Eng VS SA: స్టబ్స్‌ అద్భుత విన్యాసం.. ఒంటిచేత్తో అవలీలగా! ఇలాంటి క్యాచ్‌ ఎప్పుడూ చూసి ఉండరు!

1 Aug, 2022 13:49 IST|Sakshi
ఒంటిచేత్తో క్యాచ్‌ అందుకున్న స్టబ్స్‌(PC: ECB Twitter)

England vs South Africa, 3rd T20I: ఇంగ్లండ్‌తో మూడో టీ20 మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా యువ ఆటగాడు ట్రిస్టన్‌ స్టబ్స్‌ అద్భుత క్యాచ్‌తో మెరిశాడు. కళ్లు చెదిరే రీతిలో ఒంటిచేత్తో బంతిని ఒడిసి పట్టి ప్రత్యర్థి బ్యాటర్‌ ఆట కట్టించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. కాగా దక్షిణాఫ్రికా ఇంగ్లండ్‌ పర్యటనలో భాగంగా ఇరు జట్ల మధ్య ఆదివారం ఆఖరి టీ20 జరిగింది.

సౌతాంప్టన్‌ వేదికగా సాగిన ఈ మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లండ్‌ టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ క్రమంలో ఓపెనర్‌ హెండ్రిక్స్‌(70 పరుగులు)కు తోడు మార్కరమ్‌ అజేయ అర్ధ శతకంతో రాణించడంతో ప్రొటిస్‌ భారీ స్కోరు చేయగలిగింది.

నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. ఇక లక్ష్య ఛేదనకు దిగిన బట్లర్‌ బృందానికి దక్షిణాఫ్రికా బౌలర్లు చుక్కలు చూపించారు. ముఖ్యంగా తబ్రేజ్‌ షంసీ 5 వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్‌ పతనం శాసించాడు. దీంతో 16.4 ఓవర్లకే ఇంగ్లండ్‌ కథ ముగిసిపోయింది. 90 పరుగుల తేడాతో మూడో టీ20లో గెలిచి.. దణాఫ్రికా సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఇంగ్లండ్‌ ఆటగాళ్లలో జానీ బెయిర్‌స్టో 27 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. ప్రొటిస్‌ బౌలర్‌ షంసీ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు అందుకున్నాడు.  

హైలెట్‌ క్యాచ్‌..
ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్‌ టాపార్డర్‌ కుప్పకూలిన వేళ.. ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగాడు మొయిన్‌ అలీ. అతడైనా జట్టును ఆదుకుంటాడని భావిస్తే.. పదో ఓవర్‌లోనే అవుటయ్యాడు. మార్కరమ్‌ బౌలింగ్‌లో బంతిని అలీ గాల్లోకి లేపగానే.. స్టబ్స్‌ ఏమాత్రం ఆలస్యం చేయకుండా దూసుకువచ్చాడు.

గాల్లోకి ఎగిరి ఒంటిచేత్తో బంతిని ఒడిసిపట్టాడు. అసాధ్యమనుకున్న క్యాచ్‌ను విజయవంతంగా అందుకుని ఆటగాళ్లతో పాటు ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాడు. సంచలన క్యాచ్‌తో మ్యాచ్‌లో హైలెట్‌గా నిలిచాడు.

ఇందుకు సంబంధించిన వీడియోను ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. ఇలాంటి అత్యుత్తమ క్యాచ్‌ ఎప్పుడూ చూసి ఉండరు అని పేర్కొంది. ఇందుకు.. నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. సూపర్‌మాన్‌ అంటూ స్టబ్స్‌ను కొనియాడుతున్నారు. కాగా.. ఈ మ్యాచ్‌లో బ్యాటర్‌గా మాత్రం స్టబ్స్‌ విఫలమయ్యాడు. 4 బంతుల్లో 8 పరుగులు చేసి అవుటయ్యాడు.

అయితే, మొదటి టీ20 మ్యాచ్‌లో మాత్రం అతడి అద్భుత ఇన్నింగ్స్‌ను ఎవరూ అంత తేలికగా మర్చిపోలేరు. ఈ మ్యాచ్‌లో స్టబ్స్‌ 28 బంతుల్లోనే రెండు ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 72 పరుగులు చేశాడు. కానీ జట్టును గెలిపించలేకపోయాడు.  
చదవండి: IND VS WI: రెండో టీ20కి ముందు రోహిత్‌ను ఊరిస్తున్న ప్రపంచ రికార్డు
India Probable XI: అలా అయితే అయ్యర్‌పై వేటు తప్పదు! ఓపెనర్‌గా మళ్లీ అతడే!?

మరిన్ని వార్తలు