Ajay Jadeja-ODI: మూడు గంటల్లోనే ఫలితం.. ఏడు గంటలు ఎవరు ఆడుతారు?

27 Jul, 2022 12:02 IST|Sakshi

టి20 క్రికెట్‌ రాకముందు వన్డే క్రికెట్‌కు యమా క్రేజ్‌ ఉండేది. రోజులో దాదాపు ఎనిమిది గంటలు సాగే మ్యాచ్‌ అయినా ఆసక్తికరంగా ఉండేంది. ఎందుకంటే అప్పటికి షార్ట్‌ ఫార్మాట్‌ పెద్దగా పరిచయం లేదు. ట్రయాంగులర్‌, ఐదు, ఏడు వన్డేల సిరీస్‌లు ఇలా చాలానే జరిగేవి. అప్పట్లో ఆయా జట్లు కూడా వన్డే సిరీస్‌లు ఆడడానికి ఉత్సాహం చూపించేవి. అందుకు తగ్గట్లుగానే ఐసీసీ కూడా ప్రణాళికలు రచించేది. 

కాల క్రమంలో పొట్టి ఫార్మాట్‌(టి20 క్రికెట్‌) బలంగా తయారవడం.. వన్డేల ప్రాధాన్యతను తగ్గించింది. మూడు గంటల్లో ముగిసేపోయే మ్యాచ్‌లు.. ఆటగాళ్లకు రెస్ట్‌ దొరికే సమయం ఎక్కువగా ఉండేది. వెరసి టి20లపై ఆటగాళ్లకు మోజు పెరిగిపోయింది. దీంతో టి20లు ఆడేందుకు వన్డే క్రికెట్‌కు దూరంగా ఉండడమే లేక రిటైర్మెంట్‌ ఇవ్వడమో జరుగుతుంది. ఇటీవలీ కాలంలో వన్డే క్రికెట్‌పై ఈ చర్చ మరింత ఎక్కువయింది. 

వన్డే క్రికెట్‌ను ఆపేస్తే మంచిదని కొందరు అభిప్రాయపడితే.. 50 ఓవర్ల నుంచి 40 ఓవర్లకు కుదించి వన్డే మ్యాచ్‌లను రూపొందించాలని రవిశాస్త్రి లాంటి క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. వన్డే క్రికెట్‌కు పూర్వ వైభవం రావాలంటే మల్టీ సిరీస్‌లు.. ట్రయాంగులర్‌ సిరీస్‌లు ఎక్కువగా ఆడిస్తే మంచిదంటూ మరికొందరు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్‌ అజయ్‌ జడేజా కూడా వన్డే క్రికెట్‌పై స్పందించాడు.

''మేం వన్డే మ్యాచ్‌లు ఆడే సమయానికి టెస్టులు తక్కువగా ఉన్నప్పటికి సమానంగా ఆడేవాళ్లం. కానీ సంప్రదాయ క్రికెట్‌తో వన్డే క్రికెట్‌ను ఎప్పుడూ పోల్చలేం. కానీ టి20 ఫార్మాట్‌ వచ్చాకా వన్డే క్రికెట్‌పై అందరికి ఆసక్తి తగ్గిపోయింది. ఒక టి20 మ్యాచ్‌లో మూడు గంటల్లోనే ఫలితం వస్తుంది.. అదే వన్డే మ్యాచ్‌ అయితే కనీసం ఏడు గంటలు ఆడాలి. ఏ ఆటగాడైనా ఫలితం తొందరగా వస్తున్న దానిపైనే ఎక్కువ ఆసక్తి చూపిస్తాడు. ప్రస్తుతం జరుగుతుంది అదే. మూడు గంటల్లో ఫలితం వస్తుంటే.. ఏడు గంటలు ఎవరు ఆడతారు చెప్పండి. వన్డే క్రికెట్‌ను సరికొత్తగా డిజైన్‌ చేయాలి లేదంటే త్వరలోనే కనుమరుగయ్యే అవకాశం ఉంది'' అంటూ చెప్పుకొచ్చాడు.

చదవండి: వన్డే క్రికెట్‌ చచ్చిపోతుంది.. ఈ మార్పు చేయండి..!

పంత్‌ మాటను లెక్కచేయని ధోని.. నవ్వుకున్న రోహిత్‌, సూర్యకుమార్‌

మరిన్ని వార్తలు