Italian Grand Prix: తొమ్మిదేళ్ల తర్వాత...

13 Sep, 2021 06:32 IST|Sakshi

ఫార్ములావన్‌లో గ్రాండ్‌ప్రి టైటిల్‌ నెగ్గిన మెక్‌లారెన్‌ జట్టు

ఇటలీ గ్రాండ్‌ప్రిలో విజేతగా నిలిచిన రికియార్డో

మోంజా (ఇటలీ): దాదాపు తొమ్మిదేళ్ల విరామం తర్వాత ఫార్ములావన్‌ (ఎఫ్‌1) గ్రాండ్‌ప్రిలో మెక్‌లారెన్‌ జట్టు విజేతగా నిలిచింది. 2012లో జరిగిన బ్రెజిల్‌ గ్రాండ్‌ప్రిలో చివరిసారిగా విజేతగా నిలిచిన ఆ జట్టు ఇన్నేళ్లకు ఇటలీ గ్రాండ్‌ప్రిలో మెరిసింది. ఆదివారం జరిగిన ఇటలీ గ్రాండ్‌ప్రి ప్రధాన రేసులో మెక్‌లారెన్‌ డ్రైవర్‌ డానియెల్‌ రికియార్డో చాంపియన్‌గా నిలిచాడు. 53 ల్యాప్‌ల రేసును అతడు అందరికంటే ముందుగా గంటా 21 నిమిషాల 54.367 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు.

2018 మొనాకో తర్వాత మళ్లీ రికియార్డో ఒక ఎఫ్‌1 రేసులో గెలుపొందడం ఇదే తొలిసారి. రేసును రెండో స్థానం నుంచి ఆరంభించిన రికియార్డో... ట్రాక్‌ తొలి మలుపులోనే వెర్‌స్టాపెన్‌ను అధిగమించి ఆధిక్యంలోకి వచ్చాడు. అనంతరం తన లీడ్‌ను నిలబెట్టుకున్న అతడు విజేతగా నిలిచాడు. 1.747 సెకన్ల తేడాతో రేసును ముగించిన నోరిస్‌ (మెక్‌లారెన్‌) రెండో స్థానంలో నిలువగా... మూడో స్థానంలో బొటాస్‌ (మెర్సిడెస్‌) నిలిచాడు. హోమ్‌ గ్రాండ్‌ప్రిలో ఫెరారీ డ్రైవర్లు లెక్‌లెర్క్‌ నాలుగో స్థానంలో... సెయింజ్‌ ఆరో స్థానంలో నిలిచారు.

>
మరిన్ని వార్తలు