ఆసియా సంరంభం నేడే ఆరంభం

23 Sep, 2023 02:23 IST|Sakshi

నేటి నుంచి 19వ ఆసియా క్రీడలు

చైనాలోని హాంగ్జౌ నగరం ఆతిథ్యం

పతకాల పట్టికలో టాప్‌–5 లక్ష్యంగా బరిలోకి భారత్‌

అథ్లెటిక్స్, షూటింగ్, రెజ్లింగ్‌ క్రీడాంశాలపై భారీ అంచనాలు

సాయంత్రం గం. 5:30 నుంచి సోనీ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం 

ఔత్సాహిక క్రీడాకారులు... వర్థమాన తారలు... ఒలింపిక్‌ చాంపియన్స్‌... జగజ్జేతలు... అందరూ మళ్లీ ఒకే వేదికపై తళుక్కుమనే సమయం ఆసన్నమైంది. ఒలింపిక్స్‌ తర్వాత అంతటి ప్రాధాన్యమున్న ఆసియా క్రీడలకు నేడు తెర లేవనుంది. చైనాలోని హాంగ్జౌ నగరం ఈ మెగా ఈవెంట్‌కు ఆతిథ్యమివ్వనుంది.

వాస్తవానికి 19వ ఆసియా క్రీడలు గత ఏడాదిలోనే జరగాలి. అయితే చైనాలో కరోనా వైరస్‌ తగ్గుముఖం పట్టకపోవడంతో ఈ క్రీడలను ఈ ఏడాదికి వాయిదా వేశారు. అధికారికంగా ఈ క్రీడలు నేడు ఆరంభమవుతున్నా... ఇప్పటికే పలు టీమ్‌  ఈవెంట్స్‌ (టి20 క్రికెట్, వాలీబాల్, ఫుట్‌బాల్, రోయింగ్, టేబుల్‌ టెన్నిస్‌)మొదలయ్యాయి.   

హాంగ్జౌ: ఆసియా క్రీడా పండుగకు వేళయింది. 19వ ఆసియా క్రీడలకు నేడు చైనాలోని హాంగ్జౌ నగరంలో అధికారికంగా తెర లేవనుంది. మొత్తం 45 దేశాల నుంచి 12 వేలకుపైగా క్రీడాకారులు 40 క్రీడాంశాల్లో పతకాల వేటకు సిద్ధమయ్యారు. అక్టోబర్‌ 8న ఈ క్రీడా సంరంభం సమాప్తం కానుంది. 1982 న్యూఢిల్లీ ఆసియా క్రీడల్లో తొలిసారిగా పతకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన చైనా గత 2018 జకార్తా ఆసియా క్రీడల వరకు తమ టాప్‌ ర్యాంక్‌ను నిలబెట్టుకుంటూ వస్తోంది. ఈసారి కూడా పతకాల పట్టికలో చైనాకు నంబర్‌వన్‌ స్థానం దక్కడం లాంఛనమే.

జపాన్, దక్షిణ కొరియా, ఇరాన్, ఉజ్బెకిస్తాన్‌ టాప్‌–5లో ఉండే అవకాశముంది. క్రితంసారి భారత్‌ 16 స్వర్ణాలు, 23 రజతాలు, 31 కాంస్యాలు కలిపి మొత్తం 70 పతకాలతో ఈ క్రీడల చరిత్రలోనే తమ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది. పతకాల పట్టికలో ఎనిమిదో స్థానంలో నిలిచిన భారత బృందం ఈసారి పతకాల సంఖ్య 100 దాటడంతోపాటు టాప్‌–5లో చోటు సంపాదించాలనే పట్టుదలతో ఉంది. అథ్లెటిక్స్, షూటింగ్, రెజ్లింగ్, ఆర్చరీ, బాక్సింగ్, టెన్నిస్‌ క్రీడాంశాల్లో ఈసారి భారత క్రీడాకారుల నుంచి భారీ అంచనాలు ఉన్నాయి.

భారత స్టార్‌ జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా ప్రధాన ఆకర్షణగా నిలువనున్నాడు. 2021 టోక్యో ఒలింపిక్స్‌లో, ఇటీవల ప్రపంచ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకాలు గెలిచిన నీరజ్‌ వరుసగా రెండో ఆసియా క్రీడల్లో తన పసిడి పతకాన్ని నిలబెట్టుకునే లక్ష్యంతో చైనాలో అడుగు పెడుతున్నాడు. భారత్‌ నుంచి ఈసారి అత్యధికంగా 655 మంది క్రీడాకారులు బరిలోకి దిగుతున్నారు.

