Ind vs Pak Kohli Century: సచిన్‌ రికార్డు బద్దలు కొట్టిన కోహ్లి.. ప్రపంచంలోనే తొలి బ్యాటర్‌గా

11 Sep, 2023 19:13 IST|Sakshi

Asia Cup 2023- India vs Pakistan- Virat Kohli Century: దాయాది పాకిస్తాన్‌తో మ్యాచ్‌ అంటే టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి పూనకాలే అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గతేడాది టీ20 వరల్డ్‌కప్‌-2022లో చిరకాల ప్రత్యర్థిపై భారత్‌కు తన అద్భుత ఇన్నింగ్స్‌తో చిరస్మరణీయ విజయం అందించిన తీరును ఎవరూ మర్చిపోలేరు. 

పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా కోహ్లి
ఇక తాజాగా మరోసారి పాక్‌పై అదిరిపోయే బ్యాటింగ్‌తో తనకు తానే సాటి అని నిరూపించుకున్నాడు. ఆసియా కప్‌-2023 సూపర్‌ -4 మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా అజేయ సెంచరీతో చెలరేగాడు. కోహ్లి ఇన్నింగ్స్‌లో ఏకంగా 9 ఫోర్లు, 3 సిక్సర్లు ఉండటం విశేషం.

సచిన్‌ టెండుల్కర్‌ రికార్డు బద్దలు.. ప్రపంచంలో తొలి బ్యాటర్‌గా
ఈ క్రమంలో అంతర్జాతీయ వన్డేల్లో 47వ సెంచరీ సాధించిన విరాట్‌ కోహ్లి.. టీమిండియా దిగ్గజం సచిన్‌ టెండుల్కర్‌ పేరిట ఉన్న ప్రపంచ రికార్డు బద్దలు కొట్టాడు. అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో తక్కువ ఇన్నింగ్స్‌లో 13 వేల పరుగులు పూర్తి చేసుకున్న తొలి బ్యాటర్‌గా కోహ్లి రికార్డు సృష్టించాడు. ఈ క్రమంలో సచిన్‌ టెండుల్కర్‌ను కోహ్లి అధిగమించాడు.

చెలరేగిన బ్యాటర్లు.. టీమిండియా భారీ స్కోరు
ఇదిలా ఉంటే.. పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో రిజర్వ్‌ డే అయిన సోమవారం టీమిండియా బ్యాటర్లు కేఎల్‌ రాహుల్‌, విరాట్‌ కోహ్లి అజేయ సెంచరీలతో అదరగొట్టారు. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి భారత జట్టు 356 పరుగుల భారీ స్కోరు సాధించింది.

అంతకు ముందు ఆదివారం ఓపెనర్లు రోహిత్‌ శర్మ (56), శుబ్‌మన్‌ గిల్‌(58) అర్ధ శతకాలు సాధించారు. కాగా కొలంబోలో జరగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన పాకిస్తాన్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకున్న విషయం తెలిసిందే.

వన్డేల్లో 13 వేల పరుగులు చేసేందుకు.. ఎవరికి ఎన్ని ఇన్నింగ్స్‌ అవసరమయ్యాయంటే?
1. విరాట్‌ కోహ్లి- 267
2. సచిన్‌ టెండుల్కర్‌- 321
3. రిక్కీ పాంటింగ్‌- 341
4. కుమార్‌ సంగక్కర- 363
5. సనత్‌ జయసూర్య- 416.

చదవండి: రోహిత్‌ పూర్తిగా నిరాశపరిచాడు.. మరీ చెత్తగా..: టీమిండియా మాజీ ఓపెనర్

మరిన్ని వార్తలు