Rafael Nadal Vs Novak Djokovic: జొకోవిచ్‌కు షాకిచ్చిన నాదల్‌.. వరల్డ్‌ నంబర్‌ 1కు ఘోర పరాజయం

1 Jun, 2022 08:27 IST|Sakshi
రాఫెల్‌ నాదల్‌ విజయాందం(PC: French Open Twitter)

French Open 2022: ఫ్రెంచ్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నీలో స్పెయిన్‌ స్టార్‌ రాఫెల్‌ నాదల్‌ అదరగొట్టాడు. పురుషుల సింగిల్స్‌ విభాగంలో డిఫెండింగ్‌ చాంపియన్‌ సెర్బియన్‌ స్టార్‌ నొవాక్‌ జొకోవిచ్‌ను ఓడించాడు. ఫిలిప్‌ చార్టియర్‌ కోర్టులో బుధవారం తెల్లవారుజామున నాలుగు గంటల 12 నిమిషాల పాటు జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో జొకోవిచ్‌కు చుక్కలు చూపించిన నాదల్‌.. 6-2, 4-6, 6-2, 7-6 (7/4) తేడాతో అతడిపై విజయం సాధించాడు.

తద్వారా ఫ్రెంచ్‌ ఓపెన్‌-2022 సెమీ ఫైనల్లో అడుగుపెట్టాడు. కాగా ఈ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో నాదల్‌ సెమీస్‌ చేరడం ఇది 15వ సారి. ఈ నేపథ్యంలో వరల్డ్‌ నంబర్‌ 1 జొకోవిచ్‌పై విజయానంతరం నాదల్‌ మాట్లాడుతూ.. ‘‘ఎన్నెన్నో భావోద్వేగాలు నన్ను చుట్టుముట్టాయి. ఇక్కడ ఆడటం నిజంగా నాకు ఎప్పుడూ ప్రత్యేకమే.

అతడి(జొకోవిచ్‌)తో పోటీ పడటం అతిపెద్ద సవాలు.. మనలోని అత్యుత్తమ ప్రతిభ కనబరిచినపుడు మాత్రమే అతడిని ఓడించే అవకాశం ఉంటుంది’’ అని ఉద్వేగానికి లోనయ్యాడు. ఇక నాదల్‌కు అభినందనలు తెలిపిన జొకోవిచ్‌.. తనొక గొప్ప చాంపియన్‌ అని, ఈ విజయానికి నాదల్‌ అర్హుడు అంటూ ప్రశంసలు కురిపించాడు.  కాగా శుక్రవారం జరుగనున్న సెమీస్‌లో మూడో సీడ్‌ అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌(జర్మనీ)తో నాదల్‌ ఫైనల్‌ బెర్తు కోసం పోటీపడనున్నాడు.

చదవండి: French Open: కోకో కేక.. తొలిసారి గ్రాండ్‌స్లామ్‌లో సెమీస్‌కు అర్హత

మరిన్ని వార్తలు