FIFA WC 2022: చారిత్రాత్మక విజయం; ఇదెక్కడి ఆచారమో ఏంటో.. ఆకట్టుకున్న జపాన్‌ జట్టు

24 Nov, 2022 12:10 IST|Sakshi

ఖతర్‌ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌లో సంచలనాలు నమోదవుతూనే ఉన్నాయి. మొన్న అర్జెంటీనాకు సౌదీ అరేబియా షాక్‌ ఇస్తే.. బుధవారం నాలుగుసార్లు ఛాంపియన్‌ అయిన జర్మనీని ఆసియా టీమ్‌ జపాన్‌ 1-2 తేడాతో ఓడించి చారిత్రాత్మక విజయాన్ని అందుకుంది. కాగా అంతకముందే ఈ వరల్డ్‌కప్‌లో జపాన్‌ అభిమానులు తమ ప్రత్యేకతను చాటుకున్నారు.

ఫిఫా వరల్డ్‌‍కప్‌లో ఆరంభ మ్యాచ్‌ అయిన ఖతర్‌, ఈక్వెడార్‌ పోరు ముగిసిన తర్వాత స్టాండ్స్‌లో నిండిపోయిన చెత్తను మొత్తం క్లీన్‌ చేయడం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.జపాన్ ప్రజలు పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యమిస్తారు.అక్కడ  రోడ్డు మీద వెళ్తూ చాక్లెట్ తింటే ఆ ప్యాక్ ను  జేబులోనే పెట్టుకుని రోడ్డు మీద ఉన్న  చెత్త డబ్బాల్లో పడేస్తారు. అందుకే జపాన్ లో వీధులు పరిశుభ్రంగా కనిపిస్తాయి. ఇదే సూత్రాన్ని జపాన్ ఫుట్‌బాల్ ఫ్యాన్స్ ఖతర్ స్టేడియంలో కూడా పాటించారు.   

తాజాగా అభిమానులకు తామేం తీసిపోమని జపాన్‌ ఫుట్‌బాల్‌ టీం ఆటగాళ్లు కూడా తమ లాకర్‌ రూంను శుభ్రం చేసుకున్నారు. జర్మనీతో మ్యాచ్‌లో సంచలన విజయం అనంతరం డ్రెస్సింగ్‌ రూమ్‌ చేరుకున్న జపాన్‌ జట్టు లాకర్‌ రూంలో చిందర వందరగా పడి ఉన్న వస్తువులను, బట్టలను ఆటగాళ్లంతా కలిసి చక్కగా సర్దుకున్నారు. తమకు వచ్చిన ఆహార పాకెట్లతో సహా టవల్స్‌, వాటర్‌ బాటిల్స్‌, బట్టలను నీట్‌గా సెంటర్‌లో ఉన్న టేబుల్‌పై పెట్టారు. అనంతరం లాకర్‌ రూం క్లీన్‌ చేసిన ఫోటోను ట్విటర్‌లో షేర్‌ చేశారు. 

ఇదే ఫోటోను ఫిఫా షేర్‌ చేస్తూ ఇలా రాసుకొచ్చింది.''జర్మనీపై చారిత్రక విజయం అనంతరం స్టేడియంలో ఉన్న చెత్తను జపాన్‌ అభిమానులు క్లీన్‌ చేస్తే.. లాకర్‌ రూంలో ఉన్న చెత్తను ఆటగాళ్లు ‍శుభ్రం చేసుకున్నారు.. ఆ తర్వాత తమ వస్తువులను ఎంతో నీట్‌గా సర్దుకున్నారు. ఇది నిజంగా చూడడానికి చాలా బాగుంది. అంటూ ట్వీట్‌ చేసింది.

చదవండి: FIFA WC: ‘నోరు మూసుకొని’ నిరసన! జర్మనీ ఆటగాళ్లు ఇలా ఎందుకు చేశారంటే

మరిన్ని వార్తలు