Harpreet Bhatia Forgery Case: అక్రమంగా ప్రభుత్వ ఉద్యోగం.. రంజీ క్రికెటర్‌పై చీటింగ్‌ కేసు

13 May, 2022 11:44 IST|Sakshi

ఛత్తీస్‌గడ్‌ రంజీ  క్రికెట్ జట్టుకు కెప్టెన్ గా ఉన్న హర్ప్రీత్ సింగ్ భాటియాపై ఆ రాష్ట్ర పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. నకిలీ ధృవపత్రాలతో అతడు అక్రమంగా ప్రభుత్వ ఉద్యోగం  పొందాడనే ఆరోపణలతో  అతడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. రాష్ట్రంలోని బలోద్ జిల్లాకు చెందిన హర్‌ప్రీత్‌ ప్రస్తుతం ఇండియన్ ఆడిట్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ ఆఫీస్ లో ఆడిటర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. 2014లో భాటియా  ఆకట్టుకునే ప్రదర్శనతో రంజీ జట్టులో రాణించి తద్వారా ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాడు. అయితే ఆ క్రమంలో తనకు డిగ్రీ ఉన్నదని, అందుకు సంబంధించిన  మార్కుల మెమో, ఇతర ధ్రువపత్రాలను సమర్పించాడు. 

తాను బుందేల్‌ఖండ్‌ యూనివర్సిటీ (ఝాన్సీ, మధ్యప్రదేశ్) లో బీకామ్ డిగ్రీ చదివానని, అందుకు సంబంధించిన మార్కుల షీట్ ను కూడా ప్రభుత్వ ఉద్యోగం పొందేప్పుడు జతపరిచాడు. అయితే  ప్రభుత్వ అధికారులు.. అతడి డిగ్రీ పై అనుమానాలు వచ్చి బుందేల్‌ఖండ్‌ యూనివర్సిటీని సంప్రదించగా అసలు బండారం బయటపడింది.  భాటియా ఆ వర్సిటీలో చదవనేలేదని తేలింది. దీంతో నకిలీ పత్రాలను సమర్పించినందుకు గాను  భాటియాపై  ఐపీసీ సెక్షన్ 420 (చీటింగ్), 467 (ఫోర్జరీ) ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ పూర్తయ్యాక నేరం రుజువైతే అతడు ఉద్యోగాన్ని కోల్పోవడమే గాక జైలుకు కూడా వెళ్లాల్సి ఉంటుంది.

భారత్ తరఫున 2010లో అండర్-19 ప్రపంచకప్ ఆడిన భాటియా.. అదే ఏడాది కేకేఆర్ తరఫున ఐపీఎల్ లో ఆడాడు. 2011 లో పూణే వారియర్స్  లో,  2017లో విరాట్ కోహ్లి సారథ్యంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు కూడా ప్రాతినిథ్యం వహించాడు. కానీ పెద్దగా రాణించలేదు.  ఇక ఈ ఏడాది రంజీ సీజన్ లో ఛత్తీస్‌గడ్‌  లీగ్ దశలోనే ఇంటిబాట పట్టింది.

చదవండి: ఇలాంటి బౌలింగ్‌ అరుదు.. దిగ్గజ ఆటగాడు గుర్తురావడం పక్కా!

మరిన్ని వార్తలు