మన బాణం బంగారం

6 Oct, 2023 03:55 IST|Sakshi

ఆర్చరీలో భారత మహిళల, పురుషుల జట్లకు స్వర్ణ పతకాలు

జ్యోతి సురేఖ, అదితి స్వామి, పర్ణీత్‌ కౌర్‌ బృందం అద్భుతం

ఓజస్‌ ప్రవీణ్, అభిషేక్‌ వర్మ,    ప్రథమేశ్‌ జట్టు సంచలనం

ఆసియా క్రీడల్లో పన్నెండో రోజు భారత క్రీడాకారులు పసిడి ప్రదర్శనతో అలరించారు. ఆర్చరీ టీమ్‌ విభాగంలో రెండు స్వర్ణ పతకాలు సొంతం  చేసుకోగా... స్క్వాష్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగంలో దీపిక పల్లికల్‌–హరీందర్‌పాల్‌ సింగ్‌ జోడీ బంగారు పతకంతో అదరగొట్టింది. స్క్వాష్‌ పురుషుల  సింగిల్స్‌ విభాగంలో భారత స్టార్‌ సౌరవ్‌ ఘోషాల్‌ రజతం నెగ్గి వరుసగా ఐదో ఆసియా క్రీడల్లోనూ పతకం సంపాదించడం విశేషం.

మహిళల  రెజ్లింగ్‌లో రైజింగ్‌ స్టార్‌ అంతిమ్‌ పంఘాల్‌ కాంస్య పతకంతో రాణించింది. బ్యాడ్మింటన్‌ పురుషుల సింగిల్స్‌లో హెచ్‌ఎస్‌ ప్రణయ్, డబుల్స్‌లో సాతి్వక్‌  సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి సెమీఫైనల్లోకి ప్రవేశించి  పతకాలను ఖరారు చేసుకున్నారు. పన్నెండో రోజు పోటీలు ముగిశాక భారత్‌ 21 స్వర్ణాలు,  32 రజతాలు, 33 కాంస్యాలతో కలిపి 86  పతకాలతో నాలుగో స్థానంలో కొనసాగుతోంది.   

హాంగ్జౌ: చైనా నేలపై భారత బాణం బంగారమైంది. ఆసియా క్రీడల ఆర్చరీ ఈవెంట్‌లో భారత మహిళల కాంపౌండ్‌ జట్టు తొలిసారి స్వర్ణ పతకం సాధించగా... భారత పురుషుల కాంపౌండ్‌ జట్టు 2014 తర్వాత మళ్లీ పసిడి పతకం సంపాదించింది. ఆంధ్రప్రదేశ్‌ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ, అదితి స్వామి, పర్ణీత్‌ కౌర్‌లతో కూడిన భారత మహిళల జట్టు ఫైనల్లో 230–229తో యి సువాన్‌ చెన్, హువాంగ్‌ ఐజు, లు యున్‌ వాంగ్‌లతో కూడిన చైనీస్‌ తైపీ జట్టును ఓడించి తొలిసారి ఆసియా క్రీడల చాంపియన్‌గా అవతరించింది.  సెమీఫైనల్లో భారత్‌ 233–219తో ఇండోనేసియా జట్టుపై, క్వార్టర్‌ ఫైనల్లో 231–220తో హాంకాంగ్‌ జట్టుపై విజయం సాధించింది.


2014 ఇంచియోన్‌ ఏషియాడ్‌లో జ్యోతి సురేఖ, త్రిషా దేబ్, పూర్వాషా షిండేలతో కూడిన భారత జట్టు కాంస్యం నెగ్గగా... 2018 జకార్తా ఏషియాడ్‌లో జ్యోతి సురేఖ, ముస్కాన్, మధుమితలతో కూడిన టీమిండియా రజతం కైవసం చేసుకుంది. మూడో ప్రయత్నంలో భారత్‌ ఖాతాలో స్వర్ణం చేరడం విశేషం. ఈ మూడుసార్లూ జ్యోతి సురేఖ జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించింది. ‘ఆసియా క్రీడల్లో తొలిసారి టీమ్‌ స్వర్ణం నెగ్గినందుకు సంతోషంగా ఉన్నాం. శనివారం నా వ్యక్తిగత విభాగం ఫైనల్‌ కూడా ఉంది. ఆ ఈవెంట్‌లోనూ స్వర్ణమే లక్ష్యంగా బరిలోకి దిగుతా’ అని విజయవాడకు చెందిన 27 ఏళ్ల జ్యోతి సురేఖ వ్యాఖ్యానించింది.

ఓజస్‌ ప్రవీణ్‌ దేవ్‌తలే, అభిషేక్‌ వర్మ, ప్రథమేశ్‌లతో కూడిన భారత పురుషుల కాంపౌండ్‌ జట్టు ఫైనల్లో 235–230తో జేహున్‌ జూ, జేవన్‌ యాంగ్, కింగ్‌ జాంగ్‌హోలతో కూడిన దక్షిణ కొరియా జట్టును ఓడించి బంగారు పతకం నెగ్గింది. సెమీఫైనల్లో భారత్‌ 235–224తో చైనీస్‌ తైపీపై, క్వార్టర్‌ ఫైనల్లో 235–221తో భూటాన్‌పై, తొలి రౌండ్‌లో 235–219తో సింగపూర్‌పై గెలుపొందింది. 2014 ఇంచియోన్‌ ఏషియాడ్‌లో రజత్‌ చౌహాన్, సందీప్‌ కుమార్, అభిషేక్‌ వర్మలతో కూడిన భారత జట్టు తొలిసారి పసిడి పతకం గెలిచింది.   

సురేఖ బృందానికి సీఎం జగన్‌ అభినందనలు 
సాక్షి, అమరావతి: తమ అద్భుతమైన ప్రదర్శనతో మహిళల ఆర్చరీ కాంపౌండ్‌ టీమ్‌ విభాగంలో స్వర్ణ పతకం సాధించిన వెన్నం జ్యోతి సురేఖ, పర్ణీత్‌ కౌర్, అదితిలను ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అభినందించారు. విజయ వాడకు చెందిన జ్యోతి సురేఖ సాధించిన విజయంపట్ల తనతో పాటు, ఆంధ్రప్రదేశ్‌ ఎంతో గర్వపడుతోందన్నారు. తెలుగు జెండా రెపరెపలాడుతోందంటూ సీఎం వైఎస్‌ జగన్‌ గురువారం ట్వీట్‌ చేశారు.  

మరిన్ని వార్తలు