Gautam Gambhir: అతని కంటే సూర్యకుమార్‌ యాదవ్‌ ప్రతిభావంతుడు..అందుకే..

11 Sep, 2021 12:38 IST|Sakshi

న్యూఢిల్లీ: టీమిండియా సంచలనం సూర్యకుమార్‌ యాదవ్‌పై భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ప్రశంసల వర్షం కురిపించాడు. టీ20 ప్రపంచకప్‌ కోసం బీసీసీఐ ప్రకటించిన 15 మంది జట్టు సభ్యుల్లో శ్రేయస్ అయ్యర్ స్థానంలో సూర్యకుమార్ యాదవ్‌కు చోటు దక్కడంపై గౌతమ్ గంభీర్ స్పందించాడు. స్టార్ స్పోర్ట్స్ షోలో ఆయన మాట్లాడుతూ.. "శ్రేయస్‌ అయ్యర్‌తో పోల్చి చూస్తే సూర్యకుమార్‌ ఎంతో ప్రతిభావంతుడు. అతను బహుముఖ ప్రజ్ఞాశాలి. అసాధారణమైన ఆటగాడు. ప్రస్తుత టీ20 ఫార్మాట్‌లో సూర్యలాంటి ఆటగాళ్లే జట్టుకు చాలా అవసరం. ఎందుకంటే లాప్‌, లేట్‌ కట్‌, ఎక్స్‌ ట్రా కవర్ షాట్‌లతోపాటు అన్ని రకాల షాట్లను అతడు ఆడగలడు.

నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగినప్పుడు జట్టు అంతకుముందే రెండు వికెట్లు కోల్పోయి ఉండొచ్చు. అప్పుడు పరుగులు రాబట్టడం కోసం వేగంగా ఆడతాడు. అలాంటి సమయంలో సూర్య మైదానంలో దిగితే బాగుంటుంది'’ అని అన్నాడు. కాగా భారత్-ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల సిరీస్‌లో భుజం గాయంతో టీమిండియా జట్టుకు శ్రేయాస్ అయ్యర్ దూరమయ్యాడు.

ఈ క్రమంలో... ఐపీఎల్ ఫేజ్ 2 తో శ్రేయస్ అయ్యర్ క్రికెట్‌లోకి  మళ్లీ ఎంట్రీ ఇస్తున్నాడు. అయితే, బీసీసీఐ ప్రకటించిన తుది జట్టులో అతడికి స్థానం దక్కలేదు. స్టాండ్‌బై ఆటగాడిగా అతడిని ఎంపిక చేశారు. మరోవైపు.. టీ 20 వరల్డ్‌కప్‌లో భారత్‌ తరపున ప్రాతినిథ్యం వహించే అవకాశం లభించినందుకు చాలా గర్వంగా ఉందని, తన కలలు నిజమయ్యాయని సూర్యకుమార్ యాదవ్‌ భావోద్వేగ ట్వీట్‌ చేశాడు.

చదవండి: Gautam Gambhir: మెంటర్‌గా ధోని చేసేదేం ఉండదు.. గంభీర్‌ సంచలన వ్యాఖ్యలు

మరిన్ని వార్తలు