WPL 2023: క్రికెటర్‌ మనసు దోచుకున్న మల్లికా సాగర్‌

14 Feb, 2023 15:35 IST|Sakshi

ముంబై వేదికగా సోమవారం జరిగిన వుమెన్స్‌ ప్రీమియర్‌ లీగ్‌(WPL) వేలం ముగిసిన సంగతి తెలిసిందే. ఈ వేలంలో మొత్తంగా 87 మంది క్రికెటర్లు అమ్ముడు పోయారు. క్రికెటర్లను కొనుగోలు చేయడానికి ఐదు ఫ్రాంచైజీలు రూ.59.5 కోట్ల మొత్తాన్ని వెచ్చించాయి. టీమిండియా స్టార్‌ ఓపెనర్‌ స్మృతి మంధాన అత్యధిక ధర దక్కించుకున్న క్రికెటర్‌గా నిలిచింది. మంధానను రూ.3.4 కోట్ల భారీ ధరకు  రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కొనుగోలు చేసింది. అదే విధంగా ఆస్ట్రేలియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ ఆష్లీ గార్డనర్‌ను గుజరాత్ జెయింట్స్ రూ. 3.2 కోట్లను వెచ్చించి సొంతం చేసుకుంది. వేలంలో అత్యధిక ధర పలికిన విదేశీ క్రికెటర్‌గా గార్డనర్‌ నిలిచింది.

ఈ సంగతి పక్కనబెడితే.. తొలిసారి నిర్వహించిన వుమెన్స్‌ ప్లేయర్ల వేలంలో మల్లికా సాగర్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తొట్టతొలి వేలాన్ని నిర్వహించేందుకు మల్లికా సాగర్‌ అద్వానీ అనే యువతిని బీసీసీఐ ప్రత్యేకంగా నియమించిన సంగతి తెలిసిందే. తన వాక్చాతుర్యం, అందంతో అందరిని ఆకట్టుకున్న మల్లికా సాగర్‌పై టీమిండియా సీనియర్‌ క్రికెటర్‌ దినేశ్‌ కార్తిక్‌ ప్రశంసల వర్షం కురిపించాడు.

''మల్లికా సాగర్‌ ఒక టెర్రిఫిక్‌ ఆక‌్షనీర్‌. తాను ఏం చెప్పాలనుకుందో అది సూటిగా, స్పష్టంగా, కాన్ఫిడెంట్‌గా పాజిటివ్‌ టోన్‌తో చెప్పింది. వుమెన్స్‌ ప్రీమియర్‌ లీగ్‌ వేలాన్ని నిర్వహించేందుకు తాను అర్హురాలినని నిరూపించుకుంది. ఈ విషయంలో బీసీసీఐని అభినందించి తీరాలి.. వెల్‌డన్‌ బీసీసీఐ'' అంటూ పేర్కొన్నాడు. ‍కాగా మల్లిక సాగర్‌పై ప్రశంసల వర్షం కురిపించిన దినేశ్‌ కార్తిక్‌పై అభిమానులు తమదైన శైలిలో స్పందించారు. ''మల్లిక సాగర్‌పై కార్తిక్‌ మనసు పారేసుకున్నట్లున్నాడు''.. '' తన వాయిస్‌, మాడ్యులేషన్‌ అతనికి బాగా నచ్చినట్లుంది.'' అంటూ కామెంట్స్‌ చేశారు.

ముంబైకి చెందిన మల్లికా సాగర్‌ పురాతన పెయింటింగ్స్‌ (ఆర్ట్)ను సేకరించే వృత్తిలో ఉన్నారు. ఆమె మోడ్రన్‌ అండ్‌ కాన్‌టెంపరరీ ఇండియన్‌ ఆర్ట్‌ అనే ముంబై ఆధారిత సంస్థకు ఆర్ట్‌ కలెక్టర్‌ కన్సల్టెంట్‌గా పని చేస్తున్నారు. అలాగే ఆమె ఆర్ట్‌ ఇండియా కన్సల్టెంట్స్‌ ఫర్మ్‌లో పార్ట్‌నర్‌గా కూడా ఉన్నారు. ఆక్షన్‌లు నిర్వహించడంలోనూ మల్లికకు పూర్వ అనుభవం ఉంది. పుండోల్స్‌ అనే ముంబై బేస్డ్‌ సంస్థ తరఫున వైవిధ్యభరితంగా వేలం నిర్వహించి గతంలో ఆమె వార్తల్లోకెక్కారు. క్రీడలకు సంబంధించిన వేలం నిర్వహణలోనూ మల్లికకు ప్రవేశం ఉంది. 2021 ప్రో కబడ్డీ లీగ్‌ వేలాన్ని ఆమె సక్సెస్‌ఫుల్‌గా నిర్వహించింది.

చదవండి: స్టార్‌ ఫుట్‌బాలర్‌ సంచలన నిర్ణయం

మరిన్ని వార్తలు