టెస్ట్‌ క్రికెట్‌ రూపు రేఖలను మార్చేస్తున్న ఇంగ్లండ్‌.. టీ20ల తరహాలో విధ్వంసం

27 Jun, 2022 21:48 IST|Sakshi

బెన్‌ స్టోక్స్‌ నేతృత్వంలోని ప్రస్తుత ఇంగ్లండ్‌ జట్టు టెస్ట్‌ క్రికెట్‌ రూపు రేఖలను మార్చేస్తుంది. ఇంగ్లండ్‌లోనే పురుడు పోసుకున్న సుదీర్ఘ ఫార్మాట్‌ను స్టోక్స్‌ సేన కొత్త పుంతలు తొక్కిస్తుంది. స్టోక్స్‌ టీమ్‌ టీ20ల తరహాలో ప్రత్యర్ధిపై విరుచుకుపడుతూ టెస్ట్‌ క్రికెట్‌లో వేగాన్ని మరింత పెంచేస్తుంది. ఇందుకు ఉదాహరణే తాజాగా న్యూజిలాండ్‌తో ముగిసిన టెస్ట్‌ సిరీస్‌. 3 మ్యాచ్‌ల ఈ టెస్ట్‌ సిరీస్‌లో కొత్త కెప్టెన్‌ (స్టోక్స్‌), కొత్త కోచ్‌ (బ్రెండన్‌ మెక్‌కల్లమ్‌) ఆధ్వర్యంలో ఇంగ్లండ్‌ జట్టు ఊహలకందని విధంగా రెచ్చిపోయింది. 

మూడు మ్యాచ్‌ల్లో భారీ స్కోర్లను అలవోకగా ఛేదించి ప్రత్యర్ధిని ప్రేక్షక పాత్రకు పరిమితం చేసింది. ఇంగ్లండ్‌ బ్యాటర్ల విధ్వంసం ధాటికి న్యూజిలాండ్‌ ఆటగాడు డారిల్‌ మిచెల్‌ అత్యుత్తమ ప్రదర్శన (3 మ్యాచ్‌ల్లో హ్యాట్రిక్‌ శతకాలతో 53 పరుగులు) మరుగున పడింది. ఇంగ్లీష్‌ ఆటగాళ్లలో ముఖ్యంగా జానీ బెయిర్‌స్టో విధ్వంసం గురించి మాట్లాడుకోవాలి. 32 ఏళ్ల ఈ వికెట్‌కీపర్‌ కమ్‌ బ్యాటర్‌ ప్రస్థానం న్యూజిలాండ్‌తో సిరీస్‌కు ముందు తర్వాత అని చెప్పుకోవాలి. ఈ సిరీస్‌లో బెయిర్‌స్టో విధ్వంసం ఆ రేంజ్‌లో సాగింది. 

3 మ్యాచ్‌ల్లో అతను 120కి పైగా స్ట్రయిక్‌ రేట్‌తో (394 పరుగులు) 2 శతకాలు, ఓ హాఫ్‌ సెంచరీ బాదాడు. తొలి టెస్ట్‌లో విఫలమైన బెయిర్‌స్టో రెండో టెస్ట్‌లో (ఛేదనలో) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 299 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టీ20 తరహాలో విధ్వంసం (92 బంతుల్లో 136; 14 ఫోర్లు, 7 సిక్సర్లు) సృష్టించి తన జట్టును గెలిపించాడు. తాజాగా ముగిసిన మూడో టెస్ట్‌లో బెయిర్‌స్టో విధ్వంస పర్వం కొనసాగింది. తొలి ఇన్నింగ్స్‌లో భారీ శతకం (157 బంతుల్లో 162; 24 ఫోర్లు) బాదిన అతను.. రెండో ఇన్నింగ్స్‌లో (296 పరుగుల ఛేదనలో) 30 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ పూర్తి చేసి ప్రపంచ ఛాంపియన్‌ను క్లీన్‌స్వీప్‌ చేయడంలో ముఖ్యభూమిక పోషించాడు. 

ఈ ఇన్నింగ్స్‌లో బెయిర్‌స్టో (44 బంతుల్లో 71; 9 ఫోర్లు, సిక్సర్లు) అజేయమై అర్ధశతకం సాధించి ఇంగ్లండ్‌ను విజయతీరాలకు చేర్చాడు. బెయిర్‌స్టో తర్వాత బెన్‌ స్టోక్స్‌ ఈ సిరీస్‌ ఆ స్థాయి విధ్వంసం సృష్టించాడు. స్టోక్స్‌ 5 ఇన్నింగ్స్‌ల్లో 82.55 స్ట్రయిక్‌ రేట్‌తో 2 హాఫ్‌ సెంచరీల సాయంతో 194 పరుగులు సాధించాడు. ఈ సిరీస్‌లో స్టోక్స్‌ సాధించింది తక్కువ పరుగులే అయినా లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో వేగంగా పరుగులు సాధించాడు. కివీస్‌ను వైట్‌వాష్‌ చేయడంలో జో రూట్‌ కాంట్రిబ్యూషన్‌ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. రూట్‌ 6 ఇన్నింగ్స్‌ల్లో 99 సగటున 74 స్ట్రయిక్‌ రేట్‌తో 396 పరుగులు సాధించి సిరీస్‌లో టాప్‌ 2 రన్‌ స్కోరర్‌గా నిలిచాడు.  
చదవండి: మరోసారి రెచ్చిపోయిన బెయిర్‌స్టో.. కివీస్‌ను ఊడ్చేసిన ఇంగ్లండ్‌


 

మరిన్ని వార్తలు