Suryakumar Yadav: సూర్యకుమార్‌ వన్డే కెరీర్‌ ముగిసినట్లే!

23 Mar, 2023 07:30 IST|Sakshi

ఆస్ట్రేలియాతో సిరీస్‌ ఓడిపోయినప్పటికి టీమిండియా మళ్లీ ఫుంజుకునే అవకాశం ఉంది. కానీ ఒక్క ఆటగాడి వన్డే కెరీర్‌ మాత్రం ప్రమాదంలో పడినట్లే. అతనే సూర్యకుమార్‌ యాదవ్‌. టి20ల్లో సూపర్‌స్టార్‌గా పేరు పొందిన సూర్యకుమార్‌ వన్డేల్లో మాత్రం ఘోరంగా విఫలమవుతూ వస్తున్నాడు. ఆసీస్‌తో వన్డే సిరీస్‌లో వరుసగా మూడు వన్డేల్లో గోల్డెన్‌ డకౌట్‌గా వెనుదిరిగి చెత్త ప్రదర్శన కనబరిచాడు. టి20ల్లో దూకుడుగా ఆడినప్పటికి బంతిని చూసి ఆడడం అతనికి అలవాటు.

కానీ వన్డేలకు వచ్చేసరికి అతని బ్యాట్‌ మూగబోయింది. క్రీజులో నిలదొక్కుకునే సమయం కూడా ఇవ్వకుండా ప్రత్యర్థి బౌలర్లు అతన్ని పెవిలియన్‌ చేరుస్తున్నారు. వరుసగా మూడుసార్లు గోల్డెన్‌ డక్‌ అయ్యాడంటే వన్డేలకు సూర్య పనికిరానట్లే. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో సూర్య ఔటైన విధానం చూస్తే అసలు ఆడుతుంది సూర్యనేనా అన్న అనుమానం వచ్చింది. మూడుసార్లు తొలి బంతికే వెనుదిరిగాడు. శ్రేయాస్‌ అయ్యర్‌ లోటును తీరుస్తాడని సూర్యను వన్డేలకు ఎంపికచేస్తే వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంలో విఫలమయ్యాడు. ఇక రానున్న కాలంలో సూర్య వన్డేలు ఆడేది అనుమానమే. 

ఎందుకంటే ప్రస్తుతం సూర్యకుమార్‌ వయస్సు 32 ఏళ్లు. మహా అయితే మరో రెండేళ్లు ఆడొచ్చు. ఈ ప్రదర్శనతో అతను వన్డే వరల్డ్‌కప్‌ జట్టుకు ఎంపికవడం కూడా అనుమానమే. అందుకే అభిమానులు కూడా సూర్యకుమార్‌పై దుమ్మెత్తిపోశారు. కొందరి కోసం టాలెంట్‌ ఉన్న ఆటగాళ్లను తొక్కేస్తున్నారంటూ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సూర్య కేవలం టి20 మెటిరీయల్‌ మాత్రమే.. సంజూ శాంసన్‌కు అవకాశం ఇచ్చినా బాగుండేది.. కొద్దిరోజులయితే టి20ల్లో కూడా సూర్య భారంగా మారే అవకాశం ఉంది. అంటూ కామెంట్స్‌ చేశారు.

మరిన్ని వార్తలు