CPL 2023: రాణించిన రాయుడు.. అయినా..!

26 Aug, 2023 16:01 IST|Sakshi

కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో భారత ఆటగాడు అంబటి తిరుపతి రాయుడు ఎట్టకేలకు బ్యాట్‌ ఝులిపించాడు. సీపీఎల్‌-2023లో సెయింట్‌ కిట్స్‌ అండ్‌ నెవిస్‌ పేట్రియాట్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న రాయుడు.. గయానా వారియర్స్‌తో నిన్న (ఆగస్ట్‌ 25) జరిగిన మ్యాచ్‌లో ఓ మోస్తరు స్కోర్‌తో (24 బంతుల్లో 32; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించాడు. అయితే రాయుడు రాణించినా అతని జట్టు సెయింట్‌ కిట్స్‌ మాత్రం ఓటమిపాలైంది.

రాయుడుతో పాటు ఎవిన్‌ లెవిస్‌ (24 బంతుల్లో 48; ఫోర్‌, 6 సిక్సర్లు) చెలరేగాడు. సెయింట్‌ కిట్స్‌ ఇన్నింగ్స్‌లో రాయుడు, లెవిస్‌, జాషువ డిసిల్వ (10) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. గయానా బౌలర్‌ గుడకేశ్‌ మోటీ (4-0-29-4) తన స్పిన్‌ మాయాజాలంతో సెయింట్‌ కిట్స్‌ పతనాన్ని శాశించాడు. మోటీకి ఇమ్రాన్‌ తాహిర్‌ (2/35), ఓడియన్‌ స్మిత్‌ (1/13), కీమో పాల్‌ (1/25), రొమారియో షెపర్డ్‌ (1/14), డ్వేన్‌ ప్రిటోరియస్‌ (1/12) సహకరించారు. 

అంతకుముందు గయానా తొలుత బ్యాటింగ్‌ చేస్తూ.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 197 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. షాయ్‌ హోప్‌ (54) అర్ధసెంచరీతో రాణించగా.. సైమ్‌ అయూబ్‌ (31), హెట్‌మైర్‌ (26), కీమో పాల్‌ (25), రొమారియో షెపర్డ్‌ (25 నాటౌట్‌) పర్వాలేదనిపించారు. సెయింట్‌ కిట్స్‌ బౌలర్లలో ఓషేన్‌ థామస్‌ 3 వికెట్లు పడగొట్టగా.. డోమినిక్‌ డ్రేక్స్‌ 2, కాట్రెల్‌, నవీద్‌ తలో వికెట్‌ దక్కించుకున్నారు. అనంతరం 198 పరుగుల భారీ లక్ష్యఛేదనకు దిగిన సెయింట్‌ కిట్స్‌.. మోటీ ధాటికి 16.5 ఓవర్లలోనే (132 ఆలౌట్‌) చాపచుట్టేసింది. 

మరిన్ని వార్తలు