Kohli 49th ODI Century Highlights: విరాట్‌ కోహ్లి= సచిన్‌ టెండూల్కర్‌

6 Nov, 2023 02:27 IST|Sakshi

సచిన్‌ టెండూల్కర్‌ రికార్డును అందుకోవాలంటే మళ్లీ సచినే దిగి రావాలి... మాస్టర్‌ బ్యాటర్‌ ఘనతల గురించి ఒకప్పుడు వినిపించిన వ్యాఖ్యల్లో ఇదొకటి. సచిన్‌ రికార్డుల స్థాయి, అతను అందుకున్న అసాధారణ మైలురాళ్లను చేరుకోవడం దాదాపు అసాధ్యమనే భావన ఇందులో కనిపించింది... కానీ వాటిలో ఒక అరుదైన రికార్డును విరాట్‌ కోహ్లి ఇప్పుడు అందుకున్నాడు... తనకే సాధ్యమైన అద్భుత ఆటతో వన్డే క్రికెట్‌కు ముఖచిత్రంగా మారిన కోహ్లి 49వ సెంచరీని సాధించడం అనూహ్యమేమీ కాదు...

ప్రపంచకప్‌కు ముందు 47 వద్ద నిలిచిన అతను మెగా టోర్నీలో కనీసం రెండు సెంచరీలు సాధించగలడని అందరూ నమ్మారు... బంగ్లాదేశ్‌పై సెంచరీ తర్వాత మరో రెండుసార్లు చేరువగా వచ్చీ శతకానికి దూరమైన అతను ఈసారి విజయవంతంగా ఫినిషింగ్‌ లైన్‌ను దాటాడు. విరాట్‌ కోహ్లి నుదుటి రాతను దేవుడు రాయడు... అతనే స్వయంగా తన రాత రాసుకుంటాడు...

కోహ్లి శతకం అందుకున్న క్షణాన కామెంటేటర్‌ అన్న ఈ మాట అక్షరసత్యం. ప్రపంచకప్‌ మ్యాచ్‌లో తన 35వ పుట్టిన రోజున సచిన్‌ సెంచరీల సరసన నిలవడంవంటి అద్భుత స్క్రిప్ట్‌ నిజంగా కోహ్లికే సాధ్యమైంది. ప్రపంచకప్‌ గెలిచిన క్షణంలో సచిన్‌ను భుజాల మీదకు ఎత్తుకున్న కోహ్లి... పుష్కరం తర్వాత భుజం భుజం కలుపుతూ అతని సరసన సమానంగా నిలిచాడు.   


సాక్షి క్రీడా విభాగం  : వన్డే క్రికెట్‌ను విరాట్‌ కోహ్లి చదువుకున్నంత గొప్పగా మరెవరి వల్లా సాధ్యం కాలేదేమో! ఇన్నింగ్స్‌ను ఎలా ప్రారంభించాలి, మధ్య ఓవర్లలో ఎలాంటి ఆట ఆడాలి, చివర్లో ఎంతగా దూకుడు జోడించాలి... సరిగ్గా తాసులో కొలిచి లెక్కించినట్లుగా అతను ఈ ఫార్మాట్‌లో తన ఆటను ప్రదర్శించాడు. రుచికరమైన వంటకం కోసం వేర్వేరు దినుసులను సరిగ్గా ఎలా కలపాలో బాగా తెలిసిన షెఫ్‌ తరహాలో వన్డేల్లో విజయం కోసం ఎలాంటి మేళవింపు ఉండాలో అతను ఆడి చూపించాడు.

ముందుగా బ్యాటింగ్‌ చేయాల్సి వచ్చినా...లక్ష్యాన్ని ఛేదించాల్సి వచ్చినా తన వ్యూహంపై ఉండే స్పష్టత కోహ్లిని అందరికంటే ప్రత్యేకంగా నిలబెట్టింది. సాధారణంగా తొలి ఇన్నింగ్స్‌తో పోలిస్తే ఒత్తిడి ఎక్కువగా ఉండే లక్ష్య ఛేదనలో గొప్ప గొప్ప ఆటగాళ్ల రికార్డులు కూడా పేలవంగా ఉంటాయి. కానీ కోహ్లికి మాత్రం పరుగుల వేటలోనే అసలు మజా. ఎంత లక్ష్యాన్నైనా అందుకోవడంలో తనను మించిన మొనగాడు లేడన్నట్లుగా అతని బ్యాటింగ్‌ సాగింది.

తొలి ఇన్నింగ్స్‌లతో (51.15 సగటు, 22 సెంచరీలు) పోలిస్తే ఛేదనలో కోహ్లి రికార్డు (65.49 సగటు, 27 సెంచరీలు) ఘనంగా ఉందంటే అతని ఆట ఎలాంటిదో అర్థమవుతుంది. ఈ 27లో 23 సార్లు భారత్‌ విజయం సాధించడం విశేషం. తన బ్యాటింగ్‌పై అపరిమిత నమ్మకం, ఆత్మవిశ్వాసం, పట్టుదల, ఓటమిని అంగీకరించని తత్వం కోహ్లిని ‘ది బెస్ట్‌’గా తీర్చిదిద్దగా... అసాధారణ ఫిట్‌నెస్, విశ్రాంతి లేకుండా సుదీర్ఘ సమయం పాటు సాగే కఠోర సాధన అతడి ఆటను మరో స్థాయికి తీసుకెళ్లాయి.  

