Ban vs NZ Day 1: న్యూజిలాండ్‌కు మరో షాకిచ్చిన బంగ్లాదేశ్‌.. తొలిరోజే అలా! హైలైట్స్‌ ఇవే..

6 Dec, 2023 20:25 IST|Sakshi

Bangladesh vs New Zealand, 2nd Test: బంగ్లాదేశ్‌తో రెండో టెస్టులోనూ న్యూజిలాండ్‌కు శుభారంభం లభించలేదు. తొలి ఇన్నింగ్స్‌ ఆతిథ్య జట్టును 172 పరుగులకే కట్టడి చేశామన్న సంతోషం కివీస్‌ జట్టుకు ఎక్కువ సేపు నిలవలేదు. తొలి రోజు ఆట ముగిసే సరికి అనూహ్యంగా బంగ్లాదేశ్‌ ఆధిక్యంలోకి వచ్చింది.

రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ ఆడేందుకు న్యూజిలాండ్‌ బంగ్లా పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా సిల్హైట్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో కివీస్‌కు ఘోర పరభావం ఎదురైంది. బంగ్లాదేశ్‌ గడ్డపై మొదటిసారి ఆతిథ్య జట్టు చేతిలో.. అది కూడా 150 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది.

ఈ క్రమంలో రెండో టెస్టులోనైనా సత్తా చాటాలని భావిస్తోంది టిమ్‌ సౌథీ బృందం. ఇందులో భాగంగా ఢాకాలో బుధవారం మొదలైన మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన బంగ్లాను 172 పరుగులకు కట్టడి చేసింది. మిచెల్‌ సాంట్నర్‌, గ్లెన్‌ ఫిలిప్స్‌ మూడేసి వికెట్లు పడగొట్టగా.. అజాజ్‌ పటేల్‌ రెండు, సౌథీ ఒక వికెట్‌ తమ ఖాతాలో వేసుకున్నారు.

ఆరంభంలోనే కివీస్‌కు షాక్‌
ఈ నేపథ్యంలో బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌కు బంగ్లా స్పిన్నర్‌ తైజుల్‌ ఇస్లాం ఆరంభంలోనే షాకిచ్చాడు. ఓపెనర్‌ టామ్‌ లాథమ్‌ను 4 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్‌కు పంపించాడు. మరో ఓపెనర్‌ డెవాన్‌ కాన్వే(11), వన్‌డౌన్‌ బ్యాటర్‌ కేన్‌ విలియమ్సన్‌(13)ను మెహిది హసన్‌ మిరాజ​.. ఆ తర్వాతి స్థానంలో వచ్చిన హెన్రీ నికోల్స్‌(1)ను తైజుల్‌ అవుట్‌ చేశారు.

ఆరో స్థానంలో వచ్చిన వికెట్‌ కీపర్‌ టామ్‌ బ్లండెల్‌ను హసన్‌ మిరాజ్‌ డకౌట్‌ చేయగా.. వెలుతురు లేమి కారణంగా తొలి రోజు ఆట ముగిసే సరికి ఐదో నంబర్‌ బ్యాటర్‌ డారిల్‌ మిచెల్‌ 12, ఎనిమిదో స్థానంలో వచ్చిన గ్లెన్‌ ఫిలిప్స్‌ 5 పరుగులతో అజేయంగా నిలిచారు. ఈ క్రమంలో బుధవారం నాటి ఆట పూర్తయ్యేసరికి న్యూజిలాండ్‌ 12.4 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 55 పరుగులు మాత్రమే చేసి వెనుకబడిపోయింది.

హైలైట్స్‌ ఇవే
ఇక ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ బ్యాటర్‌ ముష్ఫికర్‌ రహీం వింతైన పద్ధతిలో అవుట్‌ కావడం హైలైట్‌గా నిలిచింది. జెమీసన్‌ బౌలింగ్‌లో వికెట్ల దిశగా వెళ్తున్న బంతిని చేతితో ఆపి రహీం హ్యాండిలింగ్‌ ద బాల్‌ నిబంధన వల్ల పెవిలియన్‌ చేరాడు. మరోవైపు.. తొలిరోజు ఆటలోనే మొత్తంగా 15 వికెట్లు కూలడం మరో విశేషం. మొత్తానికి ఢాకా పిచ్‌ స్పిన్నర్లకు బాగా అనుకూలించింది. ఇక న్యూజిలాండ్‌ ప్రస్తుతం బంగ్లా కంటే 117 పరుగులు వెనుకబడి ఉంది.

చదవండి: కోహ్లి, రోహిత్‌ కాదు! నా ప్రపంచ రికార్డులు బద్దలు కొట్టే సత్తా అతడికే ఉంది: లారా

>
మరిన్ని వార్తలు