ఆ విషయంలో సచిన్ నుంచి చాలా నేర్చుకున్నా: టోక్యో స్వర్ణ పతక విజేత 

13 Sep, 2021 08:15 IST|Sakshi

న్యూఢిల్లీ: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఆటతీరు తనపై తీవ్ర ప్రభావం చూపిందని టోక్యో పారాలింపిక్స్ బ్యాడ్మింటన్ గోల్డ్ మెడలిస్ట్ ప్రమోద్ భగత్ అన్నాడు. ప్రపంచ ఛాంపియన్‌షిప్ సహా ఎన్నో విజయాలకు సచినే కారణమని పేర్కొన్నాడు. ఒత్తిడిలోనూ ప్రశాంతంగా ఎలా ఉండాలో సచిన్ నుంచి నేర్చుకున్నానని తెలిపాడు. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో భగత్‌ మాట్లాడుతూ... చిన్నప్పుడు క్రికెట్ ఆడేవాడినని, దూరదర్శన్‌లో క్రికెట్‌ మ్యాచ్‌లు చూస్తూ పెరిగానని అన్నాడు. దిగ్గజ క్రికెటర్‌ సచిన్‌ చాలా ప్రశాంతంగా కనిపించేవాడని, మైదానంలో అతడి ప్రవర్తన నన్ను ఆకట్టుకునేదని, అది తనపై తీవ్ర ప్రభావం చూపిందని తెలిపాడు. సచిన్‌ క్రీడా స్ఫూర్తి తన లాంటి చాలామంది క్రీడాకారులపై ప్రభావం చూపిందని పేర్కొన్నాడు. 

SL3 విభాగంలో ప్రపంచ ఛాంపియన్ అయిన భగత్ గతవారం టోక్యోలో జరిగిన ఫైనల్‌లో గ్రేట్ బ్రిటన్ ఆటగాడు డేనియల్ బెతెల్‌ను ఓడించడం ద్వారా పసిడిని సొంతం చేసుకున్నాడు. హోరాహోరీగా సాగిన ఈ తుది సమరంలో ప్రమోద్ భగత్ నెమ్మదిగా ప్రారంభించినప్పటికీ.. ఆట కొనసాగే క్రమంలో దూకుడును ప్రదర్శించాడు. రెండో గేమ్‌లో ప్రత్యర్ధి అటాకింగ్ గేమ్ ఆడటంతో ఒకానొక సమయంలో ప్రమోద్‌ 8 పాయింట్లు వెనుకపడ్డాడు. అయినప్పటికీ అనూహ్యంగా పుంజుకుని దేశానికి స్వర్ణ పతకం అందించాడు. ఇదిలా ఉంటే, 33 ఏళ్ల ప్రమోద్ భగత్ నాలుగేళ్ల వయసులో ఉండగా.. పోలియో బారినపడ్డాడు. అయినా ఎంతో దైర్యం, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాడు. ఆటపై మక్కువ పెంచుకుని అందులో రాణించాడు. అందుకు ఫలితంగా విశ్వక్రీడల్లో గోల్డ్ మెడల్ దక్కింది.
చదవండి: యూఎస్‌ ఓపెన్‌ ఫైనల్లో పెను సంచలనం.. ప్రపంచ నంబర్‌వన్‌కు షాక్

మరిన్ని వార్తలు