WTC Final: నంబర్‌ 1 బౌలర్‌ అశూ.. నంబర్‌ 1 ఆల్‌రౌండర్‌ జడ్డూ.. ఫైనల్లో ఆడేది ఎవరో ఒక్కరే!

16 Mar, 2023 10:35 IST|Sakshi

WTC Final- India Vs Australia: ‘‘గతంలోనే తుది జట్టు ఎంపిక విషయంలో మేనేజ్‌మెంట్‌ తప్పు చేసింది. ఇద్దరు స్పిన్నర్లను ఆడించి మూల్యం చెల్లించింది. అక్కడ ఆడాల్సింది ఒకే ఒక్క మ్యాచ్‌. కాబట్టి జట్టు ఎంపిక విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. 

టెస్టు చాంపియన్‌షిప్‌ సైకిల్‌లో ఆఖరి మ్యాచ్‌ అయినందున చాలా మంది ఆటగాళ్లకు కూడా అదే చివరి మ్యాచ్‌ అవుతుంది. కాబట్టి తుది జట్టు కూర్పుపై స్పష్టత ఉంటేనే అత్యుత్తమ టీమ్‌ ఎంపిక సాధ్యమవుతుంది. గతంలో మాదిరి ఈసారి పొరపాట్లు దొర్లకుండా ఉండాలంటే అశ్విన్‌ లేదంటే జడేజాలలో ఎవరో ఒకరిని తప్పించాలి. నా అభిప్రాయం ప్రకారం వీళ్లిద్దరి మధ్య పోటీ ఉంటే కచ్చితంగా జడేజా వైపే మొగ్గు ఉంటుంది.

ఎందుకంటే అతడు అశ్విన్‌ కంటే ఇంకాస్త మెరుగ్గా బ్యాటింగ్‌ చేయగలడు. ఇక వీళ్లిద్దరు ఫిట్‌గా ఉన్నారంటే అక్షర్‌ పటేల్‌కు కచ్చితంగా జట్టులో స్థానం దక్కదు. నాకు తెలిసి అతడికి బదులు శార్దూల్‌ జట్టులోకి వస్తాడు’’ అని టీమిండియా వెటరన్‌ క్రికెటర్‌, కామెంటేటర్‌ దినేశ్‌ కార్తిక్‌ అన్నాడు.

అక్షర్‌కు నో చాన్స్‌
ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్లో భారత తుది జట్టు కూర్పుపై ఈ మేరకు క్రిక్‌బజ్‌ షోలో తన అభిప్రాయాలు పంచుకున్నాడు. స్పిన్‌ విభాగంలో రవిచంద్రన్‌ అశ్విన్‌ కంటే రవీంద్ర జడేజాకే తుది జట్టులో ఆడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అభిప్రాయపడ్డాడు. ఇక మరో స్పిన్‌ ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌కు జట్టులో స్థానం దక్కడం కష్టమేనని పేర్కొన్నాడు.

కాగా స్వదేశంలో ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌ గెలవడంలో అశ్విన్‌, జడేజా, అక్షర్‌ పటేల్‌ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. అద్భుత ప్రదర్శనతో అశ్విన్‌, జడ్డూ ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌ అవార్డు అందుకున్నారు. అక్షర్‌ బ్యాట్‌ ఝులిపించి రోహిత్‌ సేన బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ గెలవడంలో తన వంతు సహాయం చేశాడు. 

ఈ క్రమంలో ఆస్ట్రేలియాతో పాటు డబ్ల్యూటీసీ ఫైనల్‌ చేరుకున్న టీమిండియా ఇంగ్లండ్‌ వేదికగా జూన్‌ 7- 11 వరకు టెస్టు మ్యాచ్‌ ఆడనుంది. కాగా విదేశాల్లో.. ముఖ్యంగా పేస్‌కు అనుకూలించే పిచ్‌లపై తుదిజట్టులో సీమర్లకే అవకాశాలు ఎక్కువన్న నేపథ్యంలో డీకే ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

నంబర్‌ 1 అశూ, జడ్డూ
ఇదిలా ఉంటే.. డబ్ల్యూటీసీ 2019-21 ఫైనల్లో న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో అశ్విన్‌, జడేజా ఇద్దరూ ఆడారు. అశూ 4 వికెట్లు తీసి 29 పరుగులు చేయగా.. 31 పరుగులు చేసిన జడ్డూ.. ఒక వికెట్‌ తీశారు. ఈ మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో గెలుపొందిన న్యూజిలాండ్‌ ట్రోఫీని కైవసం చేసుకుంది. కాగా అశ్విన్‌ ప్రస్తుతం ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో బౌలర్ల జాబితాలో నంబర్‌1గా ఉండగా.. జడ్డూ ఆల్‌రౌండర్ల విభాగంలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. 

చదవండి: LLC 2023: క్రిస్‌ గేల్‌ వీరవిహారం.. వయసు పెరుగుతున్నా తగ్గేదేలేదంటున్న యూనివర్సల్‌ బాస్‌
WPL 2023: హమ్మ‍య్య,.. మొత్తానికి ఆర్‌సీబీ గెలిచింది

మరిన్ని వార్తలు