డబుల్‌ ధమాకా..భారత్‌ ఖాతాలో రెండు పతకాలు..!

4 May, 2022 00:55 IST|Sakshi

న్యూఢిల్లీ: వరుసగా రెండో రోజు ప్రపంచ జూనియర్‌ వెయిట్‌లిఫ్టింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత్‌ ఖాతాలో పతకాలు చేరాయి. తొలి రోజు మహిళల 45 కేజీల విభాగంలో హర్షద శరద్‌ గరుడ్‌ స్వర్ణ పతకం నెగ్గగా... రెండో రోజు మహిళల 49 కేజీల విభాగంలోజ్ఞానేశ్వరి యాదవ్‌ రజతం... వి.రితిక కాంస్య పతకం సాధించారు. గ్రీస్‌లో జరుగుతున్న ఈ మెగా ఈవెంట్‌లో చత్తీస్‌గఢ్‌కు చెందిన 19 ఏళ్ల జ్ఞానేశ్వరి మొత్తం 156 కేజీలు (స్నాచ్‌లో 73+క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో 83) బరువెత్తి రెండో స్థానంలో నిలిచింది.

18 ఏళ్ల రితిక 150 కేజీలు (స్నాచ్‌లో 69+క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో 81) బరువెత్తి మూడో స్థానాన్ని సంపాదించింది. టోక్యో ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేత, ఇండోనేసియాకు చెందిన విండీ కంతిక ఐసా 185 కేజీలు (స్నాచ్‌లో 83+క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో 102) బరువెత్తి స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. చైనా, ఉత్తర కొరియా, థాయ్‌లాండ్, రొమేనియా, బల్గేరియా తదితర దేశాలు ఈ టోర్నీకి దూరంగా ఉండగా... ఉక్రెయిన్‌తో యుద్ధం నేపథ్యంలో రష్యాను, రష్యాకు సహచరిస్తున్న బెలారస్‌ను ఈ మెగా ఈవెంట్‌లో బరిలోకి దిగకుండా అంతర్జా తీయ వెయిట్‌లిఫ్టింగ్‌ సమాఖ్య నిషేధం విధించింది. గత జూనియర్‌ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రష్యా ఏకంగా తొమ్మిది పతకాలు సాధించింది. 

మరిన్ని వార్తలు