సీడెడ్‌లకు చుక్కెదురు 

29 Sep, 2020 03:13 IST|Sakshi

తొలి రౌండ్‌లోనే ఓడిన గతేడాది రన్నరప్‌ వొండ్రుసోవా

సెరెనా, ముగురుజా ముందంజ

ఫ్రెంచ్‌ ఓపెన్‌ టోర్నీ

పారిస్‌: వరుసగా రెండో రోజూ ఫ్రెంచ్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌ మహిళల సింగిల్స్‌ విభాగంలో సంచలన ఫలితాలు నమోదయ్యాయి. గత ఏడాది రన్నరప్, 15వ సీడ్‌ మర్కెటా వొండ్రుసోవా (చెక్‌ రిపబ్లిక్‌), 12వ సీడ్‌ మాడిసన్‌ కీస్‌ (అమెరికా), 22వ సీడ్‌ కరోలినా ముకోవా (చెక్‌ రిపబ్లిక్‌), 28వ సీడ్‌ స్వెత్లానా కుజ్‌నెత్సోవా (రష్యా) తొలి రౌండ్‌లోనే ఇంటిముఖం పట్టారు. సోమవారం జరిగిన తొలి రౌండ్‌ మ్యాచ్‌లో ఇగా స్వియాటెక్‌ (పోలాండ్‌) 6–1, 6–2తో వొండ్రుసోవాను బోల్తా కొట్టించింది. 63 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో స్వియాటెక్‌ తన ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్‌ చేసింది. ఇతర మ్యాచ్‌ల్లో షుయె జాంగ్‌ (చైనా) 6–3, 7–6 (7/2)తో కీస్‌పై... క్రిస్టినా మెకేల్‌ (అమెరికా) 6–2, 6–4తో ముకోవాపై... పావ్లీచెంకోవా (రష్యా) 6–1, 2–6, 6–1తో కుజ్‌నెత్సోవాపై సంచలన విజయాలు సాధించారు.

మరోవైపు టాప్‌–10లోని నలుగురు క్రీడాకారిణులు రెండో రౌండ్‌లో కి అడుగుపెట్టారు. ఆరో సీడ్‌ సెరెనా విలియమ్స్‌ (అమెరికా) 7–6 (7/2), 6–0తో క్రిస్టీ ఆన్‌ (అమెరికా)పై, ఏడో సీడ్‌ పెట్రా క్విటోవా (చెక్‌ రిపబ్లిక్‌) 6–3, 7–5తో ఒసీన్‌ డోడిన్‌ (ఫ్రాన్స్‌)పై, ఐదో సీడ్‌ కికి బెర్‌టెన్స్‌ (నెదర్లాండ్స్‌) 2–6, 6–2, 6–0తో జవాత్‌స్కా (ఉక్రెయిన్‌)పై, మూడో సీడ్‌ స్వితోలినా (ఉక్రెయిన్‌) 7–6 (7/2), 6–4తో వర్వరా గ్రషెవా (రష్యా) పై గెలిచారు. 2016 చాంపియన్‌ ముగురుజా 7–5, 4–6, 8–6తో 81వ ర్యాంకర్‌ తమారా జిదాన్‌సెక్‌ (స్లొవేకియా)పై శ్రమించి గెలిచింది.  

నాదల్‌ శుభారంభం... 
పురుషుల సింగిల్స్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ నాదల్‌ (స్పెయిన్‌), గతేడాది రన్నరప్‌ థీమ్‌ (ఆస్ట్రియా) శుభారంభం చేశారు. తొలి రౌండ్‌లో నాదల్‌ 6–4, 6–4, 6–2తో జెరాసిమోవ్‌ (బెలారస్‌)పై, థీమ్‌ 6–4, 6–3, 6–3తో సిలిచ్‌ (క్రొయేషియా)పై నెగ్గారు. మరోవైపు ఎనిమిదో సీడ్‌ మోన్‌ఫిల్స్‌ (ఫ్రాన్స్‌) 4–6, 5–7, 6–3, 3–6తో బుబ్లిక్‌ (కజకిస్తాన్‌) చేతిలో, 14వ సీడ్‌ ఫాగ్‌నిని (ఇటలీ) 5–7, 6–3, 6–7 (1/7), 0–6తో కుకుష్‌కిన్‌ (కజకిస్తాన్‌) చేతిలో ఓడిపోయారు.  

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా