Ind vs Aus: టీమిండియాను ట్రోల్‌ చేసిన పాక్‌ ఫ్యాన్‌.. దిమ్మతిరిగే కౌంటర్‌!

6 Dec, 2023 21:33 IST|Sakshi

టీమిండియా ఆట తీరును తక్కువ చేస్తూ మాట్లాడిన పాకిస్తాన్‌ అభిమానికి ప్రముఖ కామెంటేటర్‌ హర్షా భోగ్లే దిమ్మతిరిగేలా కౌంటర్‌ ఇచ్చాడు. సంకుచిత బుద్ధిని వదిలి ప్రపంచాన్ని చూస్తే.. ఎంతో అద్భుతంగా కనిపిస్తుందంటూ చురకలు అంటించాడు.

పడిలేచిన కెరటంలా.. టెస్టు చరిత్రలో అత్యుత్తమ ప్రదర్శనతో టీమిండియా ట్రోఫీ గెలిచిన తీరును అపహాస్యం చేసే విధంగా మాట్లాడటం తగదని హితవు పలికాడు. ఆస్ట్రేలియా పర్యటన 2020-21లో భాగంగా టీమిండియా టెస్టు సిరీస్‌ను ఓటమితో ఆరంభించిన విషయం తెలిసిందే.

అడిలైడ్‌ వేదికగా జరిగిన తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 36 పరుగులకే తొమ్మిది వికెట్లు కోల్పోయిన(షమీ రిటైర్డ్‌హర్ట్‌) భారత జట్టు.. ఈ మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియోను ఫారూఖ్‌ ఖాన్‌ అనే పాక్‌ నెటిజన్‌ ఎక్స్‌ ఖాతాలో షేర్‌ చేశాడు.

‘‘మీకు ఏ రోజైనా చెత్తగా అనిపిస్తే.. ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా ఇలా ఘోరంగా ఓడిపోయిన వీడియోను చూడండి’’ అని భారత జట్టుపై అక్కసు వెళ్లగక్కాడు. ఇందుకు బదులిచ్చిన హార్ష భోగ్లే.. ‘‘ఈ వీడియోను బయటకు తీసినందుకు నాకు సంతోషంగా ఉంది ఫారూఖ్‌.

ఎందుకంటే ఎంతో పట్టుదలగా.. అద్భుతంగా పోరాడి టెస్టు చరిత్రలో టీమిండియా అత్యుత్తమ ప్రదర్శన చేసింది ఈ సిరీస్‌లోనే! అద్భుత నాయకత్వ ప్రతిభ, ఆటగాళ్ల పట్టుదల ఉంటే అసాధ్యాలను సుసాధ్యం చేయగలమన్న నమ్మకం ఇచ్చింది ఇక్కడే!

ఇలాంటి వాటిని గుర్తు చేసుకున్నపుడే సరికొత్త ఉత్సాహంతో మరింత ముందుకు వెళ్లే అవకాశం లభిస్తుంది. ఎదుటి వ్యక్తుల కష్టాన్ని చూసి నువ్వు సంతోషపడుతున్నావంటే అంతకంటే చిన్నబుద్ధి ఇంకోటి ఉండదు. కాస్త క్లాస్‌గా ఆలోచించు. అలా అయితే ఈ ప్రపంచం నీకు అద్భుతంగా కనిపిస్తుంది’’ అని కౌంటర్‌ ఇచ్చాడు. ఇతరులు కష్టాల్లో ఉంటే ఎంజాయ్‌ చేయాలని చెప్పడం చీప్‌ మెంటాలిటీ అనిపించుకుంటుందని ఘాటుగా బదులిచ్చాడు హర్షా భోగ్లే.

కాగా నాటి సిరీస్‌లో ఆస్ట్రేలియా చేతిలో తొలి మ్యాచ్‌లో ఓడిన టీమిండియా తర్వాతి మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో గెలిచింది. మూడో టెస్టును డ్రా చేసుకుని.. నాలుగో మ్యాచ్‌లో విజయం సాధించి తొలిసారి ఆసీస్‌ గడ్డపై ట్రోఫీ గెలిచింది. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ హర్షా భోగ్లే ఫారుఖ్‌కు కౌంటర్‌ వేశాడు. కాగా ఫారుఖ్‌ తన సోషల్‌ మీడియా అకౌంట్లలో ఎక్కువగా టీమిండియాను అపహాస్యం చేస్తూ పోస్టులు పెట్టడం గమనార్హం. 
 

>
మరిన్ని వార్తలు