నేడు జరిగే ప్రారంభ వేడుకల్లో భారత బృందానికి పురుషుల హాకీ జట్టు కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ సింగ్, మహిళా స్టార్‌ బాక్సర్‌ లవ్లీనా బొర్గోహైన్‌ పతాకధారులగా వ్యవహరించనున్నారు. భారత స్క్వాష్‌ స్టార్‌ ప్లేయర్లు సౌరవ్‌ గోషాల్, జోష్నా చినప్ప ఆరోసారి ... టేబుల్‌ టెన్నిస్‌ స్టార్‌ ఆచంట శరత్‌ కమల్‌ ఐదోసారి... వెటరన్‌ టెన్నిస్‌ స్టార్‌ రోహన్‌ బోపన్న నాలుగోసారి  ఆసియా క్రీడల్లో పోటీపడనుండటం విశేషం. 

7 ఇప్పటి వరకు జరిగిన అన్ని ఆసియా క్రీడల్లోనూ పోటీపడిన దేశాల సంఖ్య. భారత్, ఇండోనేసియా, జపాన్, ఫిలిప్పీన్స్, శ్రీలంక, సింగపూర్, థాయ్‌లాండ్‌ ఈ జాబితాలో ఉన్నాయి. 

671 ఇప్పటి వరకు జరిగిన 18 ఆసియా క్రీడల్లో పోటీపడి భారత్‌ గెలిచిన పతకాలు. ఇందులో 155 స్వర్ణాలు, 200 రజతాలు, 316 కాంస్య పతకాలు ఉన్నాయి. అత్యధికంగా అథ్లెటిక్స్‌లో భారత్‌కు 254 పతకాలు వచ్చాయి. బాక్సింగ్‌ (57), షూటింగ్‌ (57), రెజ్లింగ్‌ (49), టెన్నిస్‌ (32) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.  

3187 ఆసియా క్రీడల చరిత్రలో చైనా నెగ్గిన పతకాలు. ఇందులో 1473 స్వర్ణాలు, 994 రజతాలు, 720 కాంస్యాలు ఉన్నాయి. చైనా తర్వాత జపాన్‌ (3054), దక్షిణ కొరియా (2235) రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. 

ఈసారి ఆసియా క్రీడల్లో ఆంధ్రప్రదేశ్‌ నుంచి 16 మంది, తెలంగాణ నుంచి 14 మంది క్రీడాకారులు భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 
ఆంధ్రప్రదేశ్‌: ధీరజ్‌ బొమ్మదేవర, వెన్నం జ్యోతి సురేఖ (ఆర్చరీ), జ్యోతి యర్రాజీ (అథ్లెటిక్స్‌), కిడాంబి శ్రీకాంత్, పీవీ సింధు, సాతి్వక్‌ సాయిరాజ్‌ (బ్యాడ్మింటన్‌), బాచిరాజు సత్యనారాయణ (బ్రిడ్జి), పెంటేల హరికృష్ణ, కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక (చెస్‌), నేలకుడితి అనూష (సాఫ్ట్‌ టెన్నిస్‌), సాకేత్‌ మైనేని (టెన్నిస్‌), ఆకుల సాయిసంహిత, దొంతర గ్రీష్మ (స్కేటింగ్‌), బారెడ్డి అనూష (క్రికెట్‌), శివ కుమార్‌ (సెపక్‌తక్రా). 

తెలంగాణ: వ్రితి అగర్వాల్‌ (స్విమ్మింగ్‌), అగసార నందిని (అథ్లెటిక్స్‌), పుల్లెల గాయత్రి, సిక్కి రెడ్డి (బ్యాడ్మింటన్‌), నిఖత్‌ జరీన్‌ (బాక్సింగ్‌), గురుగుబెల్లి గీతాంజలి (రోయింగ్‌), కైనన్‌ చెనాయ్, ఇషా సింగ్‌ (షూటింగ్‌), ఆకుల శ్రీజ (టేబుల్‌ టెన్నిస్‌), ఇరిగేశి అర్జున్‌ (చెస్‌), ప్రీతి కొంగర (సెయిలింగ్‌), బత్తుల సంజన (స్కేటింగ్‌), గుగులోత్‌ సౌమ్య (ఫుట్‌బాల్‌), తిలక్‌ వర్మ (క్రికెట్‌).  

మరిన్ని వార్తలు