సీఈఓ సాహ్నిపై వేటుకు ఐసీసీ సిద్ధం!

11 Mar, 2021 05:00 IST|Sakshi

వ్యవహార శైలే కారణం

ప్రస్తుతం సెలవులో సాహ్ని

దుబాయ్‌: అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ)లో కలకలం రేగింది. ఎవరినీ పట్టించుకోకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్న చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (సీఈఓ)  మను సాహ్నిని సాగనంపేందుకు రంగం సిద్ధమైంది. బోర్డులో ఎవరితోనూ కలుపుగోలుతనం లేని ఆయన నియంతృత్వ పోకడలతో అందరికి మింగుడు పడని ఉన్నతాధికారిగా తయారయ్యారు. సభ్యులే కాదు బోర్డు సహచరులు, కింది స్థాయి అధికారులు సైతం భరించలేనంత కరకుగా ప్రవర్తిస్తున్న ఆయన్ని ప్రస్తుతానికైతే సెలవుపై పంపించారు.

రాజీనామా చేయించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. ‘రాజీ’పడకపోతే ఇక తొలగించడమైన చేస్తాం కానీ ఏమాత్రం కొనసాగించేందుకు సిద్ధంగా లేమని ఐసీసీ వర్గాలు, సభ్యదేశాలు ఏకాభిప్రాయానికి వచ్చేశాయి. 2019లో జరిగిన ఐసీసీ ప్రపంచకప్‌ అనంతరం డేవ్‌ రిచర్డ్‌సన్‌ స్థానంలో 56 ఏళ్ల సాహ్ని సీఈఓ బాధ్యతలు చేపట్టారు. 2022 వరకు పదవిలో ఉండాల్సిన ఆయనకు అందరితోనూ చెడింది. ముక్కోపితత్వంతో వ్యవహరించే ఆయన శైలిపై విమర్శలు రావడంతో విచారణ చేపట్టారు. ప్రముఖ సంస్థ ప్రైజ్‌ వాటర్‌హౌజ్‌ కూపర్‌ అంతర్గతంగా చేపట్టిన ఈ దర్యాప్తులో ప్రతీ ఒక్కరు సాహ్ని వ్యవహారశైలిని తులనాడినవారే ఉన్నారు... కానీ ఏ ఒక్కరు సమర్థించలేదు. ఈ నేపథ్యంలో ఐసీసీ ఉన్నతాధికారుల బోర్డు ఆయన్ని మంగళవారమే సెలవుపై పంపింది.

బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి సాహ్ని ఏకస్వామ్యంగా సాగిపోతున్నారు. సమష్టితత్వంతో, కలివిడిగా సాగాల్సివున్నా ఆయన మాత్రం ఇవేవి పట్టించుకోలేదు. ఐసీసీ విధాన నిర్ణయాల్లో సైతం తన మాటే నెగ్గించుకునే ప్రయత్నం చేశారు తప్ప... సహచరులు, సభ్యుల సూచనలకు విలువివ్వాలన్న స్పృహ కోల్పోయారు. సహచరులు, కింది స్థాయి ఉద్యోగులపై అయితే దుందుడుగా ప్రవర్తించేవారు. మధ్యే మార్గంగా సాగాల్సిన ఐసీసీ చైర్మన్‌ ఎన్నికల ప్రక్రియలోనూ ఇమ్రాన్‌ ఖాజా ఎన్నికయ్యేందుకు మొండిగా ప్రవర్తించారు. ఐసీసీలోని శాశ్వత సభ్యదేశాలే కాదు... మెజారిటీ అనుబంధ సభ్యదేశాల ప్రతినిధులకు ఇదేమాత్రం రుచించలేదు. ఐసీసీలోని ‘బిగ్‌–3’ సభ్యులైన బీసీసీఐ, ఈసీబీ, సీఏలు మను సాహ్నిని ఇక భరించలేమన్న నిర్ణయానికి రావడంతో సాగనంపక తప్పలేదు. గౌరవంగా రాజీనామా చేస్తే సరి లేదంటే ఐసీసీ తీర్మానం ద్వారా తొలగించడం అనివార్యమైంది. ఇందుకు ఐసీసీ బోర్డులోని 17 మంది సభ్యుల్లో 12 మంది మద్దతు అవసరమవుతుంది.

మరిన్ని వార్తలు