BGT 2023: ఆస్ట్రేలియా మాస్టర్‌ ప్లాన్‌.. మన ‘అశ్విన్‌ డూప్లికేట్‌’తో కలిసి ప్రాక్టీసు! ఇంతకీ ఎవరీ కుర్రాడు?

3 Feb, 2023 15:32 IST|Sakshi
రవిచంద్రన్‌ అశ్విన్‌- మహేశ్‌ పితియా (PC: Instagram)

India Vs Australia Test Series- Who is Mahesh Pithiya: ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ 2021-23 సీజన్‌లో ఇప్పటికే ఫైనల్‌ చేరింది ఆస్ట్రేలియా. ప్రతిష్టాత్మక టైటిల్‌ గెలిచేందుకు అడుగు దూరంలో నిలిచిన కంగారూ జట్టు ఫుల్‌ జోష్‌లో ఉంది. ఇక, డబ్ల్యూటీసీ ఫైనల్‌ పోరు కంటే ముందు టీమిండియాతో టెస్టు సిరీస్‌  ఆడనుంది.

ఆస్ట్రేలియా మాస్టర్‌ ప్లాన్‌
అయితే, భారత గడ్డపై అదీ ఎక్కువగా స్పిన్‌ బౌలర్లకు అనుకూలించే పిచ్‌లపై టీమిండియాతో సిరీస్‌ అంటే ఆషామాషీ కాదు. రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌ వంటి స్పిన్నర్లను ఎదుర్కోవడం అంత తేలికేమీ కాదు. ముఖ్యంగా సొంతగడ్డపై అశూ ఎలా రెచ్చిపోతాడో ఆసీస్‌ బ్యాటర్లకు గతానుభవమే!

అందుకే అచ్చం అశూ మాదిరే బౌలింగ్‌ చేయగల గుజరాత్‌ బౌలర్‌తో కలిసి ఆస్ట్రేలియా బ్యాటర్లు ప్రాక్టీసు చేస్తున్నారు. బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీకి సన్నద్ధమయ్యే క్రమంలో నెట్స్‌లో ‘అశూ డూప్లికేట్‌’ను ఎదుర్కొంటున్నారు.

A post shared by Mahesh Pithiya (@themaheshpithiya99_)

ఎవరీ మహేశ్‌ పితియా?!
ఆ వ్యక్తి పేరు మహేశ్‌ పితియా. గుజరాత్‌లోని జునాగఢ్‌కు చెందిన మహేశ్‌ స్పిన్‌ బౌలర్‌. 21 ఏళ్ల ఈ యువ క్రికెటర్‌ దేశవాళీ క్రికెట్‌లో బరోడా జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. తాజా సీజన్‌తో రంజీల్లో ఎంట్రీ(డిసెంబరులో) ఇచ్చిన అతడు ఆల్‌రౌండ్‌ ‍ప్రతిభ కనబరిచి అందరి దృష్టిని ఆకర్షించాడు.


PC: Instagram

ఉత్తరప్రదేశ్‌, హిమాచల్‌, బెంగాల్‌, నాగాలాండ్‌ జట్లతో మ్యాచ్‌లలో మహేశ్‌ మొత్తంగా 8 వికెట్లు పడగొట్టడంతో పాటు 116 పరుగులు సాధించాడు. అత్యధిక స్కోరు 52. ఇంచుమించు అశ్విన్‌లాగే సేమ్‌ హైట్‌లో బాల్‌ డెలివరీ చేసే మహేశ్‌.. బంతి విసరడానికి ముందు అతడిలాగే జంప్‌ చేస్తాడు కూడా! 

A post shared by Mahesh Pithiya (@themaheshpithiya99_)

అశూనే రోల్‌ మోడల్‌
నిజానికి అశ్వినే తన రోల్‌ మోడల్‌ అట. సాధారణ కుటుంబానికి చెందిన మహేశ్‌, 11 ఏళ్ల వయసు వచ్చే వరకు వాళ్ల ఇంట్లో టీవీ లేని కారణంగా అశ్విన్‌ బౌలిం‍గ్‌ను ఒక్కసారి కూడా చూడలేదట. అయితే, 2013లో వెస్టిండీస్‌తో అశూ ఆడిన మ్యాచ్‌ చూసినప్పటి నుంచి అతడు తన ఆరాధ్య క్రికెటర్‌గా మారిపోయాడట.

