Daryl Mitchell: ఆ ఒక్క నిర్ణయం.. ధోని లాంటి దిగ్గజాల సరసన నిలబెట్టింది

2 Feb, 2022 16:11 IST|Sakshi

న్యూజిలాండ్‌ బ్యాట్స్‌మన్‌ డారెల్‌ మిచెల్‌ ఐసీసీ స్పిరిట్‌ ఆఫ్‌ క్రికెట్‌ 2021 అవార్డును గెలుచుకున్నాడు. గతేడాది టి20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన సెమీఫైనల్లో ఒత్తిడిలో సింగిల్‌ తీయకుండా తెలివితో వ్యహరించి క్రీడాస్పూర్తిని ప్రదర్శించినందుకు మిచెల్‌కు ఈ అవార్డు ఇస్తున్నట్లు  ఐసీసీ పేర్కొంది. విషయంలోకి వెళితే.. 2021 నవంబర్‌ 10న ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌ టి20 ప్రపంచకప్‌ తొలి సెమీఫైనల్లో తలపడ్డాయి. హోరాహోరీగా సాగిన ఆ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ గెలిచి ఫైనల్లో అడుగుపెట్టింది.

చదవండి: ఓటమి కొనితెచ్చుకోవడమంటే ఇదే.. అనుభవించండి

తొలుత బ్యాటిగ్‌ చేసిన ఇంగ్లండ్‌ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. మొయిన్‌ అలీ అర్థసెంచరీతో రాణించాడు. అనంతరం బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ లక్ష్యం దిశగా సాగుతుంది. ఇన్నింగ్స్‌ 18వ ఓవర్‌ ఆదిల్‌ రషీద్‌ వేశాడు. క్రీజులో జిమ్మీ నీషమ్‌, డారిల్‌ మిచెల్‌ ఉన్నారు. స్ట్రైకింగ్‌లో ఉన్న నీషమ్‌.. రషీద్‌ వేసిన బంతిని మిడాఫ్‌ దిశగా ఆడాడు. ఇక్కడ ఈజీ సింగిల్‌కు ఆస్కారమున్నప్పటికి.. బంతి కోసం పరిగెడుతున్న రషీద్‌కు మిచెల్‌ అడ్డువచ్చాడు. ఇక్కడే మిచెల్‌ క్రీడాస్పూర్తిని ప్రదర్శించాడు. రషీద్‌ను తోసేసి పరుగుకు వెళ్లొచ్చు.. కానీ మిచెల్‌ అలా చేయకుండా సింగిల్‌ వద్దంటూ నీషమ్‌ను వారించాడు. అలా చేస్తే అబ్‌స్ట్రకింగ్‌ ది ఫీల్డ్‌ కిందకు వస్తుందని.. ఇది మంచి పద్దతి కాదని మ్యాచ్‌ అనంతరం మిచెల్‌ వివరించాడు. 

కాగా డారిల్‌ మిచెల్‌ క్రీడాస్పూర్తికి పలువురు మాజీ ఆటగాళ్లు ఫిదా అయ్యారు. అంత ఒత్తిడిలోనూ మిచెల్‌ తెలివిగా వ్యవహరించి క్రీడాస్పూర్తిని ప్రదర్శించడం గొప్ప విషయమని లైవ్‌ కామెంటరీలో ఉన్న మాజీ క్రికెటర్‌ నాసిర్‌ హుస్సెన్‌ తెలిపాడు. ఇక మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ గెలవడంలో డారిల్‌ మిచెల్‌ కీలకపాత్ర పోషించాడు. 47 బంతుల్లో 72 పరుగులతో నాటౌట్‌గా నిలిచి జట్టును ఫైనల్‌కు చేర్చాడు. అయితే ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిన న్యూజిలాండ్‌ రన్నరప్‌తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

ఇక ఐసీసీ స్పిరిట్‌ ఆఫ్‌ క్రికెట్‌ అవార్డును గెలిచిన నాలుగో న్యూజిలాండ్‌ ఆటగాడిగా డారిల్‌ మిచెల్‌ నిలిచాడు. అంతకముందు డేనియల్‌ వెటోరి, బ్రెండన్‌ మెక్‌కల్లమ్‌, కేన్‌ విలియమ్సన్‌లు ఈ అవార్డు తీసుకున్నారు. ఇక టీమిండియా నుంచి ఐసీసీ స్పిరిట్‌ ఆఫ్‌ క్రికెట్‌ అవార్డును ఎంఎస్‌ ధోని (2011), విరాట్‌ కోహ్లి(2019)లో గెలుచుకోవడం విశేషం. 

మరిన్ని వార్తలు