#MLC2023: 'చిన్నా.. నేను క్రీజులో ఉన్నానంటే బంతిపై కన్నేసి ఉంచాలి'

23 Jul, 2023 11:02 IST|Sakshi

మేజర్‌ క్రికెట్‌ లీగ్‌(MLC 2023)లో లాస్‌ ఏంజిల్స్‌ నైట్‌ రైడర్స్‌ ఇప్పటివరకు భోణీ చేయలేకపోయింది. ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ పరాజయాలే చవిచూసిన నైట్‌రైడర్స్‌ జట్టు ఎప్పుడు గెలుపు బాట పడుతుందనేది ఆసక్తికరంగా మారింది. తాజాగా వాషింగ్టన్‌ ఫ్రీడమ్‌తో జరిగిన మ్యాచ్‌లో లాస్‌ ఏంజిల్స్‌ నైట్‌రైడర్స్‌ ఆరు వికెట్ల తేడాతో ఓటమిపాలయ్యింది.

అయితే మ్యాచ్‌లో ఆల్‌రౌండర్‌ ఆండ్రీ రసెల్‌ మాత్రం సక్సెస్‌ అయ్యాడు. 37 బంతుల్లో ఆరు ఫోర్లు, ఆరు సిక్సర్లతో 70 పరుగులు నాటౌట్‌గా నిలిచాడు. తాను విధ్వంసకర ఇన్నింగ్స్‌ ఆడిన బౌలింగ్‌ వైఫల్యంతో నైట్‌రైడర్స్‌ ఓటమి పాలైంది. ఈ సంగతి పక్కనబెడితే రసెల్‌ కొట్టిన సిక్సర్లలో ఒక బంతి పిల్లాడిని గాయపరిచింది.

ఇన్నింగ్స్‌ 13వ ఓవర్లో అకీల్‌ హొసెన్‌ వేసిన రెండో బంతిని రసెల్‌ లాంగాఫ్‌ మీదుగా భారీ సిక్సర్‌ బాదాడు. స్టాండ్సలోకి వెళ్లిన బంతి నేరుగా పిల్లాడి తలకు తాకింది. దీంతో పిల్లాడు నొప్పితో విలవిల్లాడిపోయాడు. ఆ తర్వాత పిల్లాడి తండ్రి ఐస్‌ప్యాక్‌తో తలకు మర్దన చేస్తూ స్టేడియంలోకి వచ్చాడు.

ఇది గమనించిన రసెల్‌ పిల్లాడి దగ్గరకు వచ్చి ఒక హగ్‌ ఇచ్చాడు. ఆ తర్వాత అతనికి సిగ్నేచర్‌ చేసిన బ్యాట్‌తో పాటు టోపీలు గిఫ్ట్‌గా ఇచ్చాడు. ఈ సందర్భంగా పిల్లాడికి రసెల్‌ ఒక సలహా కూడా ఇచ్చాడు.. చూడు చిన్న.. రసెల్‌ బ్యాటింగ్‌లో ఉన్నాడంటే బంతిపై కూడా ఒక కన్నేసి ఉంచు.. ఓకేనా అని తెలిపాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

తొలుత బ్యాటింగ్‌ చేసిన లాస్‌ ఏంజిల్స్‌ నైట్‌రైడర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. రసెల్‌ 70 నాటౌట్‌, రిలీ రొసౌ 41 పరుగులు మినహా మిగతావారు పెద్దగా ఆకట్టుకోలేదు. ప్రత్యర్థి బౌలర్లలో హెన్రిక్స్‌ మూడు వికెట్లు పడగొట్టగా.. మార్కో జాన్సెన్‌ రెండు, నెత్రావల్కర్‌, అకిల్‌ హొసెన్‌లు చెరొక వికెట్‌ తీశారు.

176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వాషింగ్టన్‌ ఫ్రీడమ్‌ 18.1 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను అందుకుంది. వాషింగ్టన్‌ ఇన్నింగ్స్‌లో అందరు బ్యాటర్లు సమిష్టిగా రాణించారు. ఓపెనర్లు మాథ్యూ స్కాట్‌(43 పరుగులు), ఆండ్రీస్‌ గౌస్‌(40 పరుగులు) చేయగా.. గ్లెన్‌ పిలిప్స్‌ 29, ఒబెస్‌ పియనర్‌ 26 పరుగులు నాటౌట్‌ జట్టును గెలిపించాడు. 

చదవండి: IND vs WI: అశ్విన్‌తో అట్లుంటది మరి.. విండీస్‌ కెప్టెన్‌ ఫ్యూజ్‌లు ఔట్‌! వీడియో వైరల్‌

>
మరిన్ని వార్తలు