కోల్‌కతాలో శతకంతో మొదలై... 
ఆగస్టు 18, 2008... కోహ్లి తొలి వన్డే మ్యాచ్‌ ఆడిన రోజు. కొద్ది రోజుల క్రితమే భారత్‌కు అండర్‌–19 ప్రపంచకప్‌ అందించిన కెపె్టన్‌గా కోహ్లికి గుర్తింపు ఉండగా... సచిన్, సెహ్వాగ్‌లు విశ్రాంతి తీసుకోవడంతో శ్రీలంకతో వన్డే సిరీస్‌లో అతనికి తొలి అవకాశం దక్కింది. ఐదింటిలో ఒక మ్యాచ్‌లో అర్ధ సెంచరీ చేసినా సీనియర్ల రాకతో తప్పుకోవాల్సి వచ్చింది. అయితే ఆ తర్వాత దేశవాళీలో, ఆ్రస్టేలియా గడ్డపై ఎమర్జింగ్‌ టోర్నీలో భారీ స్కోర్లతో చెలరేగిన తనను మళ్లీ ఎంపిక చేయాల్సిన పరిస్థితిని కల్పించాడు. దాంతో ఏడాది తర్వాత మళ్లీ జట్టులోకి పునరాగమనం చేసే అవకాశం దక్కింది.

మూడు అర్ధసెంచరీల తర్వాత తన 14వ వన్డేలో శ్రీలంకపై 114 బంతుల్లో చేసిన 107 పరుగుల ఇన్నింగ్స్‌తో అతని ఖాతాలో తొలి సెంచరీ చేరింది. ఈ సెంచరీ కోల్‌కతాలోనే ఈడెన్‌ గార్డెన్స్‌లో నమోదు చేయడం విశేషం. ఈ మ్యాచ్‌ తర్వాత మరో మూడు వన్డేలకే మళ్లీ సెంచరీ నమోదు చేసిన కోహ్లికి ఇక వెనుదిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. వన్డే టీమ్‌లో అతను పూర్తి స్థాయిలో రెగ్యులర్‌ మెంబర్‌గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు.

2011 వన్డే వరల్డ్‌ కప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో సెహ్వాగ్‌తో పాటు కోహ్లి కూడా సెంచరీ సాధించాడు. అయితే ఫైనల్లో అతని ఇన్నింగ్స్‌ (35 పరుగులు) కూడా ఎంతో విలువైంది. 31 పరుగులకే సెహ్వాగ్, సచిన్‌ అవుటైన తర్వాత గంభీర్‌తో మూడో వికెట్‌కు జోడించిన కీలకమైన 83 పరుగులు చివరకు విజయానికి బాట వేశాయి.  

ఒకదాన్ని మించి మరొకటి... 
విరాట్‌ కెరీర్‌లో అప్పటికే ఎనిమిది సెంచరీలు వచ్చి చేరాయి. జట్టులో స్థానానికి ఢోకా లేకపోగా, జాగ్రత్తగా ఆడుతూ ఒక్కో పరుగు జత చేస్తూ ఇన్నింగ్స్‌ నిరి్మంచే ‘క్లాసిక్‌’ ఆటగాడిగా కోహ్లికి అప్పటికి గుర్తింపు వచ్చింది. కానీ అతనిలోని అసలైన దూకుడుకు హోబర్ట్‌ మైదానం వేదికైంది. శ్రీలంకతో మ్యాచ్‌లో 40 ఓవర్లలో 321 పరుగులు ఛేదిస్తేనే టోర్నీలో నిలిచే అవకాశం ఉన్న సమయంలో కోహ్లి నాలుగో స్థానంలో బరిలోకి దిగాడు. 86 బంతుల్లోనే 16 ఫోర్లు, 2 సిక్స్‌లతో అజేయంగా 133 పరుగులు చేయడంతో 37వ ఓవర్లోనే భారత్‌ లక్ష్యాన్ని చేరింది.

పరిస్థితిని బట్టి కోహ్లి తన ఆటను ఎలా మార్చుకోగలడో ఈ ఇన్నింగ్స్‌ చూపించగా, తర్వాతి రోజుల్లో ఇలాంటివి ఎన్నో వచ్చాయి. ఆసియా కప్‌లో పాకిస్తాన్‌పై చేసిన అత్యధిక స్కోరు 183, కేప్‌టౌన్‌లో దక్షిణాఫ్రికాపై 160 నాటౌట్, నేపియర్‌లో కివీస్‌పై 123, పుణేలో ఇంగ్లండ్‌పై 123, మెల్‌బోర్న్‌లో ఆస్ట్రేలియాపై 117... ఏది గొప్పదంటే ఏమి చెప్పాలి? జైపూర్‌లో ఆ్రస్టేలియాపై 52 బంతుల్లోనే చేసిన శతకం ఇప్పటికీ భారత్‌ తరఫున ఫాస్టెస్ట్‌ సెంచరీగా నమోదై ఉంది. అతని ఒక్కో వన్డే ఇన్నింగ్స్‌కు ఒక్కో ప్రత్యేకత ఉంది. ఈ శతకాలు అభిమానులకు పంచిన ఆనందం గురించి ప్రత్యేకంగా చెప్పాలా!  

మరిన్ని వార్తలు