-

Asia Cup 2023 IND VS NEP: అరుదైన ఘనత సాధించిన విరాట్‌ కోహ్లి

4 Sep, 2023 18:54 IST|Sakshi

టీమిండియా మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ఖాతాలో మరో రికార్డు చేరింది. ఆసియా కప్‌ 2023లో భాగంగా నేపాల్‌తో ఇవాళ (సెప్టెంబర్‌ 4) జరుగుతున్న మ్యాచ్‌లో ఆసిఫ్‌ షేక్‌ క్యాచ్‌ పట్టడం ద్వారా కోహ్లి మల్టీ నేషనల్‌ వన్డే టోర్నమెంట్లలో 100 క్యాచ్‌లను పూర్తి చేశాడు. భారత మాజీ సారధి మొహమ్మద్‌ అజహారుద్దీన్‌ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో నాన్‌ వికెట్‌కీపర్‌గా కోహ్లి రికార్డుల్లోకెక్కాడు. 

నేపాల్‌ ఇన్నింగ్స్‌ 30వ ఓవర్‌లో మహ్మద్‌ సిరాజ్‌ బౌలింగ్‌లో విరాట్‌ ఈ క్యాచ్‌ను అందుకున్నాడు. అంతకుముందు కోహ్లి ఓసారి ఆసిఫ్‌ షేక్‌ అందించిన సునాయాస క్యాచ్‌ను జారవిడిచాడు. హాఫ్‌ సెంచరీ సాధించి క్రీజ్‌లో పాతుకుపోయిన ఆసిఫ్‌ (58; 8 ఫోర్లు) వికెట్‌ దక్కడంతో టీమిండియాకు బ్రేక్‌ లభించినట్లైంది.    

ఇదిలా ఉంటే, వరుణుడి ఆటంకాల నడుమ సాగుతున్న భారత్‌-నేపాల్‌ మ్యాచ్‌లో టీమిండియా టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. కుషాల్‌ భుర్టెల్‌ (38), ఆసిఫ్‌ షేక్‌లు నేపాల్‌కు శుభారంభాన్ని అందించారు. వీరిద్దరు తొలి వికెట్‌కు 65 పరుగులు జోడించారు. అనంతరం రవీంద్ర జడేజా తన స్పిన్‌ మాయాజాలాన్ని ప్రదర్శించి నేపాల్‌ను దెబ్బకొట్టాడు.

జడ్డూ స్వల్ప వ్యవధిలో 3 వికెట్లు పడగొట్టి టీమిండియాను మ్యాచ్‌లోకి తెచ్చాడు. 39 ఓవర్ల తర్వాత నేపాల్‌ స్కోర్‌ 183/6గా ఉంది. దీపేంద్ర సింగ్‌ (28), సోంపాల్‌ కామీ (15) క్రీజ్‌లో ఉన్నారు. భారత బౌలర్లలో జడేజా 3, సిరాజ్‌ 2, శార్దూల్‌ ఠాకూర్‌ ఓ వికెట్‌ పడగొట్టాడు.

మరిన్ని వార్తలు