియా దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ప్రతి సంవత్సరం 250 నుంచి 350 టన్నుల వరకు ఎగుమతి చేస్తారు. ముంబై, ఢిల్లీ, హైదరాబాద్‌ నగరాల్లోని స్టార్‌ హోటళ్లకు విక్రయిస్తున్నారు. వ్యాపారులు టన్ను పొట్టి మిర్చిని విదేశాల్లో రూ.7లక్షల వరకు విక్రయిస్తున్నట్లు సమాచారం. 

పదేళ్లుగా సాగు చేస్తున్నా 
పదేళ్లుగా పొట్టి మిరప సాగు చేస్తున్నా. మొత్తం మీద మిరప సాగు లాభదాయకంగా ఉంది. ప్రస్తుతం ప్రకృతి వ్యవసాయం ద్వారా సాగు చేయడం వల్ల మంచి దిగుబడి వస్తోంది. ఆదాయం కూడా బాగుంది. 
– వెలుగుల బాబ్జి, మిరప రైతు, దుర్గాడ, గొల్లప్రోలు మండలం

రైతులే మార్కెటింగ్‌ చేసుకునేలా చర్యలు
ప్రస్తుతం రైతు దగ్గర వ్యాపారులు కేజీ రూ.300 వరకు కొంటున్నారు. దానిని రూ.1.200లకు అమ్ముకుంటున్నారు. రైతులే స్వయంగా విక్రయించుకునేలా మార్కెటింగ్‌ సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాము.
– ఎలియాజర్, డీపీఎం ప్రకృతి వ్యవసాయ శాఖ, కాకినాడ

410 ఎకరాల్లో పొట్టి మిర్చి సాగు
గొల్లప్రోలు మండలంలో ఈ ఏడాది 410 ఎకరాల్లో పొట్టి మిర్చి సాగు చేశారు. ఉద్యానశాఖ ద్వారా ఎప్పటికప్పుడు రైతులకు  సలహాలు అందిస్తున్నాము. మంచి డిమాండ్‌ ఉన్న పంట కావడంతో రైతులు ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నారు.
– బీవీ రమణ, జిల్లా ఉద్యాన శాఖాధికారి, కాకినాడ  

మరిన్ని వార్తలు