#JyothiYarraji: జ్యోతి యర్రాజీకి సీఎం జగన్‌ అభినందనలు

14 Jul, 2023 10:22 IST|Sakshi

తాడేపల్లి: ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్లో స్వర్ణం గెలిచిన జ్యోతి యర్రాజీకి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మెహన్‌రెడ్డి అభినందనలు తెలిపారు. థాయిలాండ్‌ వేదికగా గురువారం జరిగిన 25వ ఆసియా అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో జ్యోతి 100 మీటర్ల హార్డిల్స్‌లో స్వర్ణ పతకం సాధించింది.

ఈ నేపథ్యంలో సీఎం జగన్‌ ట్విటర్‌ వేదికగా స్పందిస్తూ.. ''వైజాగ్‌కు చెందిన జ్యోతి యర్రాజీకి నా శుభాకాంక్షలు. 25వ ఆసియా అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించి ఎవరికి సాధ్యం కాని రికార్డును అందుకున్నావు. మీ ప్రదర్శనతో అందరినీ గర్వపడేలా చేశారు.. కంగ్రాట్స్‌ జ్యోతి యర్రాజీ'' అంటూ ట్వీట్‌ చేశారు. 

ఇక థాయ్‌లాండ్‌ రాజధాని బ్యాంకాక్‌లో జరుగుతున్న ఈ మెగా ఈవెంట్‌లో గురువారం జ్యోతి 100 మీటర్ల హర్డిల్స్‌ ఫైనల్‌ రేసును 13.09 సెకన్లలో ముగించి చాంపియన్‌గా అవతరించింది. తద్వారా 50 ఏళ్ల ఈ పోటీల చరిత్రలో 100 మీటర్ల హర్డిల్స్‌లో పసిడి పతకం గెలిచిన తొలి భారతీయ అథ్లెట్‌గా జ్యోతి గుర్తింపు పొందింది.

విశాఖ జిల్లాకు చెందిన జ్యోతి ఈ ప్రదర్శనతో వచ్చే నెలలో బుడాపెస్ట్‌లో జరిగే ప్రపంచ చాంపియన్‌షిప్‌ పోటీలకు కూడా అర్హత సాధించింది. ప్రస్తుతం భువనేశ్వర్‌లోని రిలయన్స్‌ అథ్లెటిక్స్‌ హై పెర్ఫార్మెన్స్‌ సెంటర్‌లో ఇంగ్లండ్‌కు చెందిన కోచ్‌ జేమ్స్‌ హీలియర్‌ వద్ద జ్యోతి శిక్షణ తీసుకుంటోంది. గత రెండేళ్లుగా జ్యోతి జాతీయ, అంతర్జాతీయ మీట్‌లలో నిలకడగా పతకాలు సాధిస్తోంది.  

23 ఏళ్ల జ్యోతి మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌ విభాగంలో స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. గురువారం జరిగిన 100 మీటర్ల హర్డిల్స్‌ ఫైనల్‌ రేసులో జ్యోతి అందరికంటే వేగంగా 13.09 సెకన్లలో గమ్యానికి చేరి విజేతగా అవతరించింది. అసుక తెరెదా (జపాన్‌; 13.13 సెకన్లు) రజత పతకం, ఆకి మసుమి (జపాన్‌; 13.26 సెకన్లు) కాంస్య పతకం గెలిచారు. వర్షం కారణంగా తడిగా ఉన్న ట్రాక్‌పై జరిగిన ఫైనల్‌ రేసులో జ్యోతి ఆద్యంతం ఒకే వేగంతో పరిగెత్తి అనుకున్న ఫలితం సాధించింది. 50 ఏళ్ల చరిత్రగల ఆసియా చాంపియన్‌షిప్‌లో మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో స్వర్ణ పతకం గెలిచిన తొలి భారతీయ అథ్లెట్‌గా గుర్తింపు పొందింది.

చదవండి: జ్యోతి ‘స్వర్ణ’ చరిత్ర.. మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో విజేతగా ఆంధ్రప్రదేశ్‌ అమ్మాయి

>
మరిన్ని వార్తలు