అచ్చం అశూ మాదిరే
ఇక టీమిండియాతో సిరీస్‌తో నేపథ్యంలో మహేశ్‌ గురించి తెలుసుకున్న ఆస్ట్రేలియా మేనేజ్‌మెంట్‌.. అతడిని సంప్రదించింది. క్రిక్‌బజ్‌ కథనంలో పేర్కొన్న ప్రకారం.. బెంగళూరులో ఆసీస్‌ క్రికెటర్లు బస చేస్తున్న హోటల్‌లోనే అతడు కూడా ఉన్నాడు.


PC: Instagram

అంతేకాదు.. కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌, వైస్‌ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌, వరల్డ్‌ నంబర్‌ 1 టెస్టు బ్యాటర్‌ మార్నస్‌ లబుషేన్‌లతో పాటు కలిసి ప్రస్తుతం ఒకే బస్సులో ప్రయాణిస్తూ ఎప్పటికప్పుడు వారికి అందబాటులో ఉంటున్నాడు. 

ఈ క్రమంలో ఆలూర్‌లోని కేఎస్‌సీఏ గ్రౌండ్‌లో స్మిత్‌, మ్యాట్‌ రెన్షాలు మహేశ్‌ బౌలింగ్‌లో ప్రాక్టీసు చేశారు. ఈ సందర్భంగా వాళ్లు మాట్లాడుతూ.. ‘‘ఈ అబ్బాయి అచ్చం అశ్విన్‌ లాగే బౌలింగ్‌ చేస్తున్నాడు’’ అంటూ ప్రశంసించారు. ఇక స్మిత్‌కు మహేశ్‌ బౌలింగ్‌ చేస్తున్న వీడియోలు సోషల్‌ మీడియా దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

నాడు 21 వికెట్లతో చెలరేగిన అశ్విన్‌
2017లో ఆస్ట్రేలియా చివరిగా సారిగా భారత్‌లో టెస్టు సిరీస్‌ ఆడింది. అప్పుడు టీమిండియా స్టార్‌ స్పిన్నర్‌ అశ్విన్‌ ఏకంగా 21 వికెట్లు పడగొట్టాడు. ఇక ఈసారి అశూతో పాటు రవీంద్ర జడేజాకు.. వీరిద్దరికి తోడు అద్భుత ఫామ్‌లో ఉన్న అక్షర్‌ పటేల్‌ రూపంలో ఆసీస్‌ బ్యాటర్లకు ముప్పు ఎదురుకానుంది. 

అప్పుడు టీమిండియాదే సిరీస్‌
ఇక నాటి సిరీస్‌లో భాగంగా పుణెలో జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా 333 పరుగుల భారీ తేడాతో గెలుపొందగా.. బెంగళూరు మ్యాచ్‌లో భారత్‌ 75 పరుగులతో విజయం సాధించింది. ఇక రాంచి వేదికగా జరిగిన మూడో టెస్టు డ్రాగా ముగియగా.. ఆఖరిదైన నాలుగో టెస్టులో టీమిండియా 8 వికెట్ల తేడాతో గెలిచింది.

ధర్మశాల మ్యాచ్‌లో జయకేతనం ఎగురవేయడం ద్వారా సిరీస్‌ను కైవసం చేసుకుంది. కాగా బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ -2023 నేపథ్యంలో.. స్పిన్‌ను సమర్థంగా ఎదుర్కొనే క్రమంలో కోచింగ్‌ బృందంలో ఆస్ట్రేలియా మేనేజ్‌మెంట్‌ ఇప్పటికే డానియెల్‌ వెటోరీకి చోటు కల్పించింది. ఇలా పక్కా ప్రణాళికతో టీమిండియాను ఎదుర్కొనేందుకు సిద్ధమైంది. ఇక ఫిబ్రవరి 9 నుంచి ఇరు జట్ల మధ్య సిరీస్‌ ఆరంభం కానుంది.

చదవండి: Shubman Gill: శుబ్‌మన్‌తో జోడీ కలపండి ప్లీజ్‌! ఆ ఛాన్స్‌ లేదు.. మ్యాచ్‌ ఫిక్స్‌ అయిపోయింది!
Joginder Sharma: రిటైర్మెంట్‌ ప్రకటించిన 2007 టి20 ప్రపంచకప్‌ హీరో

మరిన్ని వార్తలు