Asia Cup 2022: 'ఓపెనర్‌గా కేఎల్‌ రాహుల్‌ వద్దు.. అతడినే రోహిత్‌ జోడిగా పంపండి'

12 Aug, 2022 12:35 IST|Sakshi

టీ20 ప్రపంచకప్‌-2022కు ముందు భారత్‌ మరో మెగా టోర్నీకు సిద్దమవుతోంది. ఆగస్టు 27 నుంచి జరగనున్న ఆసియాకప్‌లో టీమిండియా పాల్గొనుంది. ఇప్పటికే ఆసియా కప్ కోసం భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. గత కొంత కాలంగా జట్టుకు దూరమైన భారత స్టార్‌ ఆటగాడు కేఎల్‌ రాహుల్‌ తిరిగి జట్టులోకి వచ్చాడు. దీంతో భారత ఓపెనింగ్‌ సమస్య తీరినట్టే అని చెప్పుకోవాలి.

కాగా గాయం కారణంగా రాహుల్‌ జట్టుకు దూరం కావడంతో గత కొన్ని సిరీస్‌ల నుంచి భారత్‌ పలు ఓపెనింగ్‌ జోడీలను ప్రయోగించింది. అందులో భాగంగానే వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌లో రోహిత్‌ జోడిగా సూర్యకుమార్‌ యాదవ్‌ భారత ఇన్నింగ్స్‌ను ఆరంభించాడు.

అయితే ఓపెనర్‌గా సరికొత్త అవతారమెత్తిన సూర్య పర్వాలేదనపించాడు. ఈ సిరీస్‌లో నాలుగు మ్యాచ్‌లు ఆడిన సూర్య 135 పరుగులు సాధించాడు. ఇది ఇలా ఉండగా.. రాహుల్‌ జట్టులోకి వచ్చినప్పటికీ రోహిత్‌ శర్మతో కలిసి సూర్యకుమార్ యాదవ్ భారత ఇన్నింగ్స్‌ను ప్రారంభించాలని  పాకిస్తాన్ మాజీ క్రికెటర్‌ డానిష్ కనేరియా అభిప్రాయపడ్డాడు.

ఈ నేపథ్యంలో తన యూట్యూబ్‌ ఛానల్‌లో మాట్లాడుతూ.. "ఆసియాకప్‌లో రోహిత్‌ శర్మ జోడిగా సూర్యకుమార్ యాదవ్ బరిలోకి దిగాలని నేను భావిస్తున్నాను. అతడు విండీస్‌ సిరీస్‌లో రోహిత్‌ కలిసి అద్భుతమైన భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. కేఎల్‌ రాహుల్‌ జట్టులోకి వచ్చినప్పటికీ.. అతడు మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌కు వస్తే బాగుటుంది.

రాహుల్‌ ఏ స్థానంలోనైనా అద్భుతంగా రాణించగలడు. అతడు గతంలో చాలా సార్లు మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌ చేయడం మనం చూశాం. కాబట్టి రోహిత్‌తో కలిసి సూర్యకుమార్ టీమిండియా ఇన్నింగ్స్‌ను ఆరంభిస్తే బాగుటుంది" అని పేర్కొన్నాడు. కాగా రాహుల్‌ ప్రస్తుతం పూర్తి స్థాయి ఫిట్‌నెస్‌ సాధించడంతో జింబాబ్వే సిరీస్‌కు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.

ఆసియా కప్‌కు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, ఆర్. అశ్విన్, యుజ్వేంద్ర చాహల్, రవి బిష్ణోయ్, భువనేశ్వర్ కుమార్, అర్ష్‌దీప్‌ సింగ్, అవేష్ ఖాన్

మరిన్ని వార్తలు