బీసీసీఐ రూ.10 కోట్ల విరాళం

21 Jun, 2021 17:07 IST|Sakshi

న్యూఢిల్లీ:  టోక్యో ఒలింపిక్స్‌ తుది సన్నాహాల్లో ఉన్న భారత బృందానికి భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) రూ. 10 కోట్ల విరాళం ప్రకటించింది. ఆదివారం అత్యవసరంగా సమావేశమైన బోర్డు ఉన్నతాధికారులు టోక్యో వెళ్లే జట్టుకు తమ వంతు సాయంగా నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ఈ వర్చువల్‌ మీటింగ్‌లో బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ, కార్యదర్శి జై షా పాల్గొన్నారు. ‘అవును... టోక్యో బృందానికి సాయం చేయాలని బీసీసీఐ నిర్ణయించింది. 

రూ. 10 కోట్ల నిధులిచ్చేందుకు బోర్డు అపెక్స్‌ కౌన్సిల్‌ అమోదం తెలిపింది. మెగా ఈవెంట్‌కు అర్హత పొందిన అథ్లెట్ల సన్నాహాలు, కిట్లు, ఇతరత్రా ఖర్చుల కోసం ఈ నిధులు వినియోగించుకోవచ్చు’ అని బోర్డు ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. చైనా క్రీడా ఉత్పత్తుల సంస్థ ‘లీ–నింగ్‌’  స్పాన్సర్‌షిప్‌ను ఐఓఏ ఇటీవలే రద్దు చేసుకుంది. దీంతో క్రీడాశాఖ వినతి మేరకు బీసీసీఐ నిధులు సమకూర్చేందుకు ముందుకొచ్చింది. వచ్చే నెల 23 నుంచి టోక్యో ఒలింపిక్స్‌ జరుగుతాయి.  

మూడు ఐసీసీ మెగా టోర్నీలకు బీసీసీఐ బిడ్‌! 
రాబోయే ప0దేళ్ల కాలంలో అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) ఆధ్వర్యంలో జరిగే మూడు మెగా టోర్నమెంట్‌ల ఆతిథ్యం కోసం బిడ్‌లు దాఖలు చేస్తామని భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) తెలిపింది. ఆన్‌లైన్‌లో ఆదివారం జరిగిన అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 2025 చాంపియన్స్‌ ట్రోఫీ... 2028 టి20 వరల్డ్‌కప్, 2031 వన్డే వరల్డ్‌కప్‌ నిర్వహణ కోసం  బిడ్‌ దాఖలు చేస్తుందని బీసీసీఐ సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు.  

మరిన్ని వార్తలు