'ఉమ్రాన్‌కు అంత సీన్‌ లేదు.. పాక్‌లో అలాంటోళ్లు చాలా మంది ఉన్నారు’

4 Feb, 2023 16:53 IST|Sakshi

పాకిస్తాన్‌ మాజీ ఆటగాడు సొహైల్‌ ఖాన్‌ భారత్‌పై మరోసారి అక్కసు వెళ్లగక్కాడు. ఇటీవలే కోహ్లిపై వివాదస్పద వాఖ్యలు చేసిన సొహైల్‌ ఖాన్‌.. తాజాగా టీమిండియా యువ పేస్‌ సంచలనం ఉమ్రాన్‌ మాలిక్‌ను హేళన చేశాడు.

పాకిస్తాన్‌ క్రికెట్‌లో ఉమ్రాన్‌ మాలిక్‌ వంటి చాలా మంది బౌలర్లు ఉన్నారని అతడు తెలిపాడు. పాక్‌ దేశీవాళీ  క్రికెట్‌లో దాదాపు 12-15 మం‍ది వరకు ఉమ్రాన్‌ వేసిన స్పీడ్‌తో బౌలింగ్‌ చేయగలరని గొప్పలు పలికాడు.

ఉమ్రాన్‌ మంచి బౌలరే.. కానీ?
"ఉమ్రాన్‌ మాలిక్‌ మంచి పేసర్‌ బౌలర్‌. నేను ఇప్పటికే ఒకట్రెండు మ్యాచ్‌ల్లో అతడు ప్రదర్శన చూశాను. అతడు రన్‌ప్‌ కూడా అద్భుతంగా ఉంటుంది. అయితే కేవలం పేస్‌  ఆధారంగానే అతడు అద్భుతమైన బౌలర్‌ అని అనడం సరికాదు. అలా అయితే ప్రస్తుతం పాకిస్తాన్‌ దేశీవాళీ క్రికెట్‌లో 150-155 కంటే ఎక్కువ వేగంతో బౌలింగ్‌ చేసే చాలా మంది ఫాస్ట్ బౌలర్ల ఉన్నారు.

నాకు తెలిసినంతవరకు ప్రస్తుతం 12-15 మంది వరకు ఇదే స్పీడ్‌తో బౌలింగ్‌ చేయగలరు. లాహోర్ క్వాలండర్స్ నిర్వహించే  ట్రయల్స్‌ను ఓసారి సందర్శించినట్లయితే ఇటువంటి ఫాస్ట్‌బౌలర్లు చాలా మంది కన్పిస్తారు. అదే విధంగా మా జాతీయ జట్టు కూడా ఉమ్రాన్ మాలిక్ వంటి బౌలర్లతో నిండి ఉంది. షాహీన్, నసీమ్ షా, హరీస్ రౌఫ్‌ వంటి వారు ఈ కోవకు చెందినవారే. ఇంకా నేను చాలా పేర్లు చెప్పగలను" అని అతడు పేర్కొన్నాడు.

అక్తర్‌ రికార్డను ఎవరూ బ్రేక్‌ చేయలేరు!
షోయబ్ అక్తర్ అత్యంత వేగవంతమైన డెలివరి రికార్డు(161.3) రికార్డును ఎవరూ బద్దలు కొట్టలేరు. ఎందుకుంటే ఆ రోజుల్లో షోయబ్ చాలా కష్టపడ్డాడు. ఒక రోజులో 32 రౌండ్ల రన్నింగ్‌ పూర్తి చేసేవాడు. నేను వారం మొత్తానికి  10 రౌండ్లు మాత్రమే పరిగెత్తెవాడిని. ఇప్పుడు ఏ బౌలర్‌ కూడా అంత సాధన చేయలేడు. కాబట్టి అతడి రికార్డు ఎప్పటికీ బ్రేక్‌ కాదు అని  సొహైల్‌ అన్నాడు. కాగా భవిష్యత్తులో అక్తర్‌ రికార్డును ఉమ్రాన్‌ బ్రేక్‌ చేస్తాడని పలువురు మాజీ అభిప్రాయపడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సొహైల్‌ చేసిన వాఖ్యలు మరోసారి వివాదాస్పదమవుతున్నాయి.
చదవండి: సొంతగడ్డపై భారత జట్టు బలహీనం.. ఆసీస్‌దే ట్రోఫీ: టీమిండియా మాజీ హెడ్‌కోచ్‌

మరిన్ని వార్తలు