బ్యాకప్‌ వేదికగా యూఏఈ.. అనుమతి లభించేనా?

4 May, 2021 15:31 IST|Sakshi

టీ20 వరల్డ్‌కప్‌పై అనిశ్చితి..!

ముంబై:   కరోనా దెబ్బకు ఆటలు జరిగే అవకాశం లేని స్థితిలో ఐపీఎల్‌ వంటి మెగా లీగ్‌ టోర్నీ అసాధ్యమని భారత్‌ క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు(బీసీసీఐ) కాస్త లేటుగానైనా గ్రహించింది. ఒకవైపు ఆటగాళ్లు కరోనా బారిన పడుతున్నా ‘జరిపితీరుతాం’ అని నిన్నటి వరకూ పట్టుబట్టుకు కూర్చున్న  బీసీసీఐ..  ఎట్టకేలకు దిగివచ్చింది. మళ్లీ ఐపీఎల్‌ జరగాలంటే దానికి రీషెడ్యూల్‌ అనేది చాలా కష్టంగా ఉంటుంది. మిగతా బోర్డులకు క్రికెట్‌  టోర్నీలు లేని సమయం చూసి, అది కూడా కరోనా ఉధృతి తగ్గితేనే ఐపీఎల్‌ను నిర్వహించడానికి బీసీసీఐ ముందుకొస్తుంది.

గత సీజన్‌ను సెప్టెంబర్‌ నుంచి నవంబర్‌ 10వరకూ నిర్వహించినట్లు ప్లాన్‌ చేసినా అది సాధ్యపడకపోవచ్చు. ఆ సమయంలో టీ20 వరల్డ్‌కప్‌ ఉంది. గతేడాది ఆస్ట్రేలియాలో జరగాల్సిన టీ20 వరల్డ్‌కప్‌ ఈ ఏడాదికి వాయిదా పడింది. దానికి భారత్‌ ఆతిథ్యం ఇవ్వనుంది. మరి భారత్‌లోనే కరోనా తీవ్రత ఎక్కువగా ఉండటంతో అప్పటికి ఐపీఎల్‌ను పక్కన పెడితే, టీ20 వరల్డ్‌కప్‌ కూడా కష్టమే కావొచ్చు. 

గతేడాది జరగాల్సిన 2020 టి20 ప్రపంచ కప్‌ను 2021లో... 2021లో జరగాల్సిన టోర్నీని 2022లో నిర్వహించనున్నారు. వాస్తవ షెడ్యూల్‌ ప్రకారం 2023 వన్డే వరల్డ్‌కప్‌ భారత్‌లో జరగాల్సి ఉంది. సంవత్సరం విషయంలో ఇందులో ఎలాంటి మార్పు లేదు కానీ తేదీలు మారాయి. భారత్‌లో ఫిబ్రవరి–మార్చి మధ్య ఈ టోర్నీ జరగాలి. అయితే రెండు ఐసీసీ టోర్నీల మధ్య ఉండాల్సిన కనీస అంతరాన్ని దృష్టిలో పెట్టుకొని దీనిని నవంబరుకు మార్చారు.

పాత షెడ్యూల్‌ ప్రకారం 2021లోనే టి20 ప్రపంచకప్‌ నిర్వహించాలని, అవసరమైతే ఆస్ట్రేలియా 2022లో నిర్వహించాలని భారత్‌ కోరడంతో అందుకు గతేడాది గ్రీన్‌ సిగ్నల్‌ పడింది. వాస్తవానికి ఈ టీ20 వరల్ట్‌కప్‌ ఆస్ట్రేలియాలో జరగాలి. అక్కడ జరగాల్సిన టోర్నీ వాయిదా పడటంతో అక్కడే నిర్వహించాలనే సీఎ పట్టుబట్టింది. కానీ అందులో  మార్పులు జరగడంతో 2021 టీ20 వరల్డ్‌కప్‌ను భారత్‌లో నిర్వహించడానికి ఆమోదముద్ర పడింది. మరి ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే భారత్‌లో వరల్డ్‌కప్‌లాంటి మెగా ఈవెంట్‌ను నిర్వహించడం అంత ఈజీ కాదు.

బ్యాకప్‌ వేదికగా యూఏఈ
టీ20 వరల్డ్‌కప్‌ను భారత్‌లో ఈ సంవత్సరం ద్వితీయార్థం(అక్టోబర్‌- నవంబరు)లో టోర్నీ నిర్వహణకై బీసీసీఐ హక్కులు సొంతం చేసుకుంది. అయితే, ప్రస్తుతం దేశంలో కోవిడ్‌ రోజువారీ కేసులు 3 లక్షలకు పైగా నమోదు కావడం, కరోనా మరణాలు కూడా పెరుగుతుండటంతో వేదికగా మార్చే దిశగా బీసీసీఐ యోచిస్తోంది. యూఏఈలో నిర్వహిస్తే ఏ ఇబ్బంది ఉండదని భావిస్తోంది. దానికి అనుగుణంగా ముందు నుంచే ప్రణాళికలు సిద్ధం చేయాలని చూస్తోంది. టీ20 వరల్డ్‌కప్‌కు పెద్దగా సమయం లేదు. ఇంకా నాలుగు నెలలు మాత్రమే సమయం మాత్రమే ఉండటంతో కనీసం వచ్చే నెల మధ్య నుంచైనా అందుకు సంబంధించిన కార్యాచరణను ముమ్మరం చేయాలి. బ్యాకప్‌ వేదికగా యూఏఈ అనుకున్నా ప్రస్తుత పరిస్ధితులు దృష్ట్యా యూఏఈ నుంచి అనుమతి లభిస్తుందో లేదో చూడాలి.

ఇక్కడ చదవండి: IPL 2021 సీజన్‌ రద్దు: బీసీసీఐ
అయోమయంలో ఆసీస్‌ క్రికెటర్ల పరిస్థితి..!

మరిన్ని వార్